వైసీపీ వాహన నిపుణులు ఇక నోర్లు మూస్తారా?

Sunday, January 11, 2026

పవన్ కల్యాణ్ ప్రచార రథం.. ‘వారాహి’ వాహనం గురించి అవాకులు చెవాకులు పేలుతున్న వారంతా.. ఇక నోర్లు మూయాల్సిన సమయం ఆసన్నం అయింది. ఆ వాహనం రిజిస్ట్రేషన్ వారం రోజుల కిందటే పూర్తయింది. వాహనానికి మిలిటరీ గ్రీన్ రంగు వేయడానికి వీల్లేదు, వాహనం ఎత్తు సరిగా లేదు… ఎక్కువైపోయింది.. వాహనం అలా ఉంది ఇలా ఉంది.. రిజిస్ట్రేషన్ కుదరదు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇన్నాళ్లూ నానా మాటలూ అన్నారు. తమ వాచాలత్వాన్ని ప్రదర్శించారు. అయితే.. ఈ నెల 9 తేదీనే హైదరాబాదు టోలిచౌకిలో రిజిస్ట్రేషన్ పూర్తయిన సంగతిని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టంచేశారు. వాహనానికి TS13EX 8384 నెంబ‌ర్ కేటాయించినట్లు తెలిపారు.ఈ వాహనానికి అన్ని అనుమతులు ఉన్నాయన్నారు. 

వైఎస్సార్ సీపీ నాయకులు గోలచేసినట్టుగా కాకుండా.. వాహనం రంగును మిలిటరీ గ్రీన్ కాదు.. ఎమరాల్డ్ గ్రీన్ అని నిర్ధారించినట్లు చెప్పారు. అందుకు సంబంధించిన సాంకేతిక కలర్ కోడ్ లను కూడా ఆయన వెల్లడించారు. 

ఇన్నాళ్లూ వైసీపీ నాయకులు చేసిన గోల తుస్సుమని పోయింది. క్లుప్తంగా చెప్పాలంటే.. ఇన్నాళ్లూ వారాహి గురించి వాగిన వారంతా ఇప్పుడు నోరు మూసుకోవాల్సిన పరిస్థితి. కానీ వాళ్లు వెనక్కు తగ్గే రకం కాదు కదా! అందుకే మంత్రి గుడివాడ అమర్ నాధ్ ఇంకా నోరు పారేసుకుంటున్నారు. ఏపీ ప్రభుత్వం వివరించిన నిబంధనలకు జడిసి.. పవన్ కల్యాణ్ తన వారాహి వాహనాన్ని తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని గుడివాడ వాక్రుచ్చారు. వాహనం తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయినా సరే.. అది తిరగాల్సింది ఏపీ రోడ్ల మీదనే కాబట్టి.. ఏపీ లోని నిబంధనలే వర్తిస్తాయని ఆయన తన జ్ఞానాన్ని ప్రదర్శించడం విశేషం. 

దేశంలో ఒక చోట రిజిస్ట్రేషన్ అయిన వాహనం.. టాక్సీ అయితే తప్ప.. ఎక్కడైనా పర్యటించవచ్చు అనేది మినిమం కామన్ సెన్స్ ఉండే ఎవ్వరికైనా అర్థమవుతుంది.కానీ గుడివాడ అమర్ నాధ్ మంత్రిగా ఉంటూ తన అజ్ఞానాన్ని చాటుకునేలా.. ఏపీలోకి వస్తే ఆ వాహనాన్ని తిరగనివ్వం అన్నట్టుగా మాట్లాడుతుండడం వారి పరువు తీస్తోంది. 

పవన్ కల్యాణ్ తన ఎన్నికల ప్రచార యాత్ర షెడ్యూలును ఇంకా ప్రకటించలేదు. కేవలం వారాహి వాహనానికి సంబంధించిన లాంఛనాలను మాత్రం పూర్తి చేయిస్తున్నారు. వాహనం చూస్తేనే జడుసుకుంటున్న వాళ్లు.. రేపు పవన్ స్వయంగా ఆ వాహనాన్ని అధిరోహించి.. ప్రభుత్వ వైఫల్యాలను నడిరోడ్డు మీద నిప్పులతో కడగడం ప్రారంభిస్తే.. ఏమైపోతారో అని ప్రజలు అనుకుంటున్నారు.

No tags for this post.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles