వివేకా హత్య కేసులో ఆధారాలు చెరిపేసేందుకు ప్రయత్నం

Saturday, June 15, 2024

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆధారాలు చెరిపివేసేందుకు కడప ఎంపి అవినాష్‌ రెడ్డి  ప్రధాన అనుచరుడు గజ్జల ఉదయ్ కుమార్‌ రెడ్డి ప్రయత్నించాడని సిబిఐ రేమండ్ రిపోర్ట్ లో  వెల్లడించింది. ఉదయ్ రిమాండ్‌ రిపోర్టులో పలు కీలక అంశాలను సిబిఐ పొందుపరిచింది. ఆధారాలు చెరిపివేతకు గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి, ఉదయ్ ప్రయత్నించారని తెలిపింది.

ఉదయ్ కుమార్‌ రెడ్డిని సీబీఐ శుక్రవారం ఉదయం పులివెందులలో అతడిని అదుపులోకి తీసుకుని కడప కారాగారం అతిథిగృహానికి తీసుకెళ్లి విచారించింది. అనంతరం ఉదయ్ ను అరెస్ట్‌ చేసినట్లు సీబీఐ అధికారులు ఆయన కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు.

హత్య జరిగిన రోజు ఉదయం 4 గంటలకు ఉదయ్ తన ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. ఆ రోజంతా ఎంపి అవినాష్‌ ఇంట్లోనే ఉదయ్, శివశంకర్‌ రెడ్డి ఉన్నారు. హత్య జరిగిందని తెలిసిన వెంటనే ఆధారాల చెరిపివేతకు వారిద్దరూ అవినాష్‌ ఇంట్లోనే ఎదురుచూశారని సిబిఐ పేర్కొన్నది. అవినాష్‌కు శివప్రకాశ్‌ రెడ్డి ఫోన్‌ చేసి వివేకా చనిపోయినట్లు సమాచారమిచ్చాడని వెల్లడించింది.

హత్య జరిగిన స్థలంలో అవినాష్‌ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌ రెడ్డి, గంగిరెడ్డి, శివశంకర్‌ రెడ్డితో కలిసి ఉదయ్ ఆధారాలు చెరిపివేశారనేందుకు సాక్ష్యాలున్నాయని సీబీఐ స్పష్టం చేసింది. ఆ రోజు అవినాష్‌ ఇంట్లోనే ఉదయ్, భాస్కర్‌ రెడ్డి, శివశంకర్‌ రెడ్డి ఉన్నట్లు గూగుల్‌ టేక్‌అవుట్‌ ద్వారా గుర్తించామని తెలిపింది. వారు అవినాష్‌ ఇంటి నుంచి వివేకా ఇంటికి వెళ్లినట్లు గుర్తించాని పేర్కొన్నది.

విచారణకు ఉదయ్ కుమార్ రెడ్డి సహకరించట్లేదని సిబిఐ స్పష్టం చేసింది. పారిపోతాడనే ఉద్దేశంతోనే ఉదయ్ ను అరెస్ట్ చేశాం. ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని సిబిఐ వెల్లడించింది.

మరోవైపు ఉదయ్ తండ్రి జయప్రకాశ్‌రెడ్డిని కూడా సీబీఐ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు అవినాష్‌, శివశంకర్‌ రెడ్డితో పాటు ఘటనాస్థలికి ఉదయ్ వెళ్లినట్లు.. ఆ రోజు అంబులెన్స్‌, ఫ్రీజర్‌, వైద్యులను రప్పించడంలో కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ భావిస్తోంది.

వివేకా మృతదేహానికి ఉదయ్ తండ్రి జయప్రకాశ్‌ రెడ్డి బ్యాండేజ్‌ కట్లు కట్టినట్లు ఆరోపణలున్నాయి. ఉదయ్ ను గతంలో పలుమార్లు సీబీఐ అధికారులు విచారించారు.

కాగా,  వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా దాదాపు కొలిక్కి వచ్చిందని  నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు తెలిపారు. ఈ నెలాఖరులోగా చార్జిషీట్ దాఖలు చేసి ఈ కేసులో నిందితులుగా అనుమానిస్తున్న వారిని అరెస్టు చేస్తామని హైకోర్టుకు సీబీఐ తేల్చి చెప్పిందని గుర్తు చేశారు. ఈనెల 25 వరకు కీలక అరెస్టులు ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles