అమిత్ షాకు సిబిఐ పై జగన్ ఫిర్యాదు చేశారా?

Sunday, December 22, 2024

మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం రాత్రి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో జరిపిన భేటీపై పలు కధనాలు వ్యాపిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు, అంతరాష్ట్ర వివాదాలు వంటి అంశాలపై చర్చించారని అధికారికంగా చెబుతున్నప్పటికీ ముఖ్యంగా బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ వ్యవహరిస్తున్న తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేశారని పలువురు భావిస్తున్నారు.

బాబాయి వివేకా హత్య కేసులో సిబిఐ దర్యాప్తు రకరకాల మలుపులు తిరుగుతుండటం, ఇటీవల కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ సందర్భంగా హత్య సమాచారం ముందే ముఖ్యమంత్రికి తెలిసిందని సిబిఐ అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రితో జగన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

వివేకా హత్య గురించి ప్రపంచానికి తెలియడానికి ముందే జగన్‌కు తెలుసంటూ సీబీఐ కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఈ కేసులో ఆయన పేరును సీబీఐ తొలిసారి లిఖితపూర్వకంగా ప్రస్తావించడం రాజకీయంగా కలకలం రేపుతోంది. తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో మొదటిసారిగా ఈ కేసులో తన పేరును సిబిఐ తీసుకు రావడం పట్ల కేంద్ర హోమ్ మంత్రికి ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.

హత్య విషయం ముందే తనకు తెలుసు అన్నట్లు సిబిఐ పేర్కొనడం ద్వారా హత్యకేసులో ప్రజల అనుమానాలను తనవైపు తిప్పే ప్రయత్నం జరిగిన్నట్లు ఆందోళన వ్యక్తం చేశారని చెబుతున్నారు.

శనివారం సాయంత్రమే కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ను కలిశారు. పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ఆమె ప్రక్కనే కూర్చున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ తో కూడా అక్కడే మాట్లాడారు. అయితే తీరిక లేకుండా ఉండడంతో అమిత్ షాతో కలవడం కుదరలేదు. ఎట్లాగో వీలు చేసుకొని రాత్రి 10 గంటల ప్రాంతంలో సీఎం జగన్ ను తన ఇంటి వద్ద అమిత్ షాను కలువ గలిగారు.

వివేకానందరెడ్డి కేసులో సిబిఐ అవినాష్ రెడ్డి విషయంలో దూకుడుగా వ్యవహరించినప్పుడల్లా జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షాలను కలిసి రావడం, ఆ తర్వాత సిబిఐ దూకుడు తగ్గించడం జరుగుతూ రావడం గమనార్హం. ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి పిటీషన్ పై తెలంగాణ హైకోర్టు బుధవారం తీర్పు ఇవ్వనుండగా, జగన్ ఇప్పుడు అమిత్ షాను కలవడంతో ఆ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.

ఇలా  ఉండగా,  వివేకానంద రెడ్డి హత్య విషయం ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డికి ముందే తెలుసు అంటూ సీబీఐ చేసిన ఆరోపణలపై ఎందుకు సమాధానం చెప్పడం లేదని టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ ప్రశ్నించారు. సీబీఐ ఆరోపణలను ఖండించకుండా జగన్ మౌనం వహించడం మరిన్ని అనుమానాలకు, సందేహాలకు తావిస్తోందని చెప్పారు.

పైపెచ్చు అర్ధరాత్రి పూట కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలవడం ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చుతోందని కనకమేడల స్పష్టం చేశారు. వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయడానికి కర్నూలు వెళ్తే రాష్ట్ర ప్రభుత్వమే శాంతిభద్రతల సమస్యను సృష్టించి అరెస్టు చేయనీయకుండా అడ్డుకుందని ఆయన ఆరోపించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles