తెలుగుదేశానికి ఈసారి ‘ఆగస్టు వికాసం’!

Sunday, March 3, 2024

సాధారణంగా తెలుగుదేశం పార్టీకి ఆగస్టు సంక్షోభం ఉంటుందని అంటూ ఉంటారు. ఎప్పుడో ఒకప్పుడు ఆగస్టులో పార్టీలో కుదుపులు వచ్చాయి గనుక.. దానిని సార్వజనీనమైన సిద్ధాంతంలాగా మార్చేసి.. పార్టీకి ఆగస్టు సంక్షోభం గండం ఉన్నదని.. ఆగస్టులో వారికి అనేక ఇబ్బందులు తప్పవని ప్రత్యర్థులు ఒక రకమైన దుర్మార్గమైన ప్రచారం చేస్తుంటారు. కానీ ఇప్పుడున్న రాజకీయ వాతావరణాన్ని పరిశీలిస్తే.. తెలుగుదేశం పార్టీకి ఆగస్టు సంక్షోభం కాదు కదా.. ఆగస్టు వికాసం పొంచి ఉన్నదని అనిపిస్తోంది.
నారాలోకేష్ సాగిస్తున్న యువగళం పాదయాత్ర మంగళవారం నాడు నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ విజయాలను వైసీపీకి అందించిన నెల్లూరు జిల్లాలో ఆల్రెడీ ఆ పార్టీకి మూడు వికెట్లు పడ్డాయి. ఆనం, కోటంరెడ్డి, మేకపాటి లు ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నారు. వీరు తెలుగుదేశం పార్టీతో అనుబంధం పెంచుకున్నారు. నెల్లూరు జిల్లాలో లోకేష్ పాదయాత్ర పూర్తయిన తరువాత.. తాము తెలుగుదేశం పార్టీలో చేరుతామని ఈ నాయకులు ప్రకటిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో లోకేష్ పాదయాత్ర 33 రోజుల పాటు సాగుతుంది. అంటే అప్పటికి.. జులై నెల మూడో వారం కూడా వచ్చేస్తుంది.
తమ జిల్లాల్లో యాత్ర సాగినంత కాలమూ ఈ నాయకులు తెదేపాలో చేరకుండానే.. యాత్రకు పూర్తిస్థాయిలో సహకరిస్తారు. తమ శ్రేణులను పాదయాత్రలో పాల్గొనేలా చేస్తారు. తాము కూడా వెంట ఉండి పాదయాత్ర చేస్తారు. ఇదంతా ఆల్రెడీ నిర్ణయించేశారు. కాకపోతే టెక్నికల్ గా తెలుగుదేశం పార్టీలో చేరడం అనేది పాదయాత్ర నెల్లూరుజిల్లాలో పూర్తయిన తర్వాత.. అంటే సుమారుగా ఆగస్టు నెలలో జరిగే అవకాశం ఉంది.
సాంకేతికంగా తమ ఎమ్మెల్యే పదవికి ఇబ్బంది రాకుండా, ఒకవేళ పదవి పోయినా సరే.. తమ స్థానంలో ఉపఎన్నిక రాకుండా చూసేందుకే ఈ నాయకులు తమ చేరికలకు అప్పటికి ముహూర్తం నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఆగస్టులో ఈ నాయకులు తెదేపాలో జాయిన్ అవుతారు. అప్పుడు.. వీరి మీద అనర్హత వేటుకు వైసీపీ స్పీకరుకు ఫిర్యాదు చేసినా సరే.. వారికి నోటీసులు పంపి, పిలిపించి విచారించి వారిని అనర్హులుగా ప్రకటించే నిర్ణయం తీసుకునే వేళకు ఇంకో రెండు నెలలు గడుస్తాయి. అప్పుడిక.. ఆ సీట్లను ఖాళీ ఉన్నట్టుగా నోటిఫై చేసినా సరే.. ఉప ఎన్నిక వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. ఆ రకంగా ఆగస్టులో వీరి చేరికలు టీడీపీకి ఎడ్వాంటేజీ అవుతాయి.
తెలుగుదేశానికి ఆగస్టు వికాసం అంటే ఇదొక్క పరిణామమే కాదు. నిజానికి అనర్హత వేటు పడే అవకాశం లేని రోజు వచ్చేస్తే గనుక.. మరింత మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి ఫిరాయించి టీడీపీలో చేరడానికి సుముఖంగా ఉన్నారనే చర్చ నడుస్తోంది. అలా.. ఈ ముగ్గురు మాత్రమే కాకుండా మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తే.. అది ఖచ్చితంగా ఆ పార్టీకి ఆగస్టు వికాసమే అవుతుంది. అందుకోసం పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles