జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించిన రోజులలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆళ్ల నాని ఇప్పుడు తెలుగుదేశం లో చేరబోతున్నారు. ఎన్నికల్లో ఒక పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీకి చెందిన నాయకులు కొందరు రాజీనామాలు చేసి, అధికారంలోకి వచ్చిన పార్టీ వైపు వెళ్లడం వింతేమీ కాదు. కానీ ఎన్నికల్లో ఘోరపరాజయం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్న సందర్భంలో.. ఇకపై రాజకీయాలనుంచి పూర్తిగా పక్కకు తప్పుకుంటున్నట్లు ప్రకటించిన ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ అనే ఆళ్ళ నాని.. ఇంత విరామం తర్వాత తెలుగుదేశంలో పార్టీలో చేరుతుండడం చాలామందిని విస్మయానికి గురిచేస్తున్నది. ఆయన ఇప్పుడు చంద్రబాబు అనుచరగణంలోకి చేరబోతున్నారు అనగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ ను పార్టీ నాయకుల గుండెలు దడదడలాడుతున్నాయి.
జగన్మోహన్ రెడ్డికి అసలే కష్టకాలం నడుస్తోంది. ఐదేళ్ల పరిపాలన కాలంలో అడ్డగోలుగా సాగించిన అరాచకాలన్నీ ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆదానీ దగ్గర నుంచి తీసుకున్న 1750 కోట్ల రూపాయల ముడుపుల వ్యవహారం ఎంతగా రచ్చ రచ్చ అవుతున్నదో అందరికీ తెలుసు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇటీవల జనసేన పార్టీలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి బండారాన్ని బయటపెట్టేలా అనేక వాస్తవాలను వెల్లడించడం వైసిపి నాయకుల్లో పలువురికి గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టుగా తయారయింది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతల్లో ఉన్నటువంటి ఆళ్ళ నాని కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరితే బాలినేని తరహాలోనే తమకు మరొక కొత్త గండం ముంచుకు వస్తుందని వైసీపీ నాయకులు భయపడుతున్నారు.
ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ గతంలో వైద్య ఆరోగ్య శాఖకు మంత్రిగా పనిచేశారు. డిప్యూటీ ముఖ్యమంత్రి బాధ్యతలలో నలుగురిలో ఒకరిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో డిప్యూటీ ముఖ్యమంత్రి అనే పదవి కేవలం అలంకారప్రాయంగా మాత్రమే ఉన్నదనే సంగతి కూడా అందరికీ తెలుసు. జగన్ తాను చక్రవర్తి అయినట్లుగా మంత్రులందరినీ బైపాస్ చేస్తూ వారి వారి శాఖలలో కీలకమైన అవినీతి దందాలను తన సొంత అనుచరుల ద్వారా, తన నమ్మకస్తుల ద్వారా నడిపిస్తూ వచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. సెకితో విద్యుత్తు ఒప్పందాలకు సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన ఆరోపణ కూడా అదే. విద్యుత్ శాఖ మంత్రి అయినప్పటికీ తనకు సంబంధం లేకుండా, తన అంగీకారం లేకుండా, తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ఒప్పందాలు చేసుకున్నారని ఆ ఫైల్ మీద తాను సంతకాలు కూడా పెట్టలేదని భాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
ఆళ్ల నాని సారథ్యం వహించిన వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖలో జరిగిన రకరకాల బాగోతాలు కూడా తెలుగుదేశంలో చేరిన తరువాత ఆయన బయట పెడితే జగన్మోహన్ రెడ్డి మరింతగా చిక్కుల్లో ఇరుక్కుంటారని పార్టీ నాయకులు భయపడుతున్నారు. ఇప్పటికే 104, 108 సేవల నిర్వహణ టెండర్లు దక్కించుకున్న అరబిందో సంస్థ అత్యంత అధ్వానంగా పనిచేస్తున్నట్టు కాగ్ కూడా అక్షింతలు వేయడం, వారు ప్రస్తుతం టెండరు కాలం ఇంకా ఉన్నప్పటికీ.. సేవలనుంచి పక్కకు తప్పుకుంటూ ఉండడం కూడా.. జగన్ కాలంలో జరిగిన అవినీతి దందాలకు ఆనవాళ్లేననే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. అప్పట్లో అదే శాఖకు మంత్రిగా పనిచేసిన ఆళ్ల నాని తెలుగుదేశంలో చేరాక అప్పటికి తెరవెనుక బాగోతాలన్నీ బయటపెడతారేమో అని వైసీపీ వారు వణికిపోతున్నారు. ఆయన అసలే కుంగిపోతున్న పార్టీకి ఎలాంటి ఝలక్ ఇస్తారో వేచిచూడాలి!
ఆళ్ల నాని అటు వెళ్తోంటే వైసీపీలో గుండె దడ!
Friday, January 17, 2025