కవిత కేస్ : ఆచితూచి వ్యవహరిస్తున్న కేసీఆర్ దళం!

Friday, May 17, 2024

ఇంతకూ ఢిల్లీ మద్యం కుంభకోణంలో కల్వకుంట్ల కవిత ఎంత లోతువరకు ఇరుక్కున్నారు. ఏదో మోకాళ్ల దాకా ఆ ఊబిలోకి దిగి, తలచుకుంటే బయటకు వచ్చేయగలదులే అనుకునే స్థితిలో ఉన్నారా? నడుములోతు దిగబడి.. బయటకు వచ్చినా సరే పరువుపోవడం గ్యారంటీ అనుకునే మాదిరి ఉన్నారా? పీకల్లోతు దిగబడిపోయి బయటకు రావడం కూడా అసాద్యం అనిపించే దశలో ఉన్నారా? అనే సందేహాలు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చల్లో నడుస్తున్నాయి. అయితే తాజా పరిణామాలను గమనిస్తోంటే.. భారాసలోనే అంతర్గత వ్యవహారాలు, నాయకుల తీరును గమనిస్తోంటే.. కవితకు ఇక్కట్లు తప్పవనే అనిపిస్తోంది. 

కవిత ఒక విడత సీబీఐ విచారణను పూర్తి చేశారు. విచారణకు ముందు, తరువాత కూడా.. ఆమె నేరుగా తండ్రి కేసీఆర్ వద్దకు వెళ్లి మార్గదర్శనం తీసుకున్నారు.. నివేదిక సమర్పించి వచ్చారు. అయితే కవిత కేసులకు సంబంధించి.. కేసీఆర్ నేరుగా వకాల్తా పుచ్చుకోలేదు. నిజానికి ఆయన కేంద్రం సంస్థల మీద దుమ్మెత్తిపోస్తూ, వ్యవస్థల్ని దుర్వినియోగం చేసి రాజకీయ ప్రత్యర్థుల్ని వేధిస్తున్నారని అన్న మాటలు మల్లారెడ్డి పై ఐటీ దాడులకు వ్యతిరేకంగా అన్నట్లే ధ్వనించాయి తప్ప.. తన కూతురి మీద విచారణను తప్పుపట్టినట్టులేదు. 

పరిణామాలను జాగ్రత్తగా  గమనిస్తే.. కవిత మీద ఆరోపణలు వచ్చిన తొలి సందర్భాలలో అప్పటి తెరాస నాయకులు మంత్రులు పలువురు ఆమె ఇంటి వద్దకు క్యూ కట్టారు. ఆమెకు మద్దతుగా దాదాపుగా అందరు మంత్రులూ గళమెత్తారు. అయితే ఇప్పుడు సీన్ మారినట్లుగా కనిపిస్తోంది. 

కవిత సీబీఐ విచారణ ఎదుర్కొని రెండు రోజులు గడిచాయి. ఇప్పటిదాకా పార్టీ అధినేత కేసీఆర్ గానీ, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గానీ ఆమెకు మద్దతుగా మాట్లాడలేదు. మంత్రులు కూడా ఇదివరకు లాగా అతిగా స్పందించలేదు. ఈ సంకేతాలన్నీ ఏదో తేడా కొడుతున్నాయి. కవిత కేసు విషయంలో అనవసరంగా నోరు పారేసుకోకుండా భారాస శ్రేణులు, నాయకులు జాగ్రత్త పాటిస్తున్నారా అనిపిస్తోంది. పైగా తెలంగాణ జాగృతి సమావేశంలో కవిత స్వయంగా కేంద్రంపై విమర్శలు చేశారు. కేంద్రంతో పోరాటాన్ని ఆమె స్వయంగా తేల్చుకోవాల్సిందేనా? పార్టీ ఆమెకు మద్దతుగా నిలవదా? అనే సందేహాలు ప్రజల్లో ఉన్నాయి. పార్టీ అండగా మాట్లాడడం లేదంటే.. కవిత కేసులో ఎంతో కొంత సీరియస్ ఇరుక్కున్నట్టే అని కూడా ప్రజలు అనుకుంటున్నారు. కవితను ఎక్కువగా వెనకేసుకు వచ్చేకొద్దీ పరువుపోతుందని పార్టీ భయపడుతున్నట్టుంది. 

ఢిల్లీ భారాస కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలోనైనా కేసీఆర్ జనాంతికంగా సంస్థలను వాడుకుని దాడులు చేస్తున్నారు అనే పాచి డైలాగు కాకుండా , తన కూతురు మీద సీబీఐ విచారణ గురించి నోరెత్తితే పార్టీ ఆమెకు అండగా నిలుస్తున్నట్టు అనుకోవాలి. లేపోతే ఆమె పాట్లు ఆమె పడాల్సిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles