వైసీపీ వారి గుండెల్లో ‘రెడ్ బుక్’ రైళ్లు!

Wednesday, January 22, 2025

అసలు అలాంటి పుస్తకం ఉన్నదో లేదో తెలియదు. ఒకవేళ రెడ్ బుక్ అనే పుస్తకం ఒకటి ఉన్నప్పటికీ కూడా.. అందులో నిజంగా తమకు కిట్టని వాళ్ల పేర్లను రాశారో లేదో తెలియదు. కానీ.. రెడ్ బుక్ అనే పదం వినిపిస్తే చాలు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు, జగన్మోహన్ రెడ్డి పట్ల వీర భక్తి కలిగి ఉన్న అధికారులకు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

ఏ క్షణాన ఎవరి పాపం పండుతుందో అని వారు ఆందోళన చెందుతున్నారు. సాధారణ నాయకులు, అధికార్లు భయపడ్డం సరే.. చివరికి జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీలో దీక్ష చేసి ఇదే రెడ్ బుక్ భయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సరిగ్గా జగన్ లోని ఈ భయాన్నే లోకేష్ కూడా ఎద్దేవా చేస్తున్నారు. అసలు రెడ్ బుక్ అనేది తెరవక ముందుగానే మీరు ఢిల్లీ వెళ్లి ఇంతగా గగ్గోలు పెడుతున్నారే.. అంటూ లోకేష్ హేళన చేయడం విశేషం. పైగా.. ‘తప్పుచేసిన వారందరి పేర్లను రెడ్ బుక్ లో  చేర్చి చట్టప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నాం’ అని నారా లోకేష్ ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు. ఈ మాట వైసీపీ హయాంలో హద్దూ అదుపు లేకుండా చెలరేగిన వారికి ఇంకా ప్రమాదకరసంకేతంలాగా ఉంది.

రెడ్ బుక్ అనేది ఉన్నదో లేదో కూడా ఎవ్వరికీ తెలియదు. కానీ ఆ పేరుతో తప్పు చేస్తున్న వారి గుండెళ్లో రైళ్లు పరిగెత్తేలా చేయడం మాత్రం నారా లోకేష్ కు చెల్లింది. ఆయన ఈ మాటను పాదయాత్ర సమయం నుంచి వాడుతున్నారు. నిజం చెప్పాలంటే.. అప్పట్లో లోకేష్ రెడ్ బుక్ అనే పదం చెబితే చాలు.. వైసీపీ నాయకులు మంత్రులు ఎద్దేవా చేసేవారు. లోకేష్ ను విమర్శించే వాళ్లు.

హేళన చేసేవాళ్లు. అదే రెడ్ బుక్ అనే పదం ఇప్పుడు వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తోంది. జగన్ కూడా రెడ్ బుక్ అనే పదానికి జడుసుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అడుసు తొక్కనేల.. కాలు కడగనేల అన్న సామెత చందంగా.. నిన్నటిదాకా జగన్ తో అడ్డగోలుగా అంటకాగనేల.. ఇవాళ భయపడనేల.. అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles