అపురూప చిత్రాలు అందించిన కె విశ్వనాధ్ ఇక లేరు

Saturday, November 23, 2024

ఎన్నో అపురూప చిత్రాలను అందించిన దిగ్గజ దర్శకుడు, కళాతపస్విగా పేరొందిన కాశీనాథుని విశ్వనాథ్‌ (92) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికాగా, కుటుంబసభ్యులు జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఐదు దశాబ్దాల పాటు తెలుగు చిత్రసీమలో తనదైన ముద్రవేసిన విశ్వనాథ్‌ స్వస్థలం బాపట్ల జిల్లా రేపల్లెలోని పెద పులివర్రు గ్రామం. 1930 ఫిబ్రవరి 19న కాశీనాథుని సుబ్రహ్మణ్యం, సరస్వతమ్మ దంపతులకు విశ్వనాథ్‌ జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో ఇంటర్మీడియట్‌, ఆంధ్రా క్రిస్టియన్‌ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశారు.

ఆయన తండ్రి చెన్నైలోని విజయ వాహినీ స్టూడియోలో పనిచేసేవారు. దీంతో విశ్వనాథ్‌ డిగ్రీ పూర్తవగానే అదే స్టూడియోలో సౌండ్‌ రికార్డిస్ట్‌గా సినీజీవితాన్ని ప్రారంభించారు.  తొలిసారి పాతాళభైరవి సినిమాకు అసిస్టెంట్‌ రికార్డిస్ట్‌గా పనిచేశారు. 1965లో ‘ఆత్మగౌరవం’ సినిమాకు దర్శకుడిగా అవకాశం లభించింది. తొలి చిత్రానికే ఆయనకు నంది అవార్డు అందుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని గౌరవాన్ని తీసుకొచ్చిన ఆయన 60 చిత్రాలకు దర్శకత్వం వహించారు.

టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ 9 చిత్రాలకు విశ్వనాథ్‌ దర్శకత్వ బాధ్యతలు వహించారు. ఎన్నో చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు.సాగర సంగమం, స్వాతిముత్యం, సిరిసిరిమువ్వ, శ్రుతిలయలు, సిరివెన్నెల, ఆపద్బాంధవుడు, శంకరాభరణం లాంటి ఆణిముత్యాలను తెలుగు చిత్రసీమకు అందించారు.

ఈ లెజెండరీ డైరెక్టర్‌ చేతుల్లోంచి జాలువారిన మరో ఆణిముత్యం ‘శంకరాభరణం’.  సంగీతమే ప్రాధాన్యంగా వచ్చిన ఈ చిత్రం కమర్షియల్‌ హంగులు లేకున్నా అత్యంత ప్రజాదరణ సంచలనం సృష్టించిన ఈ చిత్రం విడుదలైన  1980 ఫిబ్రవరి 2 ఆయన మృతి చెందడం గమనార్హం.

ఎందరో అగ్రకథానాయకుల చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించి, ఎన్నో అవార్డులను అందుకున్నారు.  సినీ రంగంలో ఆయన కృషికి 2016లో చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు వచ్చింది. 1992లో రఘుపతి వెంకయ్య అవార్డు, అదే ఏడాదిలో పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నారు.

ఇక విశ్వనాథ్‌ చిత్రాల్లో ఎంతో పేరుగాంచిన స్వాతిముత్యం సినిమా ప్రఖ్యాత ఆస్కార్‌ (59వ)చిత్రాల బరిలో నిలిచింది. కమల్‌, విశ్వనాథ్‌ కలయికలో వచ్చిన స్వాతిముత్యం(1985) చిత్రానికి మహిళా ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. ఆస్కార్‌కి నామినేట్‌ అయిన తొలి తెలుగు చిత్రంగా స్వాతిముత్యం ఘనతకెక్కింది.

ఆసియా పసిఫిక్‌ చలన చిత్ర వేడుకల్లో స్వాతిముత్యం, సాగరసంగమం, సిరివెన్నెల చిత్రాలు ప్రదర్శితమయ్యాయి. మాస్కోలో జరిగిన చలన చిత్ర వేడుకల్లో స్వయంకృషి సినిమా ప్రదర్శితమైంది. స్వరాభిషేకం చిత్రానికి ప్రాంతీయ విభాగంలో జాతీయ పురస్కారం దక్కింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆయనను గౌరవ డాక్టరేట్‌తో గౌరవించింది.

అప్పటివరకు ఓ మూసలో వెళుతున్న తెలుగు చిత్రాలకు విశ్వనాథ్‌ ఓ కొత్త దిశను చూపారు. సిరిసిరిమువ్వ చిత్రంతో విశ్వనాథ్‌ తెలుగు చిత్రపరిశ్రమకు తన విశ్వరూపం చూపారు. సంస్కృతిని చాటి చెప్పేందుకు సినిమాలే సరైన మాధ్యమమని విశ్వనాథ్‌ భావించేవారు.

 శుభసంకల్పం చిత్రంతో ఆయన తొలిసారి నటుడిగా మారారు. తెలుగు, తమిళ భాషల్లో 30 చిత్రాల వరకు నటించారు. ఆయన మరణం చివరి క్షణాల వరకూ కూడా కళామతల్లి సేవలోనే గడిపారు. విశ్వనాథ్‌కు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles