‘పాట’ పెంచితే తప్ప బయటపడలేం!

Wednesday, December 25, 2024

అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులలో ఇప్పుడు కొత్త భయం మొదలవుతోంది. ఒకవైపు ప్రచారంలో చురుగ్గా ముందుకు సాగుతూనే మరోవైపు ఎవరికి వారు వ్యక్తిగతంగా నియోజకవర్గంలో తమ విజయావకాశాలు ఎలా ఉంటాయో సర్వేలు చేయించుకుంటున్నారు. మరోవైపు పార్టీ కూడా అలాంటి సర్వేలను చేయిస్తున్నది. పార్టీ సర్వేలలో బలహీనంగా ఉన్నట్లుగా తేలిన అభ్యర్థులను- వైసిపి అధినాయకత్వం వైపు నుంచి కీలక నాయకుల వెంట పడుతున్నారు. ‘‘మీరు ఏం చేస్తారో తెలియదు.

ఎన్నికల్లో గెలిచి తీరాల్సిందే’’ అని పరోక్ష హెచ్చరికలు చేస్తున్నారు! ఇదంతా ధన వనరులకు సంబంధించిన మాటలే అనే సంగతి అందరికీ అర్థమవుతూనే ఉంది. నామినేషన్ల పర్వం ఇప్పుడే మొదలవుతుండడంతో విజయావకాశాలు తక్కువగా ఉన్న కొందరు అభ్యర్థులను నామినేషన్ ల ఉపసంహరణలోగా మార్చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులలో ఇప్పుడు సరికొత్త టెన్షన్ మొదలవుతోంది. గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నవారు ఆ సంగతి తమ సొంత సర్వేలలో తేలగానే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడానికి జంకుతున్నారు. అదే సమయంలో ‘ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి తీరాల్సిందే’ అని హైకమాండ్ వైపు నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఓట్లను కొనుగోలు చేయడానికి రేటు పెంచుకుంటూ పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నదని అభ్యర్థులు భయపడుతున్నారు.

సాధారణంగా ఓట్ల కొనుగోలు అంటే నియోజకవర్గంలో ఉండే సమ్త ఓట్లను కొంటారనేది కాదు. కొన్ని ప్రాంతాలలో కోట్ల కొనుగోలుకు లొంగే వర్గాలకు చెందిన వారికి మాత్రమే డబ్బులు ఇస్తూ కొనడం ప్రతిసారీ జరుగుతుంది. కానీ ఈ దఫా అలాంటి లెక్కలు వేస్తే కుదరదని ఓటర్లు ప్రత్యేకంగా వ్యతిరేకిస్తే తప్ప మొత్తం అందరికీ డబ్బులు ఇచ్చి తీరాల్సిందేనని పార్టీ నుంచి అభ్యర్థులకు ఒత్తిడి ఉంది. పైగా పెద్ద మొత్తాలు ఇవ్వడానికి వెనకాడితే రాజకీయాలలో వారికి భవిష్యత్తు లేకుండా చేస్తామని బెదిరింపు కూడా ఉంది. ఆ మేరకు వారి వారి ధన వనరులను అధినేత నియమించే వేగులకు ఎప్పటికప్పుడు చూపించాల్సిన బాధ్యత కూడా వారి మీద ఉంటుంది. గత ఎన్నికల్లో ఒక్కొక్క ఓటుకు ఎన్నికలలో గరిష్టంగా 2000 రూపాయల వరకు చెల్లిస్తూ కొనుగోలు చేశారు. ఈసారి ఆ మొత్తాన్ని పెంచవలసి వస్తుందని కొన్నిచోట్ల ఓటుకు 5000 వరకు ఇవ్వాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదని పలువురు అంచనా వేస్తున్నారు. పార్టీ పురమాయింపు కూడా అలాగే ఉంటోంది. అయితే ఒక్కొక్క ఓటుకు అంత భారీ మొత్తాలు చెల్లించే తాహతు తమకు లేదని ఫలితం తేడా కొడితే సర్వనాశనం అయిపోతామని అభ్యర్థులు భయపడుతున్నారు. మరి సర్వేలలో ఆశాజనకమైన ఫలితాలు పొందలేనటువంటి అభ్యర్థులు ఈ గండాన్ని ఎలా గట్టెక్కుతారో చూడాలి!

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles