ఇది 2022 జూన్ నాటి కేసు. అప్పట్లో కోనసీమ అల్లర్లు జరుగుతున్న సమయంలో అయినవిల్లికి చెందిన గ్రామ వాలంటీరు అయిన ఒక దళిత యువకుడు జనుపల్లి దుర్గాప్రసాద్ కనపడకుండా పోయాడు. అతని భార్య శ్రావణ సంధ్య పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. పోలీసులు తొలుత మిస్సింగ్ కేసు నమోదు చేశారు. నాలుగురోజుల తర్వాత కోటిపల్లి రేవులో దుర్గాప్రసాద్ మృతదేహం దొరికింది. దాంతో హత్య జరిగినట్టుగా పోలీసులు నిర్ధరించారు. అంతే తప్ప ఆ కేసు ఇక ముందుకు సాగలేదు. విచారణ అక్కడితో ఆగిపోయింది. మృతుడి భార్య శ్రావణ సంధ్య, దళిత నాయకులు పలువురు పలుమార్లు పోలీసుల చుట్టూ తిరిగినా ఫలితం రాలేదు.
సీన్ కట్ చేస్తే- రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. ఎన్డీయే కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాయి. చంద్రబాబునాయుడుతో ప్రారంభించి.. అన్ని పార్టీలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలను ఆలకిస్తున్నారు. వాటి పరిష్కారానికి అప్పటికప్పుడే వీలైన మార్గాలు వెతుకుతున్నారు. ఆ క్రమంలో భాగంగా జనసేన పార్టీకి చెందిన మంత్రి వాసంశెట్టి సుభాష్ కూడా తరచుగా ప్రజలతో భేటీ అవుతూ వారినుంచి వినతులు స్వీకరిస్తూ, సమస్యలను తెలుసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో రెండేళ్ల కిందట హత్యకు గురైన మృతుడు, వాలంటీరు దుర్గాప్రసాద్ భార్య శ్రావణ సంధ్య పిల్లలతో సహా మంత్రిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. మంత్రి స్వయంగా ఆమెను వెంటబెట్టుకుని రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమల రావును కలిశారు. ఈకేసును తిరిగి విచారించి ఆ మహిళకు న్యాయం చేయాలని కోరారు. డీజీపీ పూనికతో కేసును పోలీసులు మళ్లీ దర్యాప్తు చేయడం ప్రారంభించారు.
మళ్లీ సీన్ కట్ చేస్తే- మరణించిన దుర్గాప్రసాద్ కు స్నేహితుడు, వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ అయిన వడ్డి ధర్మేశ్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. హత్యకు దారితీసిన కారణాలు ఏమిటనేది ఇదమిత్థంగా తేలలేదు గానీ.. జగన్ జమానాలో మంత్రిగా వెలగబెట్టిన పినిపె విశ్వరూప్ కొడుకు పినిపె శ్రీకాంత్ మనుషులను పురమాయించి స్వయంగా ఈ హత్య చేయించినట్టుగా వెలుగులోకి వచ్చింది. శ్రీకాంత్ పురమాయింపు మేరకు స్నేహితుడు దుర్గాప్రసాద్ ను వడ్డి ధర్మేశ్ టూవీలర్ మీద రేవు వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడకు కారులో వచ్చిన మరో నలుగురు వ్యక్తులు కలిసి పడవలో లోపలకు వెళ్లారు. అక్కడ దుర్గాప్రసాద్ మెడకు తాడు బిగించి చంపేసి నదిలో పారేశారు. మనిషి కనిపించకపోవడంతో తొలుత మిస్సింగ్ కేసు నమోదైనా, నాలుగు రోజులకు శవం కోటిపల్లి రేవుకు రావడంతో హత్యకేసుగా మారింది. తీరా ఇప్పటికి సంగతి బయట పడింది. దళితుడే అయిన మంత్రి కుమారుడే ఏ1 నిందితుడని తేలింది.
అక్కడ సీన్ కట్ చేస్తే.. ఈ హత్య కేసు దర్యాప్తు మళ్లీ ప్రారంభం అయిందని తెలిసిన వెంటనే.. పినిపె శ్రీకాంత్ జాగ్రత్త పడ్డాడు. అతను ముందుగానే మధురై పారిపోయాడు. అయితే జాగ్రత్తగా అతనికోసం జల్లెడ పట్టిన పోలీసులు తమిళనాడులోని మధురైలో అతనిని అరెస్టు చేసి.. ట్రాన్సిట్ వారంటు మీద తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి దళిత వాలంటీరును హత్య చేయించడంలో దళిత యువ నాయకుడు, దళిత మంత్రి కొడుకే ప్రధాన నిందితుడని తేలుతోంది.
దళిత వాలంటీరు హత్యకేసులో వైసీపీ మంత్రి కొడుకు
Thursday, November 21, 2024