`సెస్‌’ ఎన్నికల్లో బండి సంజయ్ కు పరాభవం!

Wednesday, January 15, 2025

 సిరిసిల్ల సహకార విద్యుత్తు సరఫరా సొసైటీ (సెస్‌) ఎన్నికల్లో అధికార పక్షం బిఆర్ఎస్ జయకేతనం ఎగురవేయడం వ్యక్తిగతంగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కు పరాభవంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా జరిగినా తెలంగాణాలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని అంటూ నిత్యం ప్రగల్భాలు పలికే సంజయ్ కాబోయే ముఖ్యమంత్రిగా కూడా ప్రచారం చేసుకొంటున్నారు. 

తాను చేపట్టిన పాదయాత్ర కారణంగానే తెలంగాణాలో బిజెపి బలం పుంజుకుందని, ఇక్కడ బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని ప్రచారం చేసుకొంటున్నారు. అయితే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో గల  సిరిసిల్ల, వేములవాడ, మానకొండూర్‌, చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఈ ఎన్నికలో బిజెపి ఖాతా తెరవక పోవడం రాజకీయంగా కోలుకోలేని దెబ్బ కాగలదు. 

మొత్తం 15 డైరెక్టర్‌ స్థానాలకు జరిగిన ఎన్నికలలో అన్ని స్థానాల్లో బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే గెలుపొందారు. జాతీయ పార్టీగా రూపుదిద్దుకున్న తర్వాత ఇది తొలి గెలుపు కావడంతో గులాబీ శ్రేణుల్లో జోష్‌ నెలకొన్నది. శనివారం జరిగిన పోలింగ్ లో 84 శాతం మంది వోటింగ్ లో పాల్గొన్నారు. 

సంజయ్ స్వయంగా బిజెపి బలపరిచిన అభ్యర్థుల ప్రచారంలో పాల్గొన్నారు. ఇతర జిల్లాల నుండి వచ్చిన బిజెపి నాయకులు సహితం ప్రచారం చేశారు. మరోవంక, బిఆర్ఎస్ ప్రచారాన్ని స్థానిక శాసనసభ్యుడైన ఐటీ మంత్రి కేటీఆర్ పర్యవేక్షించారు. రెండు పార్టీలు కోట్ల రూపాయలలో విచ్చలవిడిగా ధనం ఖర్చుపెట్టాయి.  

అయితే, క్షేత్రస్థాయిలో బిజెపికి పటిష్టమైన ఎన్నికల యంత్రాంగం లేదని మరోసారి ఈ ఎన్నికలు స్పష్టం చేశాయి. 73,000 మందికి పైగా ఓటర్లు పాల్గొన్న ఎన్నికలనే సక్రమంగా ఎదుర్కోలేని పార్టీ, రేపు తెలంగాణ వ్యాప్తంగా అన్ని సీట్లలో పోటీ చేసి ఏ విధంగా ప్రభావం చూపిస్తుందనే ప్రశ్న తలెత్తుతుంది. 

బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులు ఘనవిజయం సాధించడంపై ఆ పార్టీ శ్రేణులు జిల్లా అంతటా సంబురాలు జరుపుకొన్నారు. పటాకులు కాల్చి, కేక్‌లు కట్‌ చేశారు. స్వీట్లు పంపిణీ చేసి సంబురాలు జరుపుకున్నారు. కానీ బిజెపి శిబిరంలో నిరాశ, నిస్పృహలు నెలకొన్నాయి. సెస్‌ ఎన్నికల్లో 6 నుంచి 7 స్థానాలు వస్తాయని అంచనా వేసుకున్న బిజెపి నేతలకు పెద్ద షాక్ తగిలింనట్లయింది. 

వ్యక్తిగతంగా బండి సంజయ్ కు ఈ ఎన్నికలు రాజకీయంగా కోలుకోలేని దెబ్బ కలిగించే అవకాశాలున్నాయి. తెలంగాణాలో బిజెపి ప్రభుత్వం ఏర్పడితే సీఎం కావచ్చని ఎదురు చూస్తున్న ఆయన వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తన నియోజకవర్గం పరిధి నుండి ఏదో ఒక సీట్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. 

గతంలో పోటీ చేసిన సొంత నియోజకవర్గం కరీంనగర్ లో గెలుపొందే అవకాశం లేదని నిర్ధారణకు వచ్చి, అనుకూలమైన సీట్ కోసం అన్వేషిస్తున్నారు. అయితే, ఈ ఫలితాలతో డీలా పడిపోవడంతో కరీంనగర్ లోక్ సభ పరిధి నుండి ఏ సీట్ నుండి కూడా పోటీచేసే అవకాశాలు లేవని తెలుస్తున్నది. పొరుగున ఉన్న నిర్మల్ జిల్లాలో అనుకూలమైన సీట్ కోసం చూస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, రెండు చోట్ల బీజేపీ అభ్యర్థులు కొద్దిపాటి తేడాతో గెలుపొందిన్నట్లు ప్రచారం జరుగగా, రీకౌంటింగ్ లో బిఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందడంతో ఫలితాలు తారుమారు జరిగాయనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. 

వేములవాడ రూరల్‌లో 5 ఓట్లతో బీజేపీ అభ్యర్థి జక్కుల తిరుపతి గెలుపొందినట్లు ప్రక టించారు. బీఆర్‌ఎస్‌ ఏజెంట్లు రీకౌంటింగ్‌ కోరడంతో మళ్లీ ఓట్ల లెక్కింపు చేశారు. ఇందులో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆకుల దేవరాజం 3 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 

చందుర్తి స్థానంలో బీజేపీ అభ్యర్థి అల్లాడి రమేష్‌కు 2155 ఓట్లు, బీఆర్‌ఎస్‌ అభ్య ర్థి పొన్నాల శ్రీనివాసరావు కు 2137 ఓట్లు వచ్చాయని బీజేపీ 18 ఓట్ల తేడాతో విజయం సాధించారని ప్రచారం జరిగింది. బీఆర్‌ఎస్‌ నాయకులు అందోళనకు దిగడంతో ఫలితాలను దాదాపు మూడు గంటల పాటు నిలిపివేసి చివరకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పొన్నాల శ్రీనివాసరావు 2 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు.

కాగా, సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్  ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని  బండి సంజయ్ ఆరోపించారు. ఎన్నికల ఫలితాల్లో అధికారపార్టీ అక్రమాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 స్థానాల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలిచినప్పటికీ ఫలితాలను తారుమారు చేస్తారా? అని ప్రశ్నించారు. సెస్ ఎన్నికల్లో బీఆర్ఎసోళ్లే ఓట్లేసుకుని, వాళ్లే ఫలితాలు ప్రకటించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles