వైఎస్ షర్మిల కోసం ప్రియాంక గాంధీ ఫోన్!

Friday, June 14, 2024

కర్ణాటక తర్వాత పొరుగున ఉన్న తెలంగాణాలో మరికొద్ది నెలల్లో జరిగే ఎన్నికల్లో పాగా వేసేందుకు వ్యూహాత్మక పావులు కదుపుతున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వైఎస్సార్ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను దగ్గరకు తీసుకొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. మొదట్లో రాహుల్ గాంధీ బృందం ఆమెతో సుదీర్ఘంగా సమాలోచనలు జరుపగా, గత వారం కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ నేరుగా ఆమె పార్టీని కాంగ్రెస్ లో విలీనం జరిపామని షర్మిలనే కోరారు.

అయితే, తనకు ఆమె ఆసక్తి చూపక పోవడంతో తాజాగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రంగంలోకి దిగి నేరుగా ఆమెతో టెలిఫోన్ లో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తున్నది. ఇప్పుడే కాంగ్రెస్ లో ఆమె పార్టీ విలీనం చేయడానికి ఇష్టపడని పక్షంలో కనీసం తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోమని ఆమె సూచించింనల్టు సమాచారం. అందుకు ఆమె తగు నిర్ణయం తీసుకొనేందుకు కొంత వ్యవధి అడిగిన్నట్లు చెబుతున్నారు.

ప్రియాంక గాంధీ ఆమెతో టెలిఫోన్ లో మాట్లాడేందుకు డీకే శివకుమార్ చొరవ తీసుకున్నట్లు తెలుస్తున్నది. షర్మిలకు చాలా కాలంగా శివకుమార్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకనే ఆ పరిచయాన్ని ఆసరా చేసుకొని ఆయన ఆమెతో మంతనాలు జరిపే బాధ్యత వహిస్తున్నారు.

షర్మిలను దగ్గరకు తీసుకోవడం ద్వారా రెండు తెలుగు రాస్త్రాలలో ముఖ్యమంత్రులను ఇరకాటంలో పెట్టవచ్చని కాంగ్రెస్ భావిస్తున్నది. తనకు మిస్డ్‌కాల్స్‌ వస్తున్నాయి కానీ, ఆ కాల్స్‌కు తాను ఆన్సర్‌ చేయలేదని గత వారం పేర్కొన్న షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయమని వత్తిడులు వస్తున్నట్లు పరోక్షంగా అంగీకరించారు. అయితే, మరోపార్టీలో విలీనం చేసేందుకు తాను పార్టీ పెట్టలేదని, సుదీర్ఘంగా పాదయాత్ర జరపలేదని చెప్పడం ద్వారా విలీనంపై విముఖతను వెల్లడించారు.

షర్మిలను దగ్గరకు తీయడం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రయోజనం ఉంటుందని కాంగ్రెస్ హైకమాండ్ అంచనా వేస్తోంది. తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం, వైఎస్సార్ ఇమేజ్ ఆధారంగా షర్మిల ఎన్నికల్లో పోటీకి సిద్దమయ్యారు. కాంగ్రెస్ కు దక్కాల్సిన ఈ ఓటింగ్ చీలకుండా షర్మిలను కూడా కలుపుకు పోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.

అందుకనే, పార్టీ విలీనానికి ఆమె నిరాకరించటంతో పొత్తు దిశగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఎన్నికలపై పొత్తు ప్రభావం చూపించగలిగితే ఆ తర్వాత షర్మిల కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేసి, ఏపీలో జరిగే ఎన్నికలలో కీలక బాధ్యతలు చేపట్టే విధంగా చేయవచ్చని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు.

ఏపీలో సహితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ వోట్ బ్యాంకును కైవసం చేసుకొని అధికారంలోకి వచ్చారు. అందుకనే ఆ వోట్ బ్యాంకు గండి కొట్టి, కొంతమేరకు చీల్చగలిగిన్నట్లయింతే ఆ రాష్ట్రంలో తిరిగి పార్టీ నిలదొక్కుకునే అవకాశం ఏర్పడుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అందుకోసం వైఎస్ షర్మిల బలమైన అస్త్రం కాగలరని విశ్వసిస్తున్నారు.

ఏపీలో షర్మిల రంగంలోకి వస్తే వైఎస్ జగన్ సామ్రాజ్యాన్ని కూల్చివేయడం తేలిక అవుతుందని, వైఎస్ అభిమానులు అనేకమందిని తిరిగి ఆకట్టుకోవచ్చని భావిస్తున్నారు. అయితే పొత్తుల గురించి ప్రియాంక గాంధీ ప్రతిపాదనలను షర్మిల తోసిపుచ్చనప్పటికీ కార్యరూపం దాల్చేందుకు కొంత సమయం పెట్టె అవకాశం ఉంది.

ఒక సర్వే ప్రకారం తెలంగాణాలో 41 నియోజకవర్గాలలో తమ పార్టీ బలంగా ఉన్నట్లు షర్మిల గత వారం చెప్పారు. వాస్తవానికి అన్ని నియోజకవర్గాలలో ఆమెకు సరైన అభ్యర్థులే లేరు. ఆమె వాస్తవానికి దగ్గరగా అంచనాలు వేసుకోనని పక్షంలో సీట్ల సర్ధుబాటు అంత సులభం కాబోదు. అయితే డీకే శివశంకర్, ప్రియాంక గాంధీ వంటివారు నేరుగా జోక్యం చేసుకొనే ఆమెతో ఒక అవగాహనకు వచ్చే విధంగా చేసేందుకు అవకాశం లేకపోలేదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles