వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన ఒకవైపు నుంచి షర్మిల, మరొకవైపు నుంచి వివేకా కూతురు సునీత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊపిరి సలపనివ్వకుండా విమర్శలతో విరుచుకుపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. సునీత అడిగే ఏ ప్రశ్నకు కూడా జవాబు చెప్పలేకపోయినప్పటికీ- ‘హత్యతో నాకు సంబంధం లేదు’ అనే ఒకే ఒక మాటతో నెట్టుకు రావడానికి కడప వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి ప్రయత్నిస్తూన్నారు. ‘అవినాష్ రెడ్డి హంతకుడని, హత్యకు ప్రధాన సూత్రధారి అని ఆరోపిస్తూ.. హంతకుడిని కాపాడుతున్న దుర్మార్గుడు జగన్ అని చెల్లెళ్లు ఇద్దరు విరుచుకుపడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో సునీతను బద్నాం చేయడానికి వైసిపి దీర్ఘకాలిక ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా ఉంది. ఆమెను మహానటిగా అభివర్ణిస్తూ సాక్షి టీవీలో ప్రత్యేక ఎపిసోడ్లు ప్రసారం చేస్తున్నారు.
సునీత ఏ వ్యవహారాలను దాచి పెట్టుకోవడం లేదు. తమ కుటుంబంలో విభేదాలు ఉన్నాయనే సంగతి ఆమె తనని తాను గానే చెబుతున్నారు. విభేదాలు ఉన్నంత మాత్రాన వివేకానంద రెడ్డి తనకు తండ్రి కాకుండా పోతారా అని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వారి కుటుంబ విభేదాలను కొండంతలుగా పెంచి చూపించి సునీతను విలన్ గా ప్రజల ఎదుట నిలబెట్టడానికి సాక్షి ప్రయత్నిస్తోంది. ఒకసారి సునీత విలన్ అని ప్రజలు నమ్మేలా చేస్తే ఆమె చెప్పే మాటలకు చేసే ఆరోపణలకు ప్రజల్లో విశ్వసనీయత లేకుండా పోతుందని వారు ఆశిస్తున్నట్లుగా కనపడుతోంది.
ఒక చిన్న లాజిక్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు గానీ సాక్షి దళాలు గాని మిస్ అవుతున్నాయి. అదేంటంటే సాక్షి ఛానల్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారానికి మాత్రమే ఉద్దేశించిన చానెల్ గా స్పష్టమైన ముద్రపడింది. ఆ చానల్ ను కేవలం వైసీపీ కార్యకర్తలు, జగన్ యొక్క పిచ్చి అభిమానులు మాత్రమే చూస్తుంటారు. ఒకవేళ సునీత నిజంగానే విలన్ అయినప్పటికీ కూడా సాక్షి ప్రేక్షకులకు కొత్తగా ఆ విషయం చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వాళ్లందరూ సునీత వ్యతిరేక భావనతోనే వెర్రెత్తిపోయి ఉంటారు. సాక్షిలో ఒక ప్రత్యేక బులెటిన్ వస్తే దాని వలన సునీతకు జరిగా నష్టం గానీ ఆమె విశ్వసనీయత దెబ్బతినడం గాని ఏమాత్రం ఉండదని వైసిపి గ్రహించాలి. అలా కాకుండా ఇతర చానళ్లలో ఎవరి ద్వారా అయినా ఒక బులెటిన్ చేయిస్తే పార్టీకి కొంత అడ్వాంటేజ్ ఉండేదేమో కానీ వారికి అలాంటి లాజికల్ ఆలోచన వచ్చినట్లుగా లేదు!