ఎన్నికల వేడి ప్రారంభం కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు బలమైన అభ్యర్థుల అన్వేషణలో భాగంగా ప్రత్యర్థి పార్టీలలోని వారిని చేర్చుకోవడం కోసం `ఆపరేషన్ ఆకర్ష్’ ప్రారంభించారు. మొదట్లో నలుగురు టీడీపీ ఎమ్యెల్యేలను అనధికారికంగా చేర్చుకొని, ఆ తర్వాత టీడీపీ నేతల కోసం పెద్దగా పట్టించుకోని ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు మాత్రం టిడిపి వారి కోసం జిల్లాలవారీ వేట ప్రారంభించారు.
ఇటీవల అన్నమయ్య జిల్లా మదనపల్లెకు వెళ్లిన సీఎం జగన్ స్థానికంగా టీడీపీకి కీలకంగా ఉన్న నేతలు పార్టీలో చేర్చుకోవడం ద్వారా `ఆపరేషన్ ఆకర్ష్’కు తెరదింపారు . టీడీపీ మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డికి వైసీపీ కండువా కప్పేయడం ద్వారా టిడిపి అధినేత చంద్రబాబు సొంత ప్రాంతం నుంచే టీడీపీకి ఝలక్ ఇచ్చేలా వైసీపీ స్కెచ్ ప్రయత్నం చేశారు
ఆ తర్వాత టీడీపీ బలంగా ఉన్న ఉత్తరాంధ్రలోనూ ఆ పార్టీని ఊహించని దెబ్బకొట్టాలని విశాఖలో కీలక నేత అయిన మాజీ మంత్రి, వైజాగ్ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును చేర్చుకొని ప్రయత్నం చేశారు. వైసీపీ నేతలు కలసి, ఆయనతో పార్టీ చేరికపైనా చర్చించారు కూడా. గంటాతో పాటు ఇంకా టీడీపీలోనే ఉన్న ముఖ్యనేతలను కూడా వైసీపీలోకి ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు.
అయితే కొంతకాలంగా వైసీపీలో చేరే విషయమై అస్పష్ట సంకేతాలు ఇస్తూ వచ్చిన గంటా ‘నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు చంద్రబాబు గారితోనే నా ప్రయాణం.. తెలుగుదేశం పార్టీలోనే ఉంటా.. తెలుగుదేశం పార్టీ విజయం కోసం పని చేస్తా.. సోషల్ మీడియాలో ఏవేవో రాస్తుంటారు’ అంటూ ఇప్పుడు అకస్మాత్తుగా వైసిపి నేతలకు షాక్ ఇచ్చారు.
రాష్ట్రం మొత్తం మీద ఇప్పుడు టీడీపీ బలంగా ఉంది, వైసీపీ కన్నా ఎక్కువ సీట్లు తెచ్చుకో గలిగిన ప్రాంతం ఉత్తరాంధ్ర అని అన్ని సర్వేలు స్పష్టం చేస్తుండటం గమనార్హం. అటువంటి చోట ఈ ప్రయత్నం విఫలం కావడంతో జగన్ శిబిరం ఒకింత షాక్ కు గురయినదని చెప్పవచ్చు.
ఇక జిల్లాల వారీగా టిడిపిలో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న బలమైన నాయకుల కోసం అన్వేషణ ప్రారంభించారు. అయితే, ఇప్పటికే వైసీపీలో ప్రతి నియోజకవర్గంలో సీట్లు ఆశిస్తున్న వారి ఎక్కువగా ఉండటంతో, కొత్తవారిని చేర్చుకొనే పార్టీ శ్రేణులలో అసమ్మతి పెరిగే అవకాశం ఉంటుందని సీనియర్ వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే టీడీపీ నుండి దరి చేర్చుకున్న కారణం బలరాం, వంశీ వంటి ఎమ్యెల్యేల నియోజకవర్గంలో స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు ఏమాత్రం సహకారం అందించడం లేదు. 2019లో టీడీపీ ఘోరంగా ఓటమి చెందడానికి ప్రధాన కారణం వైసిపి నుండి చేర్చుకున్న నేతలతో పార్టీ శ్రేణులు కలసి పనిచేయక పోవడమే అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. వైసీపీ నుండి 23 మంది ఎమ్యెల్యేలను చేర్చుకొని, వారిలో నలుగురికి మంత్రి పదవులు చంద్రబాబు ఇచ్చారు. అయితే వారంతా వారంతా ఓటమి చెందడమే కాకుండా, మొత్తం టిడిపికి వచ్చిన సీట్లు అవే కావడం గమనార్హం. అందుకనే టిడిపి నుండి `ఫిరాయింపుల’ పట్ల ఇప్పటి వరకు అంతగా జగన్ ఆసక్తి చూపడం లేదు.
ఇప్పుడు మొత్తం 175 నియోజకవర్గాలను గెలుచుకుంటామని చెబుతూ వస్తున్న జగన్ ప్రధాన ఉద్దేశ్యం ఎక్కడా టిడిపికి బలమైన అభ్యర్థులు లేకుండా చేయడమే. అందుకనే `ఆపరేషన్ ఆకర్ష్’ ను పెద్ద ఎత్తున అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న 151 మంది ఎమ్యెల్యేలలో 50 మందికి పైగా తిరిగి సీట్ ఇవ్వబోవడం లేదని ఇప్పటికే సగం స్పష్టం చేశారు. వారికి వ్యక్తిగతంగా ముందే తెలుపుతామని కూడా చెప్పారు. చాలామందికి ఇప్పటికే సంకేతాలు కూడా ఇచ్చారు. వారిలో అత్యధికులు అసమ్మతితో పార్టీకి ఆయా నియోజకవర్గాల్లో ఎంతో కొంత మేరకు నష్టం కలిగించే అవకాశం లేకపోలేదు.
ఇప్పుడు కొత్తగా టిడిపి వారిని కూడా తెచ్చుకొంటే `ఆత్మహత్య సాదృశ్యం’ అవుతుందనే భయం సహితం పలువురు వైసిపి నేతలలో కనిపిస్తున్నది. ఏదేమైనా `ఆపరేషన్ ఆకర్ష్’ వికటించి ప్రమాదం ఉందని పలువురు ఆ పార్టీ నేతలే హెచ్చరిస్తున్నారు.