ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు చిత్రమైన రాజకీయం నడుస్తోంది. భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఒక్కసారిగా ఆదరణ పెరిగింది. ఆదరణ అంటే ప్రజలందరూ ఆ పార్టీ పట్ల ఎగబడుతున్నారనేది కాదు.. కనీసం ఒక వర్గానికి చెందిన నాయకుల్లో అలాంటి ఆదరణ పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. జగన్ నమ్ముకుంటే భవిష్యత్తు ఉండదని భయపడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు అనేకమంది తమకు దొరుకుతున్న ఏకైక ప్రత్యామ్నాయంగా భాజపాను ఎంచుకుంటున్నారు. భాజపా పెద్దలతో టచ్ లోకి వెళుతున్నారు.
ఏపీ రాజకీయాల గురించి భవిష్యత్తులో ఎవరైనా చరిత్రగతిని తెలియజెప్పే వ్యాసం కరాస్తే.. ‘2024 ఎన్నికలకు ముందు- తర్వాత’ అని స్పష్టంగా విభజించి చెప్పాల్సి ఉంటుంది. అవును మరి.. ఎన్నికలకు పూర్వం రాజకీయాలు వేరు.. ఇప్పుడు రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. రాష్ట్రంలోని మూడు కీలక పార్టీలు కలిసి అనన్యమైన ప్రజాదరణతో, కేంద్రం సహకారంతో.. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తున్న పాలన అందిస్తున్నాయి. అదే సమయంలో.. ప్రజల నమ్మకాన్ని ఒకదఫా చూరగొని కూడా.. దారుణంగా విఫలం అయిన జగన్మోహన్ రెడ్డి.. విఫల పార్టీ నేతగా ముద్ర పడుతున్నారు. ఆయనకు పార్టీ నడిపే తీరు కూడా రావడం లేదని నాయకులు లోలోన మాట్లాడుకుంటున్నారు. పార్టీ ఓడిపోయిన తర్వాత.. ఇప్పటికే అనేకమంది కీలక నాయకులు రాజీనామాలు చేసి వెళ్లిపోయారు. వైఎస్సార్ సీపీ ద్వారా వచ్చిన చట్టసభ పదవులను కూడా వదులుకున్నారు. ఇంకా కొందరు కొనసాగుతున్నారంటే.. వారికి ఇతర కూటమి పార్టీల్లోకి ఎంట్రీ లేకపోవడమే కారణం అనే వాదన ఉంది. తెలుగుదేశం, జనసేన పార్టీలు.. వైసీపీ వారిని చేర్చుకోవడంపై అంత శ్రద్ధగా లేవు. స్థానికంగా నియోజకవర్గాల్లో తమ పార్టీ నేతల మధ్య విభేదాలకు కారణం అవుతాయనే ఆలోచనతో ఉన్నారు. అయితే ఇప్పుడు వైసీపీ నేతలు పలువురు బిజెపి వైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
వైసీపీని ఖాళీ చేయడమే మా లక్ష్యం, ఆ పార్టీకి రాష్ట్రంలో 20 శాతం ఓటు బ్యాంకు కూడా లేకుండా చేస్తాం అని ఇటీవల బీజెపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రకటించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ పార్టీకి ప్రస్తుతం పరిమితం మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు కూడా కొందరు.. జగన్ తీరుతో విసిగిపోయి పార్టీని వదలిపెట్టాలని అనుకుంటున్నారుట! అలాంటి వారికి కమలదళం రెడ్ కార్పెట్ వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తే వెంటనే చేర్చుకోవాలని, ఇతర ఆ స్థాయి నాయకులు ఇతర నియోజకవర్గాల్లోని వారు వచ్చేట్లయితే ఆచితూచి వ్యవహరించాలని బిజెపి అనుకుంటోంది. ఎమ్మెల్యేలు ఓకే గానీ.. ఇతర నాయకుల్ని చేర్చుకోవడం ఆయా నియోజకవర్గాల్లో కూటమి మైత్రికి ఇబ్బంది అవుతుందని ఆలోచిస్తున్నారట. జగన్ తన పార్టీ వారెవ్వరినీ శాసనసభకు కూడా హాజరుకానివ్వకుండా కట్టడి చేస్తున్న సమయంలో.. వారిలోని అసంతృప్తిని తమకు అనుకూలంగా మలచుకుని.. పార్టీ వీడే వారిని చేర్చుకోవాలని బిజెపి అనుకుంటోంది. కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే బేషరతుగా పార్టీలోకి రావడానికి మంతనాలు పూర్తి చేసుకుని.. ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నట్టుగా కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
బిజెపి చుట్టూ వైసీపీ నేతల ప్రదక్షిణాలు!
Thursday, March 27, 2025
