వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, తాము కూడా ఏదో పని చేస్తున్నట్లుగా కనిపించడానికి, ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్నామని టముకు వేసుకోవడానికి.. చేస్తున్న మరొక వక్ర ప్రయత్నం ఇవాళ చోటు చేసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా వారు తలపెట్టిన నిరసన ప్రదర్శనలు మొక్కుబడి తంతుగా జరగబోతున్నాయి. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే యూరియా సరఫరానే సరిగా లేకపోవడం వలన రాష్ట్రంలో కూడా రైతులు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. కేవలం మన రాష్ట్రంలో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా యూరియా కొరత ఏర్పడింది. పొరుగున ఉన్న తెలంగాణలో కూడా ఏరియా కోసం విలవిల్లాడుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన వెంటనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సకాలంలో స్పందించింది. కేంద్రంతో సంప్రదింపులు జరిపింది గనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెరుగైన ఫలితం రాబట్టగలిగింది. రైతులు ఎదుర్కొన్న సమస్య ఒక కొలిక్కి వచ్చేస్తున్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తమ మొక్కుబడి పోరాటం చేయడం ఆశ్చర్యకరంగాను, నవ్వుల పాలయ్యే విధంగానూ ఉంది.
యూరియా కొరత కనిపించిన వెంటనే చర్యలు తీసుకున్న ప్రభుత్వం బ్లాక్ మార్కెట్ను అడ్డుకోవడంలో చాలావరకు సఫలమైంది. అదే సమయంలో అదనపు యూరియా సరఫరా కోసం కేంద్రంతో సంప్రదింపులు జరిపింది. 50 వేల టన్నుల యూరియా కేటాయింపులకు కేంద్రం జీవో కూడా ఇచ్చింది. ఆల్రెడీ కాకినాడ పోర్ట్ లో 17 టన్నులకు పైగా యూరియాను దిగుమతి చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం చేసిన ఇన్ని ప్రయత్నాల కారణంగా సమస్య ఒక కొలిక్కి వచ్చేస్తుండగా ఇప్పుడు మంగళవారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ తమ మొక్కుబడి పోరాటాలకు ముహూర్తం నిర్ణయించుకుంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలినుంచి కూడా దాదాపు అన్ని వ్యవహారాలలోనూ ఇదే విధంగా సమస్య తీరిపోతున్న సమయంలో తమ మొక్కుబడి పోరాటాలకు పిలుపు ఇస్తున్నదని ప్రజలు అనుకుంటున్నారు. మిర్చి రైతుల విషయంలో కూడా ఇదే జరిగింది. కేంద్రంతో చంద్రబాబు నాయుడు సంప్రదింపులు జరిపి ఒక పరిష్కారం తీసుకు వచ్చిన తరువాత జగన్మోహన్ రెడ్డి ఒక తూతూమంత్రపు పర్యటన జరిపారు.
బంగారుపాళ్యంలో మామిడిరైతుల పరామర్శ, వారికోసం పోరాటం అనేది ఇంకా కామెడీ. మామిడి రైతులకు రాష్ట్రప్రభుత్వమే గిట్టుబాటు అయ్యేలా మంచి ధరను ప్రకటించిన తర్వాత.. ఎన్ని ఎకరాల్లో పంటనైనా ప్రభుత్వమే కొంటుందని ప్రకటించి ఎంతో అండగా నిలబడిన తర్వాత జగన్ తన మొక్కుబడి పరామర్శల డ్రామాను నడిపించారు. రోడ్ల మీద మామిడికాయలు పోయించడం, కారుతో తొక్కించడం వంటి విపరీత చేష్టలకు పాల్పడ్డారు.
ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఓడగొట్టిన తర్వాత ఈ పదిహేను నెలల కాలంలో.. తన ప్రతిపక్షనేత హోదాకోసం తప్ప.. మరే ఇతర ప్రజల అంశం కోసమూ చిత్తశుద్ధితో పోరాడిన దాఖలానే లేదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజల కోసం చేసేవన్నీ తూతూమంత్రపు ప్రయత్నాలే అంటున్నారు.
