పొంగులేటి కోసం వైఎస్ జగన్ ను ప్రయోగిస్తున్న బీజేపీ!

Monday, June 24, 2024

కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణాలో ఇతర పార్టీల నుండి మరెవ్వరూ చేరేందుకు సిద్ధపడటం లేదు. పైగా, ఉన్నవారే ఉంటారో, ఇతర పార్టీలలో చేరతారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ మంచి జోష్ లో ఉంటూ అధికారంలోకి వచ్చేందుకు పావులు కదుపుతోంది.

ఈ పరిస్థితుల్లో కలత చెందుతున్న బిజెపి నేతలు బిఆర్ఎస్ నుండి సస్పెండ్ అయిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా తమ పార్టీ శ్రేణులలో కూడా జోష్ నింపేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

ఈ విషయమై బిజెపి చేరికల కమిటీ చైర్మన్, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వారిద్దరితో గంటల తరబడి సమాలోచనలు జరిపినా ఫలితం లేకపోవడంతో ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉపయోగిస్తున్నట్లు తెలుస్తున్నది.

వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉంటూ వస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 2014లో వైఎస్ జగన్ ప్రోత్సాహంతోనే ఖమ్మం నుండి లోక్ సభకు పోటీ చేసి గెలుపొందారు. మరో ఇద్దరినీ వైసీపీ ఎమ్యెల్యేలుగా ఖమ్మం జిల్లాలో గెలిపించుకున్నారు. ఆ తర్వాత జగన్ ప్రోద్భలంతోనే ఆ ఇద్దరు ఎమ్యెల్యేలతో సహా టిఆర్ఎస్ లో చేరారు.

2019లో పొంగులేటికి బిఆర్ఎస్ సీటు ఇప్పించేందుకు జగన్ స్వయంగా తెలంగాణ సీఎం కేసీఆర్ తో పలుసార్లు మంతనాలు జరిపినట్లు వినికిడి. అయినా సీట్ రాకపోయినా అధికార పార్టీలో కొనసాగారు. అయితే పార్టీలో పట్టించుకొక పోవడంతో తిరుగుబాటు ధోరణి అవలంభించి, సస్పెన్షన్ కు గురయ్యారు.

ఇప్పుడు కాంగ్రెస్, బిజెపిలలో ఏదో ఒక పార్టీలో చేరి ఖమ్మంలోని మొత్తం 10 సీట్లను కూడా గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఒకొక్క నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాలు జరుపుతూ పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటిస్తున్నారు. అయితే ఏ పార్టీలో చేరబోయే విషయం మాత్రం చెప్పలేకపోతున్నారు.

బీజేపీలో చేరేందుకు సిద్దపడినా ఖమ్మం జిల్లాలో ఆ పార్టీ ఉనికి లేదని, అటువంటి పార్టీలో చేరితే కలిగే ప్రయోజనం ఉండబోదని మద్దతుదారులు నిరుత్సాహ పరుస్తూ ఉండడంతో వెనుకడుగు వేస్తున్నారు. కాంగ్రెస్ లో చేరమని మద్దతుదారులు ప్రోత్సహిస్తున్నారు.  జూపల్లి కృష్ణారావు సహితం తన మద్దతుదారుల నుండి ఇటువంటి వత్తిడులనే ఎదుర్కొంటున్నారు.

కాంగ్రెస్ సహితం పొంగులేటితో సుదీర్ఘంగా మంతనాలు జరిపి, ఆయన డిమాండ్లకు తలొగ్గిన్నట్లు చెబుతున్నారు. పొంగులేటిని బిజెపిలోకి తీసుకొచ్చేందుకు ఈటెల చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో బిజెపి కేంద్ర నాయకత్వం రంగంలోకి దిగి, ఈ బాధ్యతను వైఎస్ జగన్ కు అప్పచెప్పిన్నట్లు తెలుస్తున్నది.

అయితే బీజేపీలో చేరిన ఇతర నాయకులెవ్వరూ సంతృప్తికరంగా లేరని పొంగులేటి సందేహిస్తున్నారు. తాజాగా, పొంగులేటి సన్నిహితుడైన మట్టా దయానంద్ కాంగ్రెస్ లో చేరడంతో ఆయన బీజేపీలో చేరినా ఆయనతో పాటు ఆ పార్టీలో ఎందరు చేరుతారనే ప్రశ్న తలెత్తుతుంది.

కానీ, బీజేపీలో రాజకీయంగా మంచి భవిష్యత్ కు తాను భరోసాగా ఉంటానని జగన్ హామీలు ఇస్తున్నారు. అంతేకాకుండా, తెలంగాణాలో జరిగే ఎన్నికలలో బిజెపి చతికలపడితే ఏపీ నుండి రాజ్యసభకు పంపిస్తానని కూడా జగన్ హామీ ఇచ్చారని చెబుతున్నారు. వారం రోజుల క్రితం జగన్ తో ప్రత్యేకంగా భేటీ అయినట్లు పొంగులేటి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

పైగా, వ్యాపారపరంగా కూడా వైఎస్ జగన్ హయాంలో ఏపీ ప్రభుత్వంతో పొంగులేటికి పలు లావాదేవీలు ఉన్నట్లు తెలుస్తోంది. వైఎస్ కుటుంభంతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా వైఎస్సార్ టిపిలో చేరమని వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల కోరారు కూడా. వారిద్దరిని కలిసినప్పటికీ, ఆ పార్టీలో చేరేందుకు సుముఖంగా లేరని స్పష్టం అవుతుంది. ఖమ్మం జిల్లా పాలేరు నుండి పోటీ చేస్తున్నట్లు షర్మిల ప్రకటించడానికి ప్రధాన కారణం అక్కడ పొంగులేటికి గల ప్రాబల్యమే అని కూడా పలువురు భావిస్తున్నారు.

ఏదేమైనా వైఎస్ జగన్ తో సాన్నిహిత్యం కారణంగా ఏపీలో నోటా కన్నా తక్కువ ఓట్లతో తుడిచిపెట్టుకు పోతున్న బిజెపి తెలంగాణాలో ఏపీ సీఎంను నమ్ముకొని పార్టీకి ఏమేరకు జీవం పోయగలదో చూడాల్సి ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles