పార్టీలోంచి బయటకు వెళ్లిపోయిన వారు.. ఇక్కడి లోపాల గురించి, జగనన్న చేతగానితనం గురించి, అహంకారం గురించి మాట్లాడడం పెద్ద విశేషం ఎంత మాత్రమూ కాదు. కానీ పార్టీలోనే ఉంటూ.. వైఫల్యాల గురించి మాట్లాడే వాళ్ల మాటలను సీరియస్ గానే పట్టించుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు ఆయన అసలే మోనార్క్ గనుక.. ఏం చెప్తే దానికి తలాడిస్తూ గంగిరెద్దుల్లా బతికేశారు. జగనన్న కూడా.. పార్టీలో ఎవ్వరు గెలిచినా నా బొమ్మ చూపించి గెలవాల్సినోళ్లే తప్ప, సొంత బలంతో గెలిచే మొనగాళ్లు లేరని విర్రవీగి చెప్పుకున్నారు. మొత్తానికి 11 సీట్లు దక్కాయి. ఇప్పుడు ఓడిపోయిన తమ్ముళ్లు ఒక్కరొక్కరుగా జగన్ ను ఉతికి ఆరేస్తున్నారు.
తాజాగా మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. వైకాపా ఐదేళ్ల పాలనలో తప్పులు జరిగాయి. వాటిని సరిదిద్దుకోకపోవడం వల్ల ఎన్నికల్లో ఓటర్లు మమ్మ్నల్ని తిరస్కరించారు. పరిపాలన పరంగా చేసిన తప్పిదాలే ఓటమికి దారి తీశాయి. చోడవరంలో రోడ్ల మీద గోతులే నన్ను ఓడించాయి. ఎన్నికలకు ముందు జగన్ కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. అందుకే ఓడిపోయా..’’ అంటూ అసలు సీక్రెట్ బయటపెడుతున్నారు. ధర్మశ్రీ ఇవాళ బయటపడి విషయం చెప్పారు. కానీ ప్రెవేటు సంభాషణల్లో ఓడిపోయిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా ఇంతకంటె దారుణంగా జగన్ వైఖరి వల్లనే తాము ఓడిపోయాం అనే మాట అంటున్నారు.
కొన్ని వారాల కిందట కాసు మహేష్ రెడ్డి కూడా వీడియో సందేశం విడుదల చేసి మరీ.. జగన్ వైఫల్యాల వల్ల పార్టీ ఓడిపోయామనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఇలా జగన్ ను నమ్ముకుంటే తమకు కూడా రాజకీయ భవిష్యత్తు ఉండదని నమ్ముతున్న వాళ్లు.. బహిరంగంగా చెప్పడం ద్వారానైనా జగన్ ఆలోచనల్లో మార్పు తీసుకురాగలిగితే చాలు.. లేకపోతే పార్టీ బతకదని నమ్ముతున్న వాళ్లు అందరూ తమ అభిప్రాయాల్ని తెగేసి చెబుతున్నారు.
జగన్ మామూలుగా అయితే ఇలాంటి వ్యాఖ్యలను సహించే నాయకుడు కానే కాదు. కానీ ఇప్పుడు ఆయనకు కూడా గతిలేదు. వీళ్లమీద కన్నెర్ర చేస్తే.. పార్టీలో ఉన్నవాళ్లు కూడా బయటకు వెళ్లిపోతారని భయం. అందుకే వైసీపీ చాలా తెలివితేటలు ప్రదర్శిస్తోంది. ఇలా తిరుగుబాటు స్వరం వినిపించిన వారితో.. మళ్లీ ఒక ప్రెస్ మీట్ పెట్టించి.. చంద్రబాబును కూడా తిట్టిస్తున్నారు. కాసు మహేష్ రెడ్డితో కూడా అలాగే చేయించారు. అలాంటి అతి తెలివి ఎత్తుగడల వలన.. జగన్ ను తిడుతున్న తమ్ముళ్లు నెమ్మదిగా మరో పార్టీలోకి జారుకోకుండా జాగ్రత్త పడుతున్నారన్నమాట. మరి కరణం ధర్మశ్రీతో కూడా రెండు మూడు రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టించి, తమ స్క్రిప్టు ప్రకారం చంద్రబాబును తిట్టిస్తారేమో చూడాలి.
జగనన్నను ఉతికి ఆరేస్తున్న తమ్ముళ్లు!
Tuesday, January 21, 2025