వి6 న్యూస్, వెలుగు దినపత్రికలను బహిష్కరించిన బిఆర్‌ఎస్వి

Sunday, June 23, 2024

అత్తమీద కోసం మరెవ్వరిమీదో చూపినట్లు గా ఉంది కేసీఆర్ వ్యవహారం. తన కుమార్తె కవితను ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీతో అరెస్ట్ చేయించేందుకు కేంద్రం సిద్దమడంతో ఖంగారు పడుతున్నట్లున్నారు. కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ లో చేరి, అక్కడ సీట్ల బేరం కుదరక బీజేపీలో చేరిన మాజీ ఎంపీ జి వివేక్ వెంకటస్వామికి చెందిన వి6 న్యూస్ ఛానల్, వెలుగు దినపత్రికలను బహిష్కరించాలని భారత రాష్ట్ర సమితి నిర్ణయించడం కేసీఆర్ లో పెరుగుతున్న అసహనాన్ని వెల్లడిస్తుంది.

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను అడుగడుగునా దెబ్బతీస్తోందని ఆరోపిస్తూ ఆ ఛానల్, పత్రికలను బహిష్కరించాలని నిర్ణయించినట్లు బిఆర్ఎస్ ప్రకటించింది. రాష్ట్ర ప్రయోజనాలను అడుగడుగునా దెబ్బతీస్తూ, బిజెపిటీకి కొమ్ముకాస్తున్న ఈ రెండింటిని బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఈ మీడియా సంస్థలపై తన అక్కసును వ్యక్తం చేసింది.

 ప్రజాస్వామ్యంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సదరు మీడియా సంస్థలు బిజెపి జేబు సంస్థగా మారి అబద్ధాలు, అసత్యాలు, కట్టుకథలతో బిఆర్‌ఎస్ పార్టీ పైన, తెలంగాణ రాష్ట్రంపైన విషం చిమ్మడమే ఏకైక ఎజెండాగా పని చేస్తున్నాయని బిఆర్‌ఎస్ పార్టీ ఆరోపించింది.

ఈ నేపథ్యంలో బిఆర్‌ఎస్ పార్టీ మీడియా సమావేశాలకు వి6, వెలుగు మీడియా సంస్థలను అనుమతించకూడదని నిర్ణయించారు. దీంతోపాటు ఈ సంస్థలు నిర్వహించే చర్చలతో సహా, ఎలాంటి కార్యక్రమాల్లోనూ పార్టీ ప్రతినిధులెవరూ పాల్గొనకూడదని బిఆర్ఎస్ నిర్ణయించింది.

బిజెపి గొంతుకగా మారి, విశ్వసనీయత కోల్పోయిన ఈ మీడియా సంస్థల అసలు స్వరూపాన్ని, ఎజెండాను తెలంగాణ ప్రజలు గ్రహించాలని బిఆర్‌ఎస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. వాస్తవానికి రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు =ఓ ఛానల్, పత్రికలను ఎప్పుడు బ్యాన్ చేయలో తమకు తెలుసని, సందర్భం కోసం ఎదురుచూ స్తున్నామని చెప్పారు.

కేటీఆర్ ప్రకటన వచ్చిన రెండు రోజుల్లోనే బీఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గతంలో అధికారంలోకి రాగానే ఎబిఎన్ న్యూస్ ఛానల్ ను పార్టీపరంగా బహిష్కరించడమే కాకుండా తెలంగాణాలో ఎక్కడా ప్రసారం కాకుండా అడ్డుకొనే ప్రయత్నం చేశారు. కొంతకాలం విజయం సాధించినా ఎక్కువకాలం సాధ్యం కాలేదు. పైగా, ఆ విధంగా చేయడంద్వారా రాజకీయంగా సాధించిన ప్రయోజనం కూడా లేదు.

కేసీఆర్ ఆధీనంలో పలు మీడియా సంస్థలు ఉన్నాయి. అవి సహితం కరపత్రాల మాదిరిగా పనిచేస్తున్నాయి. వాటిని కూడా ఇతర పార్టీలు బహిష్కరించాలని నిర్ణయం తీసుకుంటే? కేంద్ర ప్రభుత్వం అటువంటి వైఖరి ప్రదర్శిస్తే? ఏమవుతుందో కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు లేదు.

పొరుగున ఏపీలో సహితం సీఎం వైఎస్ జగన్ రాజకీయంగా తనతో కలసిరాని మీడియాపై ఇటువంటి కక్షసాధింపు ధోరణులు ప్రదర్శిస్తున్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం సహితం మీడియాను తమ ఆధీనంలో ఉంచుకొనే ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రజాస్వామ్యంలో మీడియాను నియంత్రించడం ద్వారా ప్రజలను కట్టడి చేయలేమని గ్రహించాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles