వివేకా హత్య కేసులో సీబీఐకి ఇక సునీత న్యాయ సహాయం!

Sunday, December 8, 2024

ఏపీ రాజకీయాలలో సంచలనాలకు కేంద్రంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ రాజకీయ వత్తిడుల కారణంగా ముందు వెళ్లలేకపోతున్న సీబీఐ దర్యాప్తుకు సంబంధించి కోర్టు కేసులలో అధికారికంగా సీబీఐకి మద్దతుగా ఆయన కుమార్తె డా. సునీతకు న్యాయవాదులను వినియోగించే సౌలభ్యం లభించింది. దానితో ఇప్పుడు ఈ కేసు మరో మలుపు తిరిగిన్నట్లయినది.

ఇప్పటికే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐకి పలు అవాంతరాలు ఎదురవుతుండటం, కోర్టు తీర్పులను సిబిఐ స్వయంగా ఉన్నత అన్యాయస్థానాలలో సవాల్ చేయలేక పోవడం జరుగుతుంది. అటువంటప్పుడు  సీబీఐ దర్యాప్తుకు మద్దతుగా వివేకా కుమార్తె డా. సునీతారెడ్డి పిటిషన్లు దాఖలు చేస్తున్నారు.

ఉదాహరణకు, ఈ కేసును రాష్త్ర పోలీసుల నుండి సీబీఐకి బదిలీ చేయాలని ఆమె వేసిన పిటిషన్ ఆధారంగానే ఉన్నత న్యాయస్థానాలు ఆదేశాలిచ్చాయి. అంతేకాకుండా, హైకోర్టు నుండి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వంటివారు తాత్కాలిక ఉత్తర్వులకను పొందుతూ, సీబీఐ విచారణను దాటవేస్తూ ఉంటె, ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లి, హైకోర్టు ఉత్తర్వులను కొట్టివేయిస్తూ వస్తున్నారు.

ఇటువంటి సందర్భాలలో సీబీఐ దాదాపు ప్రేక్షక పాత్ర వహిస్తున్నది. తాజాగా ఆమె దాఖలు చేసిన ఓ పిటిషన్‌పై విచారణ జరిపిన హైదరాబాద్ సిబిఐ కోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసు విచారణలో సీబీఐకి సహకరించేందుకు అనుమతించాలని వైఎస్ సునీత రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా.. సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతించింది.

విచారణ సందర్భంగా సీబీఐ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కు సహకరించేందుకు సునీతారెడ్డి పెట్టుకున్న అభ్యర్థనకు సీబీఐ కోర్టు అనుమతించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు శుక్రవారం అనుమతి మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. దీంతో ఇకపై సిబిఐతో కలిసి సునీత అధికారికంగా పనిచేసేందుకు అనుమతి దొరికినట్లయింది.

వివేకా హత్య కేసులో రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నాయని సునీత పిటిషన్‌లో ప్రస్తావించారు. విచారణ ప్రక్రియలో తనకూ అనుమతి ఇవ్వాలన్న ఆమె అభ్యర్థనకు అనుమతించారు. సీబీఐ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కు ఆమెగానీ, ఆమె ఏర్పాటు చేసిన న్యాయవాదిగానీ సహకరించడానికి అనుమతిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అయితే సునీతారెడ్డి పిటిషన్‌పై తీర్పు ఇచ్చే సందర్భంలో సిబిఐ కోర్టు ఓ కీలక సూచన చేసింది. సిబిఐకి ఈ కేసు దర్యాప్తులో సునీతారెడ్డి, ఆమె న్యాయవాదులు అందించే సాయం రేఖ మురకాస్‌ కేసులో ప్రాసిక్యూషన్‌కు సహకరించే విషయంలో సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా మాత్రమే ఉండాలని సూచించింది. దీన్ని ఉల్లంఘించినట్లు తేలితే భవిష్యత్తులో ఆమెకు ఇచ్చిన అనుమతిని రద్దు చేసేందుకు సిబిఐ కోర్టుకు అధికారం ఉంటుందని తెలిపింది.

వివేకా కేసులో దర్యాప్తు పూర్తి చేసేందుకు సిబిఐకి సుప్రీంకోర్టు ఇప్పటికే ఈ నెల 30 వరకూ గడువు విధించింది. ఈలోపు దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నా ఆటంకాలు తప్పడం లేదు. ఈ తరుణంలో సునీతారెడ్డిని సాయం చేసేందుకు సిబిఐ కోర్టు అనుమతి ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles