ఏ నాయకుడు అయినా సరే.. కీలక సభల్లో పాల్గొన్నప్పుడు.. కీలక ప్రసంగాలు చేస్తున్నప్పుడు మహానుభావుల కొటేషన్లను ప్రస్తావిస్తుంటారు. ఆ జీవిత సత్యాల్లోంచి వర్తమాన పరిస్థితులకు అన్వయిస్తుంటారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అంతే. ఆయన గతంలో కూడ ఎన్నెన్నో అద్భుతమైన కోట్స్ ను ఉదాహరించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా.. సందర్భాన్ని బట్టి వాడుతున్నారు. తాజాగా మదనపల్లెలో జరిగిన సభలో.. విద్యాదీవెన పథకం కింది నిధుల విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ మాటలను ప్రస్తావించారు.
‘‘అక్షరాలు రాయడం,చదవడమే విద్యకు పరమార్థం కాదు. తనకు తానుగా ప్రతి చిన్నారి ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలిగే శక్తిని ఇవ్వగలగడమే విద్యకు పరమార్థం’’ అన్న ఐన్ స్టీన్ మాటలు జగన్ నోటినుంచి వచ్చాయి. సాధారణంగా మన సమాజంలో బాబాలు, స్వాములు, ప్రవచనకర్తలు.. పురాణాలు, గ్రంథాల్లో ఉండే విషయాలను ప్రస్తావించి తాము పాపులారిటీ పొందుతుంటారు.అదే తరహాలో రాజకీయ నాయకులు కూడా ప్రముఖుల కోట్స్ చెప్పి పాపులారిటీ పొందుతారు. జగన్ కూడా అందుకు భిన్నం కాదు. అయితే.. నాయకులు ప్రస్తావించే విషయాలు వారి సొంత ఆలోచన సరళికి దగ్గరగా ఉన్నప్పుడే ఆ కోట్స్ నప్పుతాయి.
‘ప్రతి చిన్నారి తనకు తానుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇవ్వడమే విద్యకు పరమార్థం’ అనే సందేశం ఎంత గొప్పది. జగన్ బాబా ఎంత గొప్పగా చెప్పారో కదా అని మనకు అనిపిస్తుంది. ఆయన ఆదర్శం అద్భుతః అని కూడా అనిపిస్తుంది. కానీ ఇంకో అడుగు ముందుకు వేసి ఆలోచిస్తే.. కొన్ని అనుమానాలు కలుగుతాయి. ఇది స్కూలు పిల్లల కార్యక్రమం గనుక, అందంగా ఉంటుందని, ఏదో మాటవరసకి జగన్ ఐన్ స్టీన్ మాటను అక్కడ వదిలారా? లేదా ఆ విషయాన్ని ఆయన ఆచరణాత్మకంగా నమ్ముతున్నారా? అనే సందేహం అది! ఎందుకంటే.. ‘వ్యక్తులు స్వయంచాలితంగా, స్వయం ప్రేరితంగా, స్వయం’ ఉండడం అనే సిద్ధాంతానికి జగన్ చాలా దూరం.‘ఆకలితో ఉన్న వారికి చేపను ఇవ్వడం కాదు.. చేపను పట్టడం ఎలాగో నేర్పు’ అనేది చాలా గొప్ప కొటేషన్లలో ఒకటి. అది జగన్ కు నచ్చదు. తాను ఏకంగా చేపలకూర వండి పెట్టాలని అనుకుంటారు. ఆయన దృష్టిలో అభివృద్ధి, సంక్షేమం అంటే.. ప్రజల జేబుల్లో డబ్బులు పెట్టడం. బటన్ నొక్కి వారి ఖాతాల్లోకి విడుదల చేయడం. లక్షల కోట్లు అప్పులు తెచ్చి.. వేల కోట్ల వంతున పంచిపెట్టేయడం మాత్రమే. ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం, ఉద్యోగాలు దక్కే వాతావరణం కల్పించడం, తద్వారా అందరూ తమ జీవితాలకు సరిపడా తామే సంపాదించుకునేలా చేయడం సంక్షేమం అని ఆయన నమ్మరు. అందరికీ తానే డబ్బులు పంచిపెట్టేస్తానను.. వాటితో తిని తాగి వేరే పనేమీ చేయకుండా చల్లగా బతికేయాలని, తనకు రుణపడి ఉండాలని ఆయన కోరుకుంటారు.
కానీ.. విద్యార్థుల వద్దకు వచ్చేసరికి. ‘చిన్నారులు సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేలా ఉంటేనే అది విద్య’ అని.. కేవలం అక్షరాలు నేర్చుకోవడం కాదు అని సుద్దులు చెబుతున్నారు. ఆ నీతి చిన్నారులకు మాత్రమేనా? పెద్దలకు వర్తించదా? పెద్దలు స్వయంగా తమ బతుకులు తాము బతికేలా తయారు కాకూడదా? ప్రభుత్వం విదిలించే సొమ్ములతో తింటూ గడిపేస్తూ నిర్వీర్యం అయిపోవాలా? అనేది ఆలోచనపరులైన ప్రజల్లో మెదలుతున్న ప్రశ్నలు.
ప్రముఖుల ప్రసంగ రచయితలు, స్క్రిప్టు రచయితలు సందర్భానికి తగినవి అని భావించిన కోట్స్ వాడేస్తుంటారు. కానీ ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి అవి తన తత్వానికి, వ్యక్తిత్వానికి తగినవా కాదా అని క్రాస్ చెక్ చేసుకోకుండా చదువుకుంటూ వెళ్లిపోతే.. ఇలాగేఉంటుంది!