ఒక వంక ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగవలసిందే అంటూ స్థానిక బిజెపి నాయకులు చెపుతుండగా, రాజధాని ఎక్కడుండాలో నిర్ణయించుకోవలసింది రాష్ట్ర ప్రభుత్వమే అని, తమ ప్రమేయం లేదని అంటూ కేంద్ర ప్రభుత్వం కోర్టులలో అఫిడవిట్ లను సమర్పిస్తున్నారు.
స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన అమరావతి అభివృద్ధిని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మంటగడుపుతుంటే ప్రేక్షక పాత్ర వహిస్తుంది. ఈ విషయమై కేంద్రం అనుసరిస్తున్న ద్వంద వైఖరిని పార్లమెంట్ సాక్షిగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ బహిర్గతం చేశారు.
అమరావతి అభివృద్ధి గురించి, దీనికోసం ఖర్చు చేసిన నిధుల గురించి సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించడంతో కేంద్రం మాటలు తడుముకోవలసి వచ్చింది. స్మార్ట్ సిటీ కింద అమరావతి క్యాపిటల్ రీజియన్ పరిధిలో రూ. 2,000 కోట్ల అంచనా వ్యయంతో 20 ప్రాజెక్టులకు సంబంధించిన 25 వర్క్ ఆర్డర్లు మంజూరు అయ్యాయని గుర్తు చేశారు.
అయితే, ప్రస్తుతం వాటికి సంబంధించిన ఒక్క పని కూడా ఇప్పటివరకు పూర్తి కావట్లేదని గల్లా జయదేవ్ విస్మయం వ్యక్తం చేశారు. దీనికి గల కారణాలను కూలంకషంగా వివరించాలని డిమాండ్ చేశారు. ఈ పనులన్నింటినీ ఎప్పటికి పూర్తి చేస్తారని ప్రశ్నించారు. స్మార్ట్ సిటీ మిషన్ కింద చేపట్టిన పనులు ఎందుకు నత్తనడకన సాగుతున్నాయో తెలియజేయాలని నిలదీశారు.
గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోవడానికి సరైన కారణాలు చెప్పలేక కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ తడబడ్డారు. అమరావతిలో మొత్తం 21 ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. రూ.2046 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలని సంకల్పించినట్లు పేర్కొన్నారు.
కేంద్రం వాటాగా రూ.488 కోట్లు కూడా విడుదల చేసిందని వెల్లడించారు. కేంద్రం నిధులిచ్చినా పెద్దగా చెప్పుకునే విధంగా అక్కడ పనులు మాత్రం జరగలేదని మంత్రి స్పష్టం చేశారు. పనులు పూర్తి కాకపోవడానికి కారణాలను మాత్రం వివరించలేకపోయారు.
పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోవడంతో పనులు జరగడం లేదని అంగీకరించారు.
మరోవంక, రెండు డోజన్లకు పైగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో స్థలాలు సమకూర్చిన అమరావతిలో భవన నిర్మాణ పనులు చేపట్టాక పోవడం గమనార్హం.
అంటే అమరావతిని రాజధాని నగరంగా నిర్వీర్యం చేయడంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం క్రియాశీలకంగా సహకారం అందిస్తున్నట్లు స్పష్టం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం అండదండలు లేకుండా వై ఎస్ జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో అమరావతి అభివృద్ధిని స్తంభింపచేసే సాహసం చేసే అవకాశం ఉండదు.