ఏపీలో పార్టీ రాష్ట్ర నాయకత్వంపై పలువురు సీనియర్ నాయకుల నుండి తీవ్రమైన విమర్శలు వ్యక్తం అవుతున్నా, స్వయంగా పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తమ దృష్టికి తీసుకొచ్చినా ఫలితంలేక పార్టీకి రాజీనామా చేసినా బిజెపి కేంద్ర నాయకత్వంలో ఎటువంటి కదలిక కనిపించడం లేదు. ఆయన తన అసంతృప్తిని చాలాకాలంగా వ్యక్తం చేస్తున్నారు.
స్వయంగా ఢిల్లీకి వెళ్లి పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా, ఇతర సీనియర్ నాయకులకు విన్నవించి వచ్చారు. తొందరపడవద్దని యధాలాపంగా చెప్పడమే గాని, ఆయనను పార్టీకి దూరంగా వెళ్లవద్దని ఆప్ ప్రయత్నం చేయక పోవడం గమనార్హం. గతంలో ఆయన పార్టీ విడిచిపెట్టి, వైసిపిలో చేరడానికి సిద్దపడినప్పుడు స్వయంగా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఫోన్ చేసి, వెళ్లకుండా ఆపారు. కానీ ఇప్పుడు అటువంటి ఆసక్తి ఎవ్వరు చూపడం లేదు.
తాజాగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి సహితం ఆ విధమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆమెకూడా పార్టీని వదిలి పెట్టేందుకు సిద్దపడుతున్నారు. టిడిపి నుండి వచ్చి చేరిన మాజీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి వారు సహితం ఈమధ్య కాలంలో క్రియాశీలకంగా కనబడటం లేదు.
ఎవ్వరిని అడిగినా ఒకేమాట చెబుతున్నారు. ఏపీలో బిజెపిని బలమైన రాజకీయ శక్తిగా అభివృద్ధి చేయడం పట్ల పార్టీ జాతీయ నాయకత్వం ఆసక్తి చూపడంలేదని పెదవి విరుస్తున్నారు. ఎన్ని ప్రతిపాదనలు తీసుకువెళ్లినా వినడమే గాని, స్పందన ఉండటంలేదని చెబుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా గత ఎన్నికలలో వచ్చిన విధంగా నోటాకు మించి ఓట్లు సాధించడం ప్రస్తుత పరిస్థితుల్లో అసాధ్యమనే నిర్ణయానికి వచ్చారా? అనే అనుమానం కలుగుతుంది.
ప్రస్తుతం దక్షిణాదిన బిజెపి అగ్రనాయకత్వం దృష్టి అంతా కర్ణాటకలో తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయడం పట్లనే ఉంది. ఆ తర్వాత కొద్దో, గొప్పో తెలంగాణాలో లోక్ సభ సీట్లు పెంచుకోవాలని చూస్తున్నారు. ఇక తమిళనాడు, కేరళలో సహితం పెద్దగా ఆశలు పెట్టుకున్నట్లు లేదు. ఈ ఎడారిలో 9 నుండి 10 అసెంబ్లీల ఎన్నికలు జరగవలసి ఉండడం, 2024లో లోక్ సభ ఎన్నికలకు సన్నాహాలు జరపవలయు ఉండడంతో కేంద్ర నాయకత్వం ఉక్కిరి, బిక్కిరి అవుతున్నది.
ఇటువంటి పరిస్థితులలో ఆంధ్ర ప్రదేశ్ గురించి ఆలోచించే తీరిక వారికి చిక్కడం లేదని చెబుతున్నారు. పైగా, ఏపీలో ఎవ్వరు, ఎన్ని లోక్ సభ సీట్లు గెల్చుకున్నా వారంతా ఢిల్లీలో బిజెపికి మద్దతు ఇచ్చే అవకాశాలు ఉండడంతో, ఎన్నికల పట్ల దృష్టి కేంద్రీకరించి, సమయాన్ని – వనరులను వృద్ధ చేసుకోవడం ఎందుకనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
వైసిపి ఎట్లాగూ బిజెపి అగ్రనాయకత్వం నుండి సాగిలపడింది. ఇక టిడిపి సహితం జాతీయ స్థాయిలో బిజెపికి వ్యతిరేకంగా వెళ్ళడానికి సిద్ధంగా లేదు. జనసేన కూడా ఒకటి, రెండు సీట్లు వచ్చినా బిజెపికి మాత్రమే మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఇటీవల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఆంధ్ర ప్రదేశ్ నుండి 100 శాతం ఓట్లు బిజెపి అభ్యర్థులకు పడటం ఈ సందర్భంగా గమనార్హం.
కాంగ్రెస్ కు ఒక ఓట్ కూడా వెళ్లే అవకాశం లేని రాష్ట్రంలో, సొంతంగా ఒక్క సీట్ కూడా గెలుచుకునే సామర్థ్యంలేని పరిస్థితుల్లో అవసరం ప్రయాస ఎందుకులే అనే ధోరణి బిజెపి జాతీయ నాయకత్వంలో కనిపిస్తున్నది. పైగా, ఇప్పుడు ఏపీలో బిజెపిని జనం మధ్యకు తీసుకెళ్లే నాయకుడు కూడా పార్టీలో కనబడటం లేదు.