నకిలీ ఐపీలను వాడుకుంటూ తప్పుడు పోస్టులు పెట్టడం, అధికార పార్టీ నాయకులు, వారి కుటుంబ సభ్యుల మీద నిచమైన పోస్టులతో చెలరేగడం అలవాటుగా మార్చుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దళాలు ఇప్పుడు కొంచెం జాగ్రత్త పడుతున్నాయి. అతి వేషాలు వేస్తే.. ప్రభుత్వం కత్తి ఝుళిపించి కేసులు పెడుతుండేసరికి వారిలో భయం మొదలవుతోంది. అసభ్య పోస్టులతో చెలరేగిన వారు ఇప్పుడు దారికి వస్తున్నారు. తప్పయిపోయింది మన్నించండి అంటూ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ లోనే పోస్టులు పెడుతున్నారు. తమను టార్గెట్ చేయవద్దని వేడుకుంటున్నారు.
సోషల్ మీడియా ముసుగులో వైసీపీ వారి దుర్మార్గాలు శృతిమించుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాన్ని, విధానాలను విమర్శించే వారి విషయంలో ఓకేగానీ, నాయకుల కుటుంబసభ్యుల ఫోటోలతో మార్ఫింగ్ చేస్తూ అసభ్యమైన నీచమైన పోస్టులు పెడుతున్న వారిని ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హెచ్చరించారు కూడా. ఇలాంటి వారి భరతం పట్టడానికి కొత్త చట్టం తీసుకువచ్చే ప్రయత్నంలో కూడా ఉన్నారు. ఇప్పటికే అరెస్టులు జరుగుతున్నాయి. పలువురిని అదుపులోకి తీసుకుని 41ఏ నోటీసులు ఇచ్చి వదిలివేయడం జరుగుతోంది. ఈ చర్యలతోనే వైసీపీ మూకల్లో కదలిక వచ్చింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారి ఆలోచనలో మార్పు వస్తోంది. ‘మీ పాటికి మీరు రెచ్చిపోతూనే ఉండండి.. చెలరేగుతూనే ఉండండి.. మీమీద కేసులు వస్తే ఆ సంగతి మేం చూసుకుంటాం.. మీకోసం లీగల్ సెల్ ఏర్పాటుచేశాం’ అంటూ జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామక్రిష్ణారెడ్డి లాంటి వాళ్లు ఊదరగొడుతున్నారు గానీ.. కార్యకర్తలకు ధైర్యం చిక్కడం లేదు. మళ్లీ మనం అధికారంలోకి వస్తాం.. అప్పుడు తెలుగుదేశం వారి అంతు చూస్తాం అనే మాటలు వారికి మరింతభయం కలిగిస్తున్నాయి. తమ నాయకులు ఇలా ఎంతగా బెదిరిస్తున్న కొద్దీ.. ఇప్పటి ప్రభుత్వం తమ మీద అంతగానే కేసులు బిగించేస్తుందని వారు భయపడుతున్నారు. అందుకే లెంపలు వేసుకుని.. ఇక ఈ సోషల్ మీడియా బూతులు, అసభ్య వ్యవహారాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారు.
వైసీపీ తరఫున బూతు పోస్టులు పెడుతున్నందుకు, స్ప్రెడ్ చేస్తున్నందుకు పార్టీ తమకు పేమెంట్ డబ్బులు ఇస్తుందే తప్ప, తమ బాగోగులు చూసేది ఉండదు కదా.. అనే ఆలోచన వారిలో వస్తోంది.అందుకే మేలుకుని, ఇక తప్పుడు పోస్టులు పెట్టం.. మిమ్మల్ని క్షమించి వదిలేయండి అని విన్నవించుకుంటున్నారు. ప్రభుత్వం కత్తి ఝుళిపించి కఠినంగా వ్యవహరిస్తుండేసరికి మార్పు వస్తున్నదని, ఫలితం కనిపిస్తున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
కత్తి ఝుళిపించాక జడుసుకుంటున్న వైసీపీ మూకలు!
Sunday, December 22, 2024