అండమాన్ పొత్తులతో దిమ్మతిరిగిన సోము వీర్రాజు

Sunday, December 22, 2024

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు, ఎన్నికలలో బలమైన అభ్యర్థులను నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేయకుండా వైఎస్ జగన్ ప్రభుత్వంకు రక్షణ కవచంగా మారి, ప్రధాన ప్రతిపక్షం టిడిపి ఎదగకుండా తనవంతుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు దిమ్మతిరిగిన్నట్లయింది.

ప్రస్తుతం నోటాకన్నా తక్కువ ఓట్లున్న పార్టీ వచ్చే ఎన్నికలలో కొన్ని సీట్లు గెల్చుకొని, రాజకీయంగా ఉనికి పొందాలంటే జనసేన, టిడిపిలతో కలసి పోటీచేయాలని పార్టీలో చాలామంది స్పష్టం చేస్తున్నారు. అదే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జగన్ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకు ఈ మూడు పార్టీలు కలసి పోటీచేయాలని చెబుతూ వస్తున్నారు.

అయితే, కుటుంభ పార్టీలతో బీజేపీ పొత్తుపెట్టుకోడాని అంటూ సోము వీర్రాజు ఇప్పటివరకు కొట్టిపారవేస్తూ వస్తున్నారు. టిడిపితో పొత్తు కోరుకొంటున్న పవన్ కళ్యాణ్ వంటివారిని సహితం దూరంగా పెడుతూ వచ్చారు. సోము వీర్రాజు కారణంగానే పవన్ కళ్యాణ్ పార్టీకి దూరం అవుతున్నారని అంటూ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీని వీడడానికి ముందే ఆరోపించడం తెలిసిందే.

సోము వీర్రాజుతో పాటు ఆయనతో కుమ్మక్కు అయినా జీవీఎల్ నరసింహారావు, సునీల్ దేవధర్ వంటివారు కూడా `కుటుంభ పార్టీలతో పొత్తులేదు’ అంటూ వచ్చారు. అయితే తాజాగా అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో ప్రధాన కేంద్రమైన పోర్ట్‌ బ్లెయిర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చైౖర్మన్‌ పదవి టీడీపీకి చెందిన మహిళా కార్పొరేటర్‌ సెల్విని బిజెపి మద్దతుతో వరించడం ఏపీ బీజేపీలో కలకలం రేపుతోంది.

గత మూడేళ్ళుగా ఈ పదవిలో బిజెపి వ్యక్తి టిడిపి మద్దతుతో ఉంటూ వచ్చారని, ముందస్తు అంగీకారం ప్రకారం ఇప్పుడు మిగిలిన రెండేళ్లు ఆ పదవిలో టిడిపి అభ్యర్ధికి బిజెపి మద్దతు ఇస్తున్నదని వెల్లడి కావడంతో ఈ రెండు పార్టీలు ఏవిధంగా పొత్తుపెట్టుకున్నాయనే సందేహాలు ఏపీలో కలుగుతున్నాయి. ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పొత్తు కుదుర్చుకున్నాయి.

కాగా, పోర్ట్‌ బ్లెయిర్‌ ఎన్నికలో బీజేపీ, టీడీపీ కూటమి విజయంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన దీనిపై ఒక ట్వీట్‌ చేశారు. అంటే, బిజెపి జాతీయ నాయకత్వం ఆమోదంతోనే బిజెపి, టిడిపి ఇక్కడ పొత్తు పెట్టుకున్నట్లు స్పష్టం అవుతుంది.

‘పోర్ట్‌ బ్లెయిర్‌ మునిసిపల్‌ కౌన్సిల్‌ ఎన్నికలో స్ఫూర్తిదాయక విజయం సాధించిన కూటమికి అభినందనలు. పోర్ట్‌ బ్లెయిర్‌ ప్రజల కోసం మీరు పడిన శ్రమ, చూపించిన అంకిత భావం ఫలించాయి. ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పాలన, దూరదృష్టిపై ఉన్న నమ్మకానికి ఈ ఎన్నిక ఒక గుర్తింపు’ అని నడ్డా పేర్కొన్నారు.

టిడిపిని ఒక అంటరాని పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న ఏపీ బీజేపీ నేతలకు ఈ ఎన్నిక చెంపపెట్టు వంటిదని పరిశీలకులు భావిస్తున్నారు. పైగా, టిడిపిని `ఎల్లో స్నేక్’ అంటూ ఒక సందర్భంగా జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ విమర్శించడం గమనార్హం. వీరంతా వైసిపి ప్యాకేజీలకు టిడిపినో భూతంగా చూపుతున్నట్లు వెల్లడి అవుతుంది.

పైగా, అండమాన్ లో టీడీపీ- బీజేపీ పొత్తుకు సూత్రధారులలో ఏపీకి చెందిన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఒకరు కావడం గమనార్హం. ఆయన అండమాన్ ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్నారు. పోర్ట్ బ్లెర్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్ పర్సన్ గా ఎన్నికైన సెల్వికి అభినందనలు తెలుపుతూ ఈ ఎన్నికల పొత్తు పట్ల ప్రజల విశ్వాసాన్ని ఈ ఎన్నిక వెల్లడి చేస్తున్నదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొనడం గమనార్హం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles