రూ 4 కోట్ల `సుపారీ’పై అవినాష్ రెడ్డిని నిలదీసిన సీబీఐ

Friday, July 26, 2024

మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని హత్య చేసిన నిందితులకు ఇస్తానన్న రూ.4 కోట్ల సుఫారీ ఎక్కడిది? ఎవరు సేకరించారు? ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రధాన ప్రశ్నలు ప్రస్తుతం ఇవే. ఇవి తేలితే గాని సుప్రీంకోర్టు ఆదేశించినట్లు ఈ కేసులో ఇమిడి ఉన్న లోతైన కుట్రకోణం వెల్లడయ్యే అవకాశం లేదు.

ఇప్పటి వరకు విచారణలో హత్య సంఘటనకు సంబంధించి వరుసగా చోటుచేసుకున్న పరిణామాలు, కేసును మాఫీ చేసేందుకు జరిగిన ప్రయత్నాలు వంటి అంశాలపైననే దృష్టి సారిస్తూ వచ్చింది.  ఈకేసులో 8వ నిందితుడుగా ఉన్న  కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డిని సిబిఐ ఈ `సుపారీ’ విషయం గురించే ప్రధానంగా శనివారం ప్రశ్నించింది.

హంతకులకు రూ. 4 కోట్లు ఇస్తానని వైఎస్‌ అవినాష్‌ రెడ్డి హామీ ఇచ్చి కొంత సొమ్ము ఇచ్చినట్లు, ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం మేరకు సిబిఐ అధికారులు అవినాష్‌ రెడ్డిని ప్రశ్నించారు. ప్రతి శనివారం సిబిఐ విచారణకు హాజరుకావాలన్న హైకోర్టు ఆదేశాల ప్రకారం, శనివారం ఉదయం 19 గంటలకు అవినాష్‌ రెడ్డి కోఠిలోని సిబిఐ కార్యాలయానికి వచ్చారు.

సాయంత్రం ఐదు గంటల వరకు.. ఏడు గంటల పాటు సీబీఐ ఆయన్ను ప్రశ్నించింది. ముఖ్యంగా, హంతకులకు ఇస్తానన్న రూ. 4 కోట్ల నగదుకు సంబంధించి సిబిఐ కూపీ లాగారు. ఈ `సుపారీ’ విషయాన్ని తేల్చగలిగితే ఈ కేసులో నిందితుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు నిందితులలో `కుట్రకోణం’కు సంబంధించి ఎవ్వరిపై ఆరోపణలు లేవు.

అందుకనే, మరి కొందరు కీలక వ్యక్తులను విచారణకు పిలిచేందుకు అవసరమైన కీలకమైన సమాచారం కోసం అవినాష్ రెడ్డిని ప్రధానంగా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ సందర్భంగా  వివేకా హత్య జరిగిన రోజు అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు అవినాష్‌ రెడ్డి తన మొబైల్‌ ఫోన్‌ వాట్సప్‌ కాల్స్‌పైనా సిబిఐ ఆరా తీయడం ప్రాధాన్యతను సంతరింప చేసుకుంది.

అర్ధరాత్రి సమయం ఎవరితో ఏ విషయంపై మాట్లాడారని అవినాష్‌ రెడ్డిని సిబిఐ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. ముందుగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈ హత్య గురించి సమాచారం చేరినట్లు స్పష్టం కావడంతో ఆయనను కూడా సీబీఐ విచారణకు పీలుస్తుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విచారణ ప్రక్రియ మొత్తాన్ని సిబిఐ వీడియోగ్రఫీ చేసింది. అప్రూవర్ దస్తగిరిని ప్రలోభాలకు గురిచేయడంపై ప్రశ్నించినట్లు కీలక సమాచారం.

మరోవంక, ఎంపీ అవినాష్ రెడ్డి ముందుస్తు బెయిల్ రద్దు చేయాలని వివేకా కుమార్తె సునీతా రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సునీతారెడ్డి పిటిషన్ విచారణకు స్వీకరించిన కోర్టు జూన్ 13 వాదనలు విననుంది. కాగా, అవినాష్‌ రెడ్డిని ఇటీవల అరెస్టు చేసిన సీబీఐ రూ.5 లక్షల చొప్పున రెండు పూచీకత్తులు తీసుకొని వెంటనే విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ గత నెల 31న హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు గత శనివారం (3న) సీబీఐ కార్యాలయంలో అవినాష్‌రెడ్డి విచారణకు హాజరైన క్రమంలోనే అరెస్ట్‌, విడుదల జరిగాయి. అలాగే ప్ర‌తి శ‌నివారం సిబిఐ విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేర‌కు ప్ర‌తి శ‌నివారం అవినాష్ సిబిఐ విచార‌ణ‌కు హాజ‌రవుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles