వైఎస్ఆర్ తనయ, తాను కోరుకుంటున్న రాజకీయ అధికారాన్ని తన కష్టంతోనే పొందాలని తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న షర్మిల.. హఠాత్తుగా వార్తల్లో వ్యక్తి అయ్యారు. తెలంగాణ పోలీసులు ఆమెను అరెస్టు చేయడం.. ఆ సందర్భంగా జరిగిన హైడ్రామా, ఉద్రిక్త పరిస్థితులు, గతంలో ఎన్నడూ ఎరగని చిత్రవిచిత్ర పరిణామాలు, హెచ్చరికలు ఇవన్నీ కలిపి.. షర్మిలకు హఠాత్తుగా తెగ క్రేజ్ తెచ్చి పెట్టాయి.
తన అరెస్టును, ఆ సందర్భంగా జరిగిన దాడిని, తదనంతర పరిణామాలను.. ఈ క్రేజ్ నిర్మించుకోవడానికి షర్మిల చాలా చక్కగా ఉపయోగించుకున్నారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో షర్మిల కూడా ఒక టాపిక్ అయ్యారు. షర్మిల గురించి అటు రాజకీయ నాయకులు గానీ, తెలంగాణ ప్రజలు గానీ.. మాట్లాడుకోవడం ఆమె పార్టీ పెట్టిన తర్వాత ఇంతగా ఎన్నడూ జరగలేదు.
ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్ సీఎం అయ్యారంటే.. అందులో షర్మిల రెక్కల కష్టం కూడా ఎంతో ఉంది. అంత పాటుపడినప్పటికీ.. రాజకీయంగా తనకు కాసింత విలువ, హోదా కూడా దక్కకపోయేసరికి కోపగించిన షర్మిల .. తన దారి తాను చూసుకునే ప్రయత్నంలో భాగంగా తెలంగాణను రాజకీయ రణక్షేత్రంగా ఎంచుకున్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించారు. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తాం అని చెబుతున్నారు. ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా సరే.. సీఎం కేసీఆర్ మీద, కేటీఆర్ మీద చాలా తీవ్రమైన విమర్శలతో విరుచుకుపడుతుంటారు.
అన్నయ్య జైలులో ఉన్నప్పుడు పార్టీకోసం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బతికించడం కోసం పాదయాత్ర చేసిన అలవాటున్న షర్మిల.. తెలంగాణలో తన సొంత పార్టీకి రాష్ట్రవ్యాప్త ప్రజాదరణ తీసుకురావడానికి పాదయాత్ర ప్రారంభించారు. విడతలు విడతలుగా జరుగుతున్న ఈ పాదయాత్రలో ఇప్పటికే 3500 కిలోమీటర్ల నడకపూర్తిచేశారు. జగన్ రాష్ట్రమంతా నడిచింది 3648 కిమీలు మాత్రమే. అలాంటిది షర్మిల ఇప్పటికే మూడున్నర వేలు నడిచారు. మరికొన్నాళ్లు ఆగితే అన్నయ్య రికార్డును బద్దలు చేసేస్తారు. ఇలాంటి సమయంలో షర్మిల అరెస్టు జరిగింది.
అయితే రాజకీయ వ్యూహప్రతివ్యూహాలలో రాటుదేలిపోయిన కుటుంబంనుంచి వచ్చిన షర్మిల ఈ అరెస్టును చక్కగా వాడుకున్నారు. తన ఇంటిలోంచి కాకుండా, లోటస్ పాండ్ లో పక్కనే ఉన్న అన్నయ్య జగన్ ఇంటింలోంచి బయటకు వచ్చి.. కారులో ప్రగతి భవన్ కు వెళ్లే ప్రయత్నంలో హల్ చల్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు అడ్డుకుంటే.. తీవ్రంగా ప్రతిఘటించారు. ఆమె కూర్చున్న కారును క్రేన్ సహాయంతో పోలీసు స్టేషన్ కు తరలించి.. లాఠీలతో కారు డోర్లు తెరచి.. పోలీసులు కూడా బీభత్సరసప్రధానంగా మరో ఎపిసోడ్ యాడ్ చేశారు.
ఈ రెండు రోజుల పరిణామాలతో షర్మిల క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తెలంగాణ రాష్ట్రమంతా ఇప్పుడు ఆమె గురించి మాట్లాడుకుంటున్నారు. మూడున్నరవేల కిలోమీటర్లు నడిస్తే జనం గానీ, ప్రభుత్వంలోని పెద్దలుగానీ పట్టించుకోలేదు. కనీసం ఆమె విమర్శలకు కూడా రెస్పాన్స్ ఇవ్వకుండా ఆమెను తెరాస పెద్దలు చులకన చేశారు. అంత పాదయాత్రతో రాని క్రేజ్ షర్మిలకు ఇప్పుడు వచ్చింది. ఈ క్రేజ్ రాజకీయంగా ఉపయోగపడేలా షర్మిల అడుగులు ఉంటాయా? లేదా యథాపూర్వ స్థితి వస్తుందా వేచిచూడాలి.