`సాక్షి’ కేసులో సుప్రీంకోర్టులో జగన్ కు చుక్కెదురు

Friday, July 26, 2024

ఏపీ రాజకీయాలలో వైసిపి- టిడిపిల మధ్య నెలకొన్న రాజకీయ వైరం ప్రముఖ దినపత్రికలైన ఈనాడు – సాక్షి యాజమాన్యాల మధ్య ఆధిపత్య పోరుగా మారుతుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజకీయంగా తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఈనాడును దెబ్బతీయడం కోసం ఆయన కుమారుడిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాక్షి దినపత్రికను ప్రారంభించారు.

తండ్రి అధికారమును ఉపయోగించుకొని సాక్షికి అపారమైన ఆర్ధిక వనరులను సమకూర్చుకోగలిగారు గాని ఈనాడుకు దీటుగా పాఠకులను మాత్రం పొందలేకపోయారు. పార్టీ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని, సాక్షి అమ్మకాలను పెంచే ప్రయత్నాలు సహితం ఫలించలేదు. 2014లో వైసిపి ఓటమికి కొంతమేరకు సాక్షి రాతలు కూడా కారనే అంటూ ప్రస్తుత ఏపీ మంత్రి డా. రామచందనరారెడ్డి అప్పట్లో వ్యాఖ్యానించారు కూడా.

ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సర్క్యూలేషన్ లో ఈనాడును అందుకోలేక పోవడంతో, ప్రస్తుతం అధికారాన్ని ఉపయోగించుకొని గ్రామా వాలంటీర్లు అందరికి ప్రభుత్వ నిధుల నుండి సాక్షి ప్రతులను అమ్మే ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఈనాడు సర్క్యూలేషన్ అధిగమించే ప్రయత్నం చేపట్టారు. ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవడం కోసం ఈనాడు యాజమాన్యం ఏపీ హైకోర్టును ఆశ్రయించింది.

ఈ కేసు విచారణకు వచ్చినప్పటి నుండి ఈనాడు యాజమాన్యంపై చెందిన మార్గదర్శి పైన ఏపీ సిఐడి తాజాగా కేసులు నమోదు చేసి, అరెస్టులు, విచారణ చేపట్టడం ప్రారంభమైన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇలా ఉండగా, ఈ కేసు విషయంలో సీఎం జగన్ కు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది.

గ్రామ వలంటీర్ల చేత సాక్షి దినపత్రిక కొనుగోలు చేయడంపై దాఖలైన పిటిషన్ విచారణను ఢిల్లీ హైకోర్టుకు సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం బదిలీ చేసింది. వలంటీర్లకు నెల నెలా రూ.200 మంజూరు చేసి, సాక్షి దినపత్రిక కొనుగోలు చేయించడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో ఉషోదయా సంస్థ పిటిషన్ దాఖలు చేసింది.

ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సీజేఐ పలు కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. న్యాయ, పరిపాలన ప్రయోజనాల దృష్ట్యా విచారణను ఏపీ హైకోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తున్నామని చంద్రచూడ్ తెలిపారు. ఢిల్లీ హైకోర్టుకు విచారణను బదిలీ చేయడం వల్ల ఏపీ హైకోర్టుపై నమ్మకం పోతుందని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.

అలాంటి అభిప్రాయానికి తావు ఇవ్వకుండా ఉత్తర్వులు ఇస్తామమని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఇది రెండు పేపర్ల మధ్య వ్యవహారంగా కనిపించడంలేదని, రెండు పార్టీల మధ్య వ్యవహారంగా కనిపిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ప్రజాధనం వలంటీర్లకు బదిలీ చేసి సాక్షి పత్రికను కొనుగోలు చేయించడాన్ని గతంలో ఉషోదయా సంస్థ హైకోర్టులో సవాల్ చేసింది. ఇదే అంశంపై గతంలో దాఖలైన పిల్కు ట్యాగ్ చేయాలని, ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ను ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం పిటిషన్పై ఉషోదయా సంస్థ సుప్రీం కోర్టు మెట్లెక్కింది.

ఈ పిటిషన్పై సుదీర్ఘ విచారణ జరిపిన సుప్రీంకోర్డు సీజేఐ ధర్మాసనం చివరికి విచారణను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది. సాక్షి దినపత్రిక సర్క్యులేషన్ పెంచుకునేందుకు వైసీపీ సర్కారు మరో ఎత్తుగడ వేసింది. విస్తృత సర్క్యులేషన్ ఉండి, ప్రభుత్వ పథకాల సమాచారం ఇచ్చే సాక్షి న్యూస్ పేపర్ కొనాలని వలంటీర్లకు పరోక్షంగా జీవో జారీ చేశారు.

రాష్ట్రంలో రెండు లక్షల 60 వేల మంది వలంటీర్లు ఉన్నారు. పేపర్ కొనేందుకు ఒక్కో వలంటీరుకు రూ. 200 మంజూరు చేశారు. అదనపు ఆర్ధిక మద్దతు పేరుతో వలంటీర్ల పేస్లిప్‌లో రూ. 5 వేలకు అదనంగా ఈ రూ.200 కేటాయించారు. ఏజెంట్ ఇచ్చిన పేపరు బిల్లును యాప్‌లో అప్లోడ్ చేయాలని వలంటీర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఏజెంట్లు వలంటీర్ల ఇళ్లకు దినపత్రికను చేరవేస్తున్నారు. తమను అడక్కుండా దినపత్రిక ఎలా వేస్తారని కొందరు వలంటీర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కూడా.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles