ఆర్టీసీ విలీనం బిల్లు ఆమోదంపై గవర్నర్, ప్రభుత్వం దోబూచులాట!

Saturday, September 7, 2024

ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ అనూహ్యంగా కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంటే, ఈ విషయమై అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టేందుకు ఆమోదం తెలపడంతో రాష్త్ర గవర్నర్ డా. తమిళసై సౌందరాజన్ జాప్యం చేస్తుండటం పట్ల ఆర్టీసీ కార్మికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ వైఖరికి నిరసనగా శనివారం ఉదయం 10 నుండి 12 గంటల వరకు తెలంగాణ వ్యాప్తంగా బస్సుల బంద్ పాటించారు. 

ఈ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం, గవర్నర్ ఎత్తుకు పై ఎత్తులు వేసినట్లు  కనిపిస్తున్నది.  గవర్నర్ కారణంగా బిల్లు ఆమోదంలో జాప్యం జరుగుతున్నట్లు చెప్పడం ద్వారా ఉద్యోగులను ఆందోళన చేపట్టే విధంగా ప్రభుత్వం చేయగా, వారిని గవర్నర్ చర్చలకు రాజ్ భవన్ కు ఆహ్వానించడం ద్వారా ప్రభుత్వ వైఖరిని వారి ముందు ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే బస్సుల బంద్ కు మద్దతుగా డిపో దాటి బస్సులు బయటికి వెళ్లొద్దంటూ ఆర్టీసీ ఉన్నతాధికారులకు రవాణా మంత్రి పువ్వాడ అజయ్ ఆదేశాలు జారీచేయడంపై  ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే బస్సులను బంద్ చేయించడంపై ప్రయాణికులు మండిపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ లో  బస్సుల్లేక విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 

ఆ తర్వాత, బిల్లుకు రాష్ట్ర గవర్నర్ ఆమోదించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మజ్దూర్ యూనియన్ పిలుపు మేరకు ఆర్టీసి ఉద్యోగులు రాజ్ భవన్ ముట్టడికి సిద్ధమయ్యారు. నక్లెస్ రోడ్డు నుంచి రాజ్ భవన్ వరకు ఆర్టీసి ఉద్యోగులు నిరసన తెలుపుతూ ర్యాలీగా బయల్దేరారు. దీంతో రాజ్ భవన్ వద్ద భారీగా పోలీసులు మొహరించారు. మరోవంక, టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లులో ఐదు అంశాలపై గవర్నర్‌ డా. తమిళిసై సౌందరరాజన్‌

ప్రభుత్వాన్ని వివరణ కోరారు. బిల్లుపై నిర్ణయం తీసుకునేందుకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.
”ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, లోన్ల వివరాలు లేవు. ఉద్యోగుల ప్రయోజనాలు ఎలా కాపాడుతారు? ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి పింఛన్‌ ఇస్తారా? విభజన చట్టం ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై వివరాలు లేవు. పదోన్నతులు, క్యాడర్‌ నార్మలైజేషన్‌లో న్యాయం ఎలా చేస్తారు?” అని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ ప్రశ్నించారు. అలాగే ఆర్టీసీ కార్మికుల భద్రత, ప్రయోజనాలపై స్పష్టమైన హామీలను తమిళిసై కోరారు.

1. 1958 నుండి ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్‌లు, వాటాలు, లోన్లు, ఇతర సహాయం గురించి బిల్లులో ఎలాంటి వివరాలు లేవు.

2. రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ IX ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై సమగ్ర వివరాలు బిల్లులో లేవు.

3. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పరిగణిస్తామని చెబుతున్న ప్రభుత్వం వారి సమస్యలకు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ చట్టం, కార్మిక చట్టాలు వర్తిస్తాయా? వారి ప్రయోజనాలు ఎలా కాపాడబడతాయి? అని ప్రశ్నించిన గవర్నర్.

4. విలీనం డ్రాఫ్ట్ బిల్లులో ఆర్టీసీ ఉద్యోగులు అందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెన్షన్ ఇస్తారా? వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని ప్రయోజనాలు ఇవ్వడానికి సంబంధించి స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరిన గవర్నర్.

5. ప్రభుత్వ ఉద్యోగులలో కండక్టర్, కంట్రోలర్ లాంటి తదితర పోస్టులు లేనందున వారి ప్రమోషన్లు, వారి క్యాడర్ నార్మలైజేషన్ లాంటి విషయాల్లో ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయం, ఇతర ప్రయోజనాలు అందే విధంగా స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరిన గవర్నర్.

ఆర్టీసీ కార్మికుల భద్రత, భవిష్యత్ ప్రయోజనాలపై మరిన్ని స్పష్టమైన హామీలను గవర్నర్ కోరారు. మరి ఈ ఐదు అంశాలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

ఇలా ఉండగా, ఆర్టీసీ ఉద్యోగులను కేసీఆర్ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని బిజెపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. శనివారం ఉదయం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ “ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని స్వాగతిస్తున్నాం. ఆర్టీసీ విలీనం బిజెపికి ఇష్టం లేదని ప్రచారం జరుగుతోంది” అంటూ మండిపడ్డారు. 

టిఆర్‌ఎస్ ప్రభుత్వం కావాలని బట్టకాల్చి గవర్నర్ మీద వేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఆర్టీసి ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తూ, బలవంతంగా రాజ్‌భవన్‌కు పంపుతున్నారని ఆరోపించారు. ఆర్టీసీ ఉద్యోగులకు రెండు పిఆర్సీలు బకాలు ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles