పలు గ్రామాలలో దీక్షా శిబిరాల వద్ద నల్లబెలూన్ల ఎగురవేస్తూ రైతులు నిరసనలు తెలుపుతుండగా, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తుళ్లూరు మండలం వెంకటపాలెంలో శుక్రవారం 50,793 మంది పేదలకు ఒకొక్కరికి సెంట్ చొప్పున ఇళ్లస్థలాలు పంపిణి చేశారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసేందుకు వెంకటపాలెం రావడాన్ని పురస్కరించుకుని అమరావతి ఐక్య కార్యాచరణ సమితి (జెఎసి) నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో తుళ్లూరు, మందడం, వెలగపూడిలోనిదీక్షా శిబిరాల్లో రైతులు, మహిళలు కళ్ళకు నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలిపారు.
రాజధాని గ్రామాల్లో రైతులు తమ ఇళ్లపై నల్ల జెండాలు, బెలున్లు కట్టారు. ఉద్దండరాయునిపాలెం దీక్షా శిబిరం నుంచి రాజధానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశం వరకు రైతులు ప్రదర్శన చేశారు. మోకాళ్లపై నిలబడి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.
రాజధాని నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకం వద్ద అసైన్డ్ రైతు పులి చిన్నా, మరికొందరు రైతులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. మందడంలో రైతులు మెడకు ఉరితాళ్లను తగిలించుకొని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తుళ్లూరులో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిరాహార దీక్ష చేపట్టారు.
పెద్ద సంఖ్యలో శిబిరానికి వచ్చిన రైతులు, మహిళలు కళ్ళకునల్ల రిబ్బన్లు కట్టుకొని’గో బ్యాక్ సిఎం’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అక్రమ ఆర్ 5 జోన్‌ను రద్దు చేయాలని, సెంటు స్థలం పేరుతో పేదలను మోసం చేయొద్దంటూ సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులను రోడ్డుపైకి రానీయకుండా పోలీసులు తాళ్లను అడ్డుగా పెట్టారు.
కాగా, పేదలకు ఇచ్చిన స్థలాల్లో జులై 8వ తేదీ నుంచి ఇళ్ల నిర్మాణం చేపడతామని సీఎం జగన్ ఈ సందర్భంగా ప్రకటించారు. అమరావతిలో అన్ని సామాజిక తరగతుల వారికీ ప్రాతినిధ్యం కల్పిస్తామని, రాజధాని అమరావతి ఇకమీదట సామాజిక రాజధానిగా మారనుందని చెప్పారు.
పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తే మురికివాడలు వస్తాయని, సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని టిడిపి నాయకులు తప్పుడు ప్రచారం చేసి ఇళ్ల పట్టాలు ఇవ్వనీయకుండా మూడేళ్లుగా అడ్డుకున్నారని విమర్శించారు. ఒక్కో పేద మహిళకు తాను రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల విలువైన స్థలాన్ని ఇస్తున్నానని తెలిపారు.
ఇవి కేవలం ఇళ్ల పట్టాలు మాత్రమే కాదు సామాజిక న్యాయ పత్రాలు కూడా అని సిఎం వ్యాఖ్యానించారు. రాజధాని ప్రాంతంలో నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం వెంకటపాలెం సభలోనే పంపిణీ చేశారు.
ఇలా ఉండగా, వెంకటపాలెంలో సిఎం సభ ముగిశాక బస్సులు, ఇతర వాహనాలు తుళ్లూరు రైతు దీక్షా శిబిరం ముందు నుంచి తిరిగి వెడుతున్న సమయంలో ఉద్రిక్తత నెలకొంది. వాహనాలలో వెళుతును వాళ్ళు రైతులను చూసి జై జగన్ అనడం.. రైతులు జై అమరావతి అంటూ సిఎంకువ్యతిరేకంగా నినాదాలు చేయడం ఉద్రిక్తతకు దారితీసింది.
ఓ దశలో రైతులు, మహిళలు దీక్షా శిబిరం నుంచి ప్రధాన రహదారిపైకి వచ్చి బైఠాయించారు. బెలూన్లు ఎగురవేశారు. మేడికొండూరు గ్రామానికి చెందిన వైసిపి కార్యకర్త లాం చినరాయప్ప సిఎం సభ నుంచి వస్తూ జై జగన్ అనడంతో రైతులు కోపోద్రిక్తులయ్యారు. ఆయనపై దాడి చేశారు. తాను మద్యం తాగానని, తప్పయ్యిందని చెప్పినా రైతులు శాంతించకపోవడంతో పోలీసులు అతడిని అక్కడ నుంచి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం విడుదల చేశారు.