అవినాశ్‌ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్‌.. చలనం లేని సిబిఐ

Thursday, December 19, 2024

నాటకీయంగా సిబిఐ విచారణలు వరుసగా గైరాజారవుతూ, అరెస్ట్ చేయడానికి కర్నూల్ వచ్చిన సిబిఐ బృందంను సహితం దగ్గరకు రానీయకుండా చేసుకో గలిగిన వైఎస్‌ఆర్‌సిపి కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది.

వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో భాగంగా తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ వాదనలు వినేంత వరకు తనను అరెస్ట్ చేయకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలనే విన్నపాన్ని సుప్రీం తిరస్కరించింది. గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టులలో సహితం ఇదే విధమైన పరిస్థితి ఎదురు కావడం గమనార్హం.

అయితే ఈ నెల 25న అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరపాలని హైకోర్టును ఆదేశించడం ద్వారా కొంతమేరకు ఊరట కలిగించినట్లయింది. తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అవినాశ్ కు సూచించింది. కానీ, ఈ లోగా అరెస్ట్ చేయకుండా సీబీఐని ఆదేశించలేమని స్పష్టం చేసింది.

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తాను దాఖలు చేసుకున్న ముందస్తు బెయి ల్‌ పిటిషన్‌ను వెకేషన్‌ బెంచ్‌ విచారించేలా తెలంగాణ హైకోర్టును ఆదేశించాలని కోరుతూ వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. తన తల్లికి అనారోగ్యం కారణంగా సీబీఐ విచారణకు వారం రోజుల పాటు మినహాయింపు ఇవ్వాలని కూడా అవినాశ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

‘వచ్చే నెల 6న తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ విచారణకు వచ్చేవరకు అరెస్టు చేయకుండా ఆదేశించండి. లేదంటే ఈ నెల 25న హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ విచారించాలని ఆదేశించి అప్పటి వరకు అరెస్టు చేయొద్దని ఉత్తర్వులివ్వండి’ అని అభ్యర్థించారు.అవినాష్‌కు ముందస్తు బెయిలు ఇవ్వొద్దంటూ మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్‌తో కలిపి ఈ పిటిషన్‌ను జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ పీఎస్‌ నరసింహాలుతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ విచారించింది.

ఈ హత్య కేసు దర్యాప్తును ట్రయల్‌ కోర్టు పర్యవేక్షించవచ్చా.. లేదా? అన్న అంశంపై స్పష్టత ఇవ్వాలని వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి దాఖలు చేసిన అప్లికేషన్‌ను ఆయన దరఖాస్తుతో కోర్టు జత చేసింది. ఇలా ఉండగా,  సోమవారం కర్నూల్ లో హడావుడి చేసిన సిబిఐ తర్వాత మౌనం వహించడం గమనార్హం. ఉద్దేశ్యపూర్వకంగానే హైకోర్టు నుండి బెయిల్ తెచ్చుకొనేవరకు అవినాష్ రెడ్డి అరెస్ట్ వ్యవహారాన్ని సాగదీసేందుకు సిబిఐ సహకరిస్తున్నట్లు పలువురు అనుమానిస్తున్నారు.

ఇంకోవైపు, సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా సీబీఐ తరపున న్యాయవాది హాజరుకాకపోవడం గమనార్హం. కేంద్రంలోని మోడీ పాలనలో సిబిఐ పూర్తిగా తన విశ్వసనీయతకోల్పోయిందని పిసిసి మీడియా ఛైర్మన్‌ తులసిరెడ్డి విమర్శించారు.  జయలలిత, లాలు ప్రసాద్‌ యాదవ్‌, మనీష్‌ సిసోడియా, జగన్‌ మోహన్‌ రెడ్డి లాంటి వ్యక్తులను అరెస్ట్‌ చేసిన సిబిఐ వివేకా హత్య కేసులో ఎంపి అవినాష్‌ రెడ్డిని అరెస్ట్‌ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉందని ఎద్దేవా చేశారు.

ఎంపి తండ్రి భాస్కర్‌ రెడ్డిని పులివెందులలో ఆయన ఇంటిలో అరెస్ట్‌ చేసినప్పుడు ఉత్పన్నం కాని శాంతి భద్రతల సమస్య, ఎంపి అవినాష్‌ రెడ్డిని కర్నూలులో అరెస్ట్‌ చేస్తే ఉత్పన్నం అవుతుందని రాష్ట్ర పోలీసులు చెప్పడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ఒక వ్యక్తిని అరెస్ట్‌ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న కేంద్ర ప్రభుత్వం దేశ సరిహద్దులను ఎలా కాపాడు తుందని ప్రశ్నించారు.

కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉందని, అందుకే అవినాష్ రెడ్డి అరెస్టు విషయంలో సీబీఐ  కఠిన వైఖరి అవలంభించ లేకపోతోందని టిడిపి మాజీ ఎమ్యెల్యే చింతమనేని ప్రభాకర్  ఆరోపించారు. హత్యా కేసులో నేరస్థుడిని సీబీఐ అరెస్టు చేయలేకపోతున్నదని, సీబీఐని ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి బెదిరిస్తున్నారని చింతమనేని ధ్వజమెత్తారు.

ఇలా ఉండగా, వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు కాకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడ్డుపడుతున్నారని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ ప్రశ్నించారు.  సీబీఐకు డీజీపీ ఎందుకు సహకరించడం లేదని నిలదీశారు.

కర్నూలులో మీడియాపై దాడులు జరుగుతున్నా, శాంతి భద్రతల విఘాతం కలిగిస్తున్నా కూడా పోలీస్ శాఖ వారు ఎందుకు అవినాష్ రెడ్డి రౌడీలను, వైసీపీ గుండాలను నియంత్రించడం లేదని పోతిన మహేష్ విస్మయం వ్యక్తం చేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి విచారణ నుంచి ఎందుకు పారిపోతున్నారని ప్రశ్నించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles