మార్గదర్శి కేసులో జగన్ ప్రభుత్వంకు ‘సుప్రీం’లో చుక్కెదురు

Thursday, May 2, 2024

ఎవ్వరూ ఫిర్యాదు చేయకపోయినా తమ ప్రభుత్వంకు అనుకూలంగా వార్తలు ఇవ్వడం లేదని ఈనాడు మీడియా గ్రూప్ పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అదే గ్రూప్ కు చెందిన మార్గదర్శి  సంస్థలపై ఏపీ సిఐడి ద్వారా వెంటాడి, కేసులు నమోదు చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంకు వరుసగా న్యాయస్థానాలలో చుక్కెదురవుతుంది

తాజాగా ఈ కేసులో సుప్రీంకోర్టులో సహితం ఎదురు దెబ్బ తగిలింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ వాదనలు అన్నింటిని అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. తెలంగాణ హైకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ కు కేసుల బదిలీకి సుప్రీంకోర్టు నిరాకరించింది. మార్గదర్శి కేసులను విచారించే న్యాయపరిధి తెలంగాణ హైకోర్టుకు లేదంటూ ఎపి ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

న్యాయపరిధి విషయాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎపి ప్రభుత్వం దాఖలు చేసిన బదిలీ పిటీషన్లు కాలం చెల్లినవని చెప్పిన సుప్రీంకోర్టు మార్గదర్శి ఎండి శైలజాకిరణ్‌పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి కూడా నిరాకరించింది.

మెరిట్స్ ఆధారంగా ఈ కేసును విచారించి నిర్ణయం తీసుకోవాలన్న జస్టిస్ జెకే మహేశ్వరి, జస్టిస్ కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం తెలంగాణ హైకోర్టుకు సూచించింది. మెరిట్స్ ఆధారంగా కేసును విచారించి తీర్పును వెలువరించే స్వేచ్ఛను తెలంగాణ హైకోర్టుకే ఇచ్చింది.

మార్గదర్శి చిట్‌ఫండ్ కేసు బదిలీపై ఎపి ప్రభుత్వం పిటిషన్లపై విచారణ అవసరం లేదని, విచారణ నిర్ణయం ఇప్పటికే జరిగినందున మళ్లీ విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. చెప్పాలనుకున్న విషయాలన్నీ తెలంగాణ హైకోర్టు ముందు చెప్పండని ఎపి న్యాయవాదులకు సూచించింది. 

అయితే, తెలంగాణ హైకోర్టు తుది ఆదేశాలు ఇచ్చాక రావచ్చని సుప్రీంకోర్టు ఎపి న్యాయవాదులకు స్పష్టం చేసింది. వాదనల సందర్భంగా చిట్ ఫండ్ పేరుతో నిధులను సేకరించి దారి మళ్ళించారని సుప్రీంకోర్టు దృష్టికి ఎపి ప్రభుత్వ న్యాయవాది తీసుకెళ్లారు. అలాగే ఎపిలోనే నేరం జరిగిందని, కాబట్టి కేసులన్నింటినీ ఎపి హైకోర్టుకు బదిలీ చేయాలని వాదించారు. 

చిట్ ఫండ్ నిధులను హైదరాబాదు నుంచి మ్యూచువల్ ఫండ్‌లోకి తరలించారని వాదించారు మార్గదర్శి తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి. కాజ్ ఆఫ్ యాక్షన్ హైదరాబాద్‌లోనే ఉంది కనుక తెలంగాణలోనే విచారణ జరపాలని వాదించారు. చివరికి ఎపి ప్రభుత్వ పిటిషన్లను ధర్మాసనం తోసిపుచ్చింది. 

మార్గదర్శి చిట్ పండ్స్ కేసుల విషయంలో ఎపి ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. ఒక్క ఫిర్యాదుదారు లేనప్పటికీ సంస్థ అవకతవకలకు పాల్పడుతోందని నగదు మళ్లిస్తోందని ఆరోపిస్తూ సోదాలు నిర్వహించారు. అలాగే చిట్స్ ను మూసేయడానికి, చందాదారులకు బహిరంగ నోటీసులు జారీ చేశారు. రాజకీయంగా కుట్ర చేసి వ్యాపార సంస్థను మూసి వేయడానికి జరుగుతున్న కుట్రగా మార్గదర్శి ఆరోపిస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles