కాంగ్రెస్ జోష్ తో ట్రాక్ మారుస్తున్న బిఆర్ఎస్, బీజేపీ!

Thursday, April 18, 2024

పొరుగున ఉన్న కర్ణాటకలో అధికారంలోకి రావడంతో తెలంగాణాలో మంచి జోష్ మీదున్న కాంగ్రెస్ పార్టీతో బిఆర్ఎస్, బిజెపి భయపడుతున్నట్లు కనిపిస్తున్నాయి. కర్ణాటక ఫలితాల గురించిన ప్రస్తావనకు వెనుకడుగు వేస్తున్నాయి. వాటికి, తెలంగాణకు సంబంధం ఏమిటని కొట్టిపారవేస్తున్నాయి.

అందుకనే కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై కేసీఆర్ ఇటీవల విమర్శలు చేయడం లేదు. రూ 2,000 నోట్ల రద్దు, పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం వంటి అంశాలపై సహితం మౌనం పాటిస్తున్నారు. తెలంగాణాలో బిజెపి బలం పెంచుకున్నా ఫర్వాలేదని, తనను గద్దె దింపలేదని, కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు మాత్రమే చీల్చి ప్రయోజనం చేకూరుస్తుందని బిఆర్ఎస్ నేతలు అంచనాలు వేస్తున్నారు. కానీ, కాంగ్రెస్ బలం పెంచుకొంటే అధికారం పోగొట్టుకోవలసి వస్తుందని జంకుతున్నారు.

మరోవంక, ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్యెల్సీ కవితను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు బిజెపితో ఏదో రకమైన `సంధి’ అవసరం అనే ధోరణిలో బిజెపి నాయకత్వం ఉన్నట్లు కనిపిస్తున్నది. కర్ణాటక ఎన్నికల తర్వాత బిజెపి అగ్రనాయకత్వం ధోరణిలో సహితం మార్పు కనిపిస్తుంది.  కర్ణాటకలో అధికారం నిలుపుకోవడం తర్వాత తెలంగాణాలో జెండా ఎగరవేస్తామని, ఆ తర్వాత దక్షిణాదిన తమిళనాడులో ప్రతాపం చూపుతామని ఉత్సాహం చూపుతూ వస్తున్న బిజెపి నేతలలో ఇప్పుడా ఉత్సాహం కనిపించడం లేదు.

ఎవరైనా కర్ణాటక ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అసహనానికి గురవుతున్నారు. ఆ ఎన్నికలకు – తెలంగాణకు సంబంధం ఏమిటి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో గెలిచినంత మాత్రం చేత తెలంగాణాలో కాంగ్రెస్ ఏ విధంగా గెలుస్తుంది అంటూ పొంతనలేని వాదనలు వినిపిస్తున్నారు.

పైగా, తెలంగాణాలో కాంగ్రెస్ అసలు అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, కొన్ని సీట్లు గెల్చుకున్నా గెలిచినా వారంతా బిఆర్ఎస్ లో చేరిపోతారని అంటూ గత అనుభవాలను గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బిజెపి అగ్రనాయకత్వం సహితం ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ తమకు అంతగా ముప్పు ఉండబోదని, కానీ కాంగ్రెస్ ఒక్కొక్క రాష్ట్రంలో అధికారంలోకి రావడం ప్రారంభిస్తే ప్రమాదమని ఆందోళన చెందుతున్నట్లు స్పష్టం అవుతుంది.

అందుకనే ముందు ప్రస్తుతం తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ రాకుండా అడ్డుకోవడంతో పాటు, ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాస్త్రాలలో బిజెపి అధికారంలోకి రాలేకపోయినా, కాంగ్రెస్ మాత్రం రాకుండా చూడాలని స్పష్టమైన విధానం అనుసరిస్తున్నట్లు స్పష్టం అవుతుంది.

కర్ణాటక ఎన్నికల తర్వాత బిజెపిలోకి వలసలు ఆగిపోయాయి. ఇప్పుడు ఇతర పార్టీల నుండి ఎవ్వరు వచ్చి చేరతారని కాకుండా, పార్టీలో ఉన్నవారు ఎవ్వరు పోతారో అని భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. అందుకనే తెలంగాణాలో తమ పార్టీ అధికారంలోకి రావడంపై కన్నా కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడం పట్ల బిజెపి ఎక్కువగా దృష్టి సారిస్తున్నట్లు స్పష్టం అవుతుంది. అందుకు బిఆర్ఎస్ తో లోపాయికారి అవగాహనకు సహితం సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది.

తెలంగాణాలో ఎంత కష్ఠపడినా అధికారంలోకి రాలేమని ఎప్పుడో గ్రహించారు. అందుకనే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రయోజనం పొందకుండా అడ్డుకొని, ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల్లో ప్రస్తుతం తమకున్న నాలుగు సీట్లను కాపాడుకోవడంపై దృష్టి సారించే ఎత్తుగడ అనుసరిస్తున్నట్లు కనిపిస్తున్నది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles