రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే వైసీపీ ఓర్వలేకపోతున్నట్టుగా ఉంది. ఏదో ఒక రీతిగా శాంతి భద్రతలకు చిచ్చు పెట్టే ఆలోచనలు చేస్తున్నట్టుగా ప్రజలకు అనుమానం కలుగుతోంది. చంద్రబాబునాయుడు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు పచ్చజెండా ఊపిన తర్వాత.. ఆయనకు అందుకు అనుకూలమైన వర్గాల నుంచి ధన్యవాదాలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి కూడా తన వైఖరి స్పషంగా తెలియజేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఎస్సీ వర్గీకరణపై వైఖరి చెప్పడం కాదు కదా.. అసలు.. ఆ కారణం మీద సమాజంలో చిచ్చు పుట్టించడానికి జగన్ ఆధ్వర్యంలోని వైసీపీ కుట్రలు చేస్తున్నదేమో అని ప్రజలు భయపడుతున్నారు. ఎందుకంటే.. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో అంబేద్కర్ విగ్రహానికి, ఎన్టీఆర్ విగ్రహానికి చెప్పుల దండలు వేసినది.. మాల సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నేత అని గుర్తించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
ఎస్సీ వర్గీకరణకు వైఎస్సార్ కాంగ్రెస్ వ్యతిరేకం అనే సంగతి అందరికీ తెలుసు. ఎస్సీల్లోని రెండు వర్గాల మధ్య విబేదాలు ఉండడమే తమకు ఎడ్వాంటేజీ అనుకున్నట్టుగా విభజించి పాలించే కుటిల రాజకీయం నడిపిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్. ఎస్సీల వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత.. రాష్ట్రప్రభుత్వాలు తమ తమ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తెలంగాణలో ఆల్రెడీ ఈ పర్వం పూర్తయింది. ఏపీలో వర్గీకరణను పూర్తిచేయనున్నట్టు చంద్రబాబునాయుడు ప్రకటించారు. జగన్ తన వైఖరి చెప్పాలంటూ.. మందక్రిష్ణ మాదిగ స్పష్టం చేసినా కూడా.. అటువైపు నుంచి స్పందనలేదు.
పైగా ఈ నేపథ్యంలో అంబేద్కర్ మెడలో చెప్పుల మాట వేయడం అంటే.. ఖచ్చితంగా ఎస్సీ వర్గాలను రెచ్చగొట్టడమే అవుతుంది. పైగా ఈ పాపానికి పాల్పడింది కూడా ఎస్సీ మాల వర్గానికి చెందిన వైసీపీ నేత కావడం గమనార్హం. వర్గీకరణ కు ప్రభుత్వం అడుగులు వేస్తున్న సమయంలో.. సమాజం ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేక ఏదో ఒక రూపంలో చిచ్చు పెట్టి.. తగాదాలు రేకెత్తించడానికే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. అయితే పోలీసులు హైటెక్ పద్ధతుల్లో ఫోను సిగ్నల్స్ ఆధారంగా.. నిందితుడిని పట్టుకున్నారు. అటు గాంధీకాలనీలో అంబేద్కర్, ముసుళ్లకుంటలోని ఎన్టీఆర్ విగ్రహాలు రెండింటికీ చెప్పులదండలు వేసింది వైసీపీ నేత బురుపుల బాబ్జీ అని తేల్చారు.
అన్ని వర్గాల ప్రజలలోను ఆదరణ పెంచుకుంటున్న కూటమి ప్రభుత్వపు పరిపాలనను చూసి ఓర్వలేక.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాంతిభద్రతలకు భంగం కలిగించే ఇలాంటి కుటిలప్రయత్నాలు చేస్తున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
సమాజంలో చిచ్చు పెట్టేందుకు వైసీపీ కుటిలత్వం!
Sunday, March 30, 2025
