రాజధానిగా అమరావతిని ఎడారిగా మార్చివేస్తూ, గత నాలుగేళ్లుగా ఆ ప్రాంత అభివృద్ధికి ఏమాత్రం ఖర్చుపెట్టని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్లస్థలాల పంపిణి పేరుతో అక్కడ పాగా వేసేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తీసుకు వచ్చిన తర్వాత మొదటిసారిగా ఇళ్లస్థలాల పంపిణి పేరుతో అమరావతి ప్రాంతంలో సీఎం జగన్ శుక్రవారం బహిరంగసభలో మాట్లాడనున్నారు.
అక్కడ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలలోని 50 వేలమందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు. వారంతా వచ్చే ఎన్నికల లోగా ఇల్లు కట్టుకున్నా లేదా అక్కడ స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నా వారి కుటుంబాలతో కలిపి రెండు, మూడు లక్షల ఓట్లు లభిస్తాయని, వాటితో అమరావతి, మంగళగిరి నియోజకవర్గాలలో సునాయాసంగా వైసిపి అభ్యర్థులను గెలిపించుకోవచ్చని భావిస్తున్నారు.
అమరావతిలో ఇంటి స్థలాలతో పాటుగా టిడ్కో గృహాలను పంపిణీ చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. అమరావతిలో లే అవుట్ అభివృద్ది పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇళ్లస్థలాల పంపిణీని వ్యతిరేకించలేని ఇరకాట పరిస్థితిలో ప్రతిపక్షాలు చిక్కుకున్నాయి.
ఇళ్ల స్థలాలకు ఉద్దేశించిన ఆర్ -3 జోన్ ను కాదని, పారిశ్రామికాభివృద్ధికి ఉద్దేశించిన ఆర్-5 జోన్ లో ఇళ్లస్థలాలు ఎట్లా ఇస్తారని ప్రభుత్వాన్ని నిలదీయలేక పోతున్నాయి. అమరావతి ప్రాంత రైతులు మాత్రమే సుప్రీంకోర్టు వరకు వెళ్లినా సానుకూలంగా ఉత్తరువులు పొందలేకపోయారు.
ఇదే సమయంలో రానున్న రోజుల్లో అమరావతి కేంద్రంగా సీఎం మరిన్ని నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నారు. ఇక్కడ పంపిణి చేస్తున్న స్థలాలలో శాశ్వత గృహనిర్మాణంకోసం కేంద్రం నిధులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా సీఎం జగన్ లేఖ వ్రాసారు.
అయితే అంతుకు అభ్యంతరం తెలుపుతూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి లేఖ రాశారు. రాజధాని అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ హౌసింగ్ స్కీం కింద ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే అంశం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ పథకం కింద ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడం సరికాదని స్పష్టం చేశారు.
ఈడబ్ల్యూఎస్ హౌసింగ్ స్కీం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసిన నిధులను తక్షణమే నిలుపుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఏపీ సీఎం జగన్ కు అమరావతి అంటే ద్వేషభావం ఉందని, రాజధానిని విశాఖకు తరలిస్తున్నామని ఆయన పలు వేదికలపై ప్రకటించారని రఘురామ తన లేఖలో ప్రస్తావించారు.
కావాలనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్రంలో సిద్ధంగా ఉన్న 30 లక్షల టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు అందించేలా సీఎం జగన్ ను ఆదేశించాలని కోరారు. అమరావతిలో ఇండ్ల నిర్మాణం కోర్టు ధిక్కరణ కిందికు వస్తుందని రఘురామకృష్ణంరాజు స్పష్టం చేస్తున్నారు.
కోర్టు తీర్పుకు లోబడి వ్యవహరించాలని, అమరావతిలో పేదలకు ప్రభుత్వం ఇచ్చే ఇండ్ల స్థలాలపై ఎట్టి పరిస్థితుల్లో థర్డ్ పార్టీ హక్కులను కల్పించ వద్దని ఉత్తర్వులలో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని గుర్తు చేశారు.
అయినా, అమరావతిలో యుద్ధ ప్రాతిపదికన సెంటు స్థలాలలో అంటే కేవలం 48 గజాలలో ఇండ్లను నిర్మించి అద్భుత కాలనీగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం గమనార్హం. అయితే, అమరావతిలో పేదలకు ఇండ్ల స్థలాలు ఇస్తున్న సీఎం జగన్ ఇప్పటివరకు అక్కడ లేఅవుట్లో రోడ్లు, డ్రైనేజ్ వేయలేదు. విద్యుత్ సౌకర్యాన్ని కల్పించలేదు.
అమరావతిలో రోడ్డు నిర్మాణం చేయాలంటే కనీసం 50 అడుగుల రోడ్డును నిర్మించాలి. అవేమీ లేకుండానే అద్భుత కాలనీ నిర్మిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం జనాన్ని వంచించటమే కాగలదు. ఇప్పటివరకు అమరావతిలో లబ్ధిదారులకు ప్లాట్లను కేటాయించలేదు.
రాష్ట్రంలో 30 లక్షల ఇండ్ల స్థలాలను ఇచ్చానని చెబుతూ, కేవలం 5 ఇండ్లను మాత్రమే జగన్మోహన్ రెడ్డి నిర్మించారని, గత పార్లమెంట్ సమావేశాలలో కేంద్ర మంత్రి వెల్లడించడం గమనార్హం. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఇళ్లను నిర్మించామని సాక్షి దినపత్రికలో రాసుకున్నారు. ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన మూడు లక్షల టిడ్కో ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించలేదు.