ముఖ్యమంత్రిగా ఉంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత.. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఆయన గౌరవార్థం.. ఆయన సొంత జిల్లాకు వైఎస్సార్ కడపజిల్లా అని నామకరణం చేసింది. ఆ నిర్ణయం పట్ల ఎవ్వరూ అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు కూడా. విపక్షాలతో సహా ఆ నిర్ణయాన్ని స్వాగతించాయి. అయితే జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత.. తండ్రి కూడా తాను కూడా ఏదో ఒకటి చేసినట్టుగా కనిపించాలని అనుకున్నారు. అందుకే వైఎస్సార్ కడప జిల్లాగా ఉన్న పేరును కేవలం ‘వైఎస్సార్ జిల్లా’ అని మార్చేశారు. ‘కడప’ అనే పేరుతో ఆ జిల్లాకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని ఆయన సమూలంగా కబళించేశారు. తాజాగా కూటమి ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో ఈ తప్పును కూడా సరిదిద్దింది.
వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుగా.. తండ్రిని కోల్పోయిన బిడ్డగా ఆయనపట్ల ప్రజల్లో ఉండే ఆదరణను తన రాజకీయానికి పెట్టుబడిగా వాడుకున్న జగన్మోహన్ రెడ్డి.. వైఎస్సార్ పట్ల భక్తి ప్రపత్తులను చూపించుకోవడమే లక్ష్యంగా.. తన జిల్లా అసలు పేరును తొలగించేసి.. కేవలం తండ్రి పేరు మాత్రమే పెట్టారు. కడప అనే పేరు ఏదో సాధారణమైన పేరు కాదని.. తిరుమల వేంకటేశ్వరుని దర్శనార్థం వెళ్లే వారికి వాకిలి వద్దకు చేరుకున్నట్లుగా స్ఫురింపజేసే.. నదేవుని కడపగా దానికి విశిష్ట ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్నదని అప్పట్లో జిల్లాలోని మేధావులు, ఆలోచన పరుల నుంచి ఎంతగా అభ్యంతరాలు వ్యక్తం అయినప్పటికీ.. జగన్ సహజంగానే ఖాతరు చేయలేదు.
అక్కడితో ఆగలేదు. జగన్ ప్రభుత్వ కాలంలో తాడిగడప అనే మునిసిపాలిటీ ఏర్పడగా దానికి కూడా వైఎస్సార్ తాడిగడప అని పేరు పెట్టారు. నిజానికి తాడిగడప ప్రాంతానికి వైఎస్సార్ కు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ.. ఆయన పేరు పెట్టేశారు. అక్కడి ప్రజల అభ్యంతరాలను కూడా పట్టించుకోలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం ఈ రెండు తప్పులను కూడా సరిదిద్దింది. కేబినెట్ సమావేశంలో తాడిగడప మునిపాలిటీ పేరులో వైఎస్సార్ పదాన్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రాంతాల ప్రాధాన్యం దెబ్బతినకూడదు కదా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వైఎస్సార్ మరణం తర్వాత.. కడప జిల్లాకు ఆయన పేరు జోడించడం పట్ల ఎవ్వరికీ అభ్యంతరం లేదని కూడా కేబినెట్ లో వ్యాఖ్యానించారు. అయితే జగన్ వచ్చిన తర్వాత.. వైఎస్సార్ జిల్లాగా మాత్రం ఉంచి కడప పదాన్ని తొలగించడం పట్ల మాత్రం అభ్యంతరం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు పేరును జోడించారు తప్ప.. నెల్లూరు అనే పదాన్ని తీసేయలేదు కదా అని గుర్తు చేశారు. అలాగే.. వైఎస్సార్ కడప జిల్లా అనే పేరును పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
వైఎస్సార్ పేరు.. ప్రాశస్త్యాన్ని మింగేయకూడదు!
Thursday, March 20, 2025
