బండి సంజయ్ ను వెంబడిస్తున్న పాదయాత్ర వసూళ్లు!

Tuesday, February 20, 2024

ప్రజా సంగ్రామ పాదయాత్ర ద్వారా అంతకు ముందు కరీంనగర్ నగరంకు మాత్రమే పరిచయమైన బండి సంజయ్ రాష్ట్ర స్థాయిలో ఓ నాయకుడిగా ఎదిగాడు. బీజేపీ శ్రేణులలో కొత్త జోష్ తీసుకొచ్చారు. అధికార పక్షంపై ఎదురు దాడులతో బిజెపి ఉనికిని పెంచే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఢీ కొనగల పార్టీగా ప్రజల దృష్టిలో పేరు తీసుకొచ్చారు.

అయితే ఆ పాదయాత్రను ఏవో సాకులతో అర్ధాంతరంగా మధ్యలోనే పార్టీ అధిష్టానం ఆపుచేయించింది. ఇప్పుడు ఆయనకు రాష్ట్ర అధ్యక్ష పదవి పోవడానికి కాకుండా, కేంద్ర నాయకత్వం ముందు దోషిగా నిలబెట్టేందుకు ఆ పాదయాత్ర కారణంగా మారింది. పాదయాత్ర సందర్భంగా వసూలు చేసిన వందల కోట్ల రూపాయలకు లెక్కచెప్పమని పార్టీ అధిష్టానం నిలదీస్తుండటంతో నోటమాట రావడం లేదు.

గత ఆదివారం రాత్రి నోవటెల్ హోటల్ లో అర్ధరాత్రి వరకు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా జరిపిన పార్టీ రాష్త్ర కోర్ కమిటీ సమావేశంలో రాష్ట్రంలో పార్టీ చతికలపడే విధంగా చేసిన రాష్ట్ర నాయకులపై తీవ్ర ఆగ్రవేశాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ సందర్భంగా పాదయాత్ర సందర్భంగా జరిపిన వసూళ్లు కూడా ప్రస్తావనకు వచ్చిన్నట్లు ఆ పార్టీ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

పాదయాత్ర నిర్వహణకు అవసరమైన నిధులను కేంద్ర పార్టీ సమకూర్చగా స్థానికంగా ఆ పేరుతో ఎందుకు వసూళ్లు చేశారని ఆయన నిలదీశారని తెలిసింది. కేంద్రం రూ 37 కోట్లు పంపితే, అందుకు అవసరమైన బిల్లులు పంపారని, కానీ స్థానికంగా భారీగా చేసిన వసూళ్లకు సంబంధించి ఒక రూపాయికి కూడా ఎటువంటి లెక్కలు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వెల్లడైంది. ఆ లెక్కలు ఇవ్వాల్సిందే అని స్పష్టం చేశారు.

పాదయాత్ర పేరుతో భారీగా నిధులు వసూలు చేసి, సొంతానికి స్వాహా చేసిన విషయమై పార్టీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ఒక నివేదికను కేంద్ర పార్టీకి ఇవ్వగా, స్థానిక ఆర్ఎస్ఎస్ ప్రముఖుడు ఒకరు కూడా మరో నివేదిక ఇచ్చారని తెలుస్తోంది. అందుకనే ఈ అంశాన్ని కేంద్ర పార్టీ చాలా సీరియస్ గా తీసుకున్నట్లు స్పష్టం అవుతుంది.

కొందరు బడా కాంట్రాక్టర్లను సహితం భారీ మొత్తాలలో నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారని, దానితో వారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద్వారా నేరుగా అమిత్ షాను కలిసి ఫిర్యాదు చేశారని కూడా తెలుస్తుంది. అప్పటికే కేంద్ర పార్టీకి నిధులు ఇచ్చిన అటువంటి వారిని నిధుల విషయమై కలవొద్దని హోమ్ మంత్రి తీవ్రమైన హెచ్చరిక అప్పట్లోనే చేశారని చెబుతున్నారు.

అదే విధంగా వచ్చే ఎన్నికల్లో పార్టీ సీట్లు ఇస్తామని చాలామంది నుండి కోట్ల కొద్దీ రూపాయలు వసూలు చేయడాన్ని కూడా జెపి నడ్డా ప్రస్తావించారని చెబుతున్నారు. ఆ విధంగా అక్రమంగా నిధులు వసూలు చేయడం పట్ల ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. ఈ విషయంలో కూడా సంజాయిషీ కోరారని తెలిసింది.

రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆగష్టులో పార్టీ నేతలు అందరూ జిల్లాల వారీగా పాదయాత్రలు జరపాలని నడ్డా ఆదేశించారు. ముఖ్యంగా కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, బండి సంజయ్ పాదయాత్రలకు అవసరమైన నిధులను కేంద్ర పార్టీ పంపుతుందని తెలిపారు. ఈ పాదయాత్రల పేరుతో మరోసారి ఎవ్వరి వద్ద నుండి నిధులు వసూలు చేయరాదని హెచ్చరించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles