పొత్తులపై చంద్రబాబు మౌనం.. పవన్ కళ్యాణ్ పైనే భారం!

Thursday, March 28, 2024

రాజమహేంద్రవరంలో రెండు రోజుల పాటు జరిగిన మహానాడులో వచ్చే ఎన్నికల్లో రాజకీయ పొత్తుల గురించి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేస్తారని అందరూ భావించారు. ముఖ్యంగా జనసేనతో కలిసి పోటీ చేసేందుకు ఇప్పటికే ప్రాధమికంగా సిద్ధమయ్యారు. మరోవంక కలిసివస్తే బీజేపీతో కూడా చేతులు కలిపేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయంలో మహానాడు వేదిక ద్వారా పార్టీ శ్రేణులకు చంద్రబాబు స్పష్టమైన విధానం వెల్లడి చేస్తారని ఊహాగానాలు చెలరేగాయి. అయితే ఈ విషయంలో మౌనం వహించడం, కనీసం ప్రస్తావన కూడా చేయకపోవడం రాజకీయ వర్గాలలో విస్మయం కలిగిస్తోంది. 

జనసేనతో పొత్తు గురించి స్పష్టత ఉన్నప్పటికీ, బిజెపిని కూడా కలుపుకు వస్తానని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పడంతో ఆయన ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చే వరకు వేచి ఉండాలనే విధానం చంద్రబాబు ఆవలంభిస్తున్నట్లు తెలుస్తున్నది.

మొదట్లో బిజెపితో పొత్తు గురించి చంద్రబాబు సహితం సానుకూల సంకేతాలు ఇచ్చుకొంటూ వచ్చారు. ముఖ్యంగా కర్ణాటక ఎన్నికలలో బిజెపి ఓటమి చెందడం, అక్కడి తెలుగు వారు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడంతో రెండు తెలుగు రాస్త్రాలలో ప్రజలకు దగ్గరయ్యేందుకు టిడిపితో పొత్తుకోసం బిజెపి ముందుకు వస్తుందని అంచనా వేశారు.

అయితే, గత కొద్దీ రోజలుగా వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బిజెపి కేంద్ర నాయకత్వం సన్నిహితంగా జరుగుతున్నట్లు స్పష్టం అవుతున్నది.  ఎన్నికల సంవత్సరంలో జగన్ ను ఆర్ధిక సంక్షోభం నుండి ఆదుకొనేందుకు ఎనిమిది ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న నిధులను సహితం ఒకేసారి విడుదల చేసింది.

మరోవంక, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ అనుసరిస్తున్న వైఖరి సహితం పలు అనుమానాలకు దారితీస్తుంది. ఇటువంటి సందర్భంలో బిజెపి వెంటపడటం ప్రయోజనం లేదని టీడీపీ నాయకత్వం నిర్ధారణకు వచ్చింది.

అయితే, పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లి ఢిల్లీలో బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాతో టీడీపీ, జనసేన, బిజెపి ఉమ్మడిగా పోటీ చేయాలని ప్రతిపాదన ముందుంచారు. దానిపై అంతర్గతంగా చర్చించి ఓ నిర్ణయానికి వస్తామని ఆయన హామీ ఇచ్చారు. తాజాగా కొందరు రాష్ట్ర స్థాయి బీజేపీ నేతలు సహితం టిడిపితో పొత్తు విషయమై పవన్ కళ్యాణ్ ప్రతిపాదనను బిజెపి కేంద్ర నాయకత్వం పరిశీలిస్తున్నట్లు ప్రకటనలు చేశారు.

బీజేపీ తమతో కలిసి రాదని దాదాపు టీడీపీకి అర్దమైంది. మహానాడు సమయంలనే పార్టీలో ముఖ్య నేతల మధ్య ఢిల్లీ పరిణామాలపై చర్చ జరిపినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ కు బీజేపీ మద్దతుగా నిలుస్తున్న సమయంలో టీడీపీ, జనసేన మాత్రమే పొత్తుతో వెళ్లే అవకాశం కనిపిస్తోందని కూడా భావిస్తున్నారు.

ఇక, బీజేపీతో పొత్తు లేదనే అంతిమ నిర్ణయానికి వస్తే వామపక్షాలను కలుపుకొని వెళ్లేందుకు కూడా టీడీపీ సిద్దపడే అవకాశం ఉంది. ఈ విషయంలో సిపిఐ ఆసక్తిగా ఉన్నట్లు కనిపిస్తుంది.  అయితే, బీజేపీతో పొత్తు ప్రతిపాదన చేసింది పవన్ కావటంతో ఇప్పుడు పవన్ మరోసారి బీజేపీతో చర్చలు జరుపుతారా? లేక..బీజేపీ వైఖరి కారణంగా ఇక టీడీపీతో కొనసాగాలని నిర్ణయిస్తారా? అనేది ఇప్పుడు పవన్ నిర్ణయించుకోవాల్సి ఉంది.

అందుకనే, పొత్తుల విషయమై పవన్ కళ్యాణ్ స్వయంగా ఓ నిర్ణయానికి వచ్చేవరకు వేచి ఉండాలని టిడిపి చూస్తున్నది. అంతేగాని తమకై తాము బిజెపితో పొత్తు కోసం ముందుకు వెళ్లరాదని నిర్ణయానికి వచ్చారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles