జగన్మోహన్ రెడ్డి మోనార్క్ నాయకుడు అనుకునే రోజులకు కాలం చెల్లింది. ఆయన ఏం చెబితే దానిని నాయకులందరూ వింటారని, ఎదురు చెప్పడానికి భయపడతారని అనుకునే రోజులు కూడా పోయాయి. ఎప్పుడైతే ఎన్నికల సమరాన్ని ఏకపక్షంగా నడిపించిన జగన్మోహన్ రెడ్డి నాయకత్వం.. 11 సీట్లకు పార్టీని పరిమితం చేసిన అత్యంత హోరమైన ఓటమికి దారితీసిందో అప్పుడే.. పార్టీ సీనియర్ నాయకుల మీద ఆయన పట్టుకోల్పోయారు కూడా. ఇప్పుడు పార్టీలో సీనియర్లుగా చెలామణీ అవుతున్న ముఠా నాయకులు.. జగన్ ఎదుటే ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ చెలరేగిపోతున్నట్టుగా తెలుస్తోంది. పార్టీలో ప్రాధాన్యాల విషయంలో గొడవలు పడుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి.. అక్కడి సమస్త నాయకులకు ఉన్న విభేదాలు.. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డికి అక్కడి నాయకులు అందరితో ఉన్న విభేదాలు, వైవీసుబ్బారెడ్డితో ఉన్న తగాదాలు ఇవన్నీ కూడా ఇప్పుడు జగన్ ఎదుటే బహిరంగంగా తెరమీదకు వస్తున్నట్టు కనిపిస్తోంది. రీజినల్ కోఆర్డినేటర్లు అంటూ జగన్ చేపట్టిన నియామకాలు.. పార్టీ నాయకుల మధ్య విభేదాలను బజారు కీడ్చినట్టు తెలుస్తోంది.
ప్రధానంగా ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ ను మార్చడం అనేది పార్టీలో పెద్ద రచ్చగా మారినట్టు తెలుస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి అక్కడ విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు రీజినల్ కోఆర్డినేటరుగా ఉండేవారు. ఆ ప్రాంతంలోని నాయకులందరితోనూ ఆయన దాదాపుగా సున్నం పెట్టుకున్నారు. విశాఖ ఎంపీగా పోటీచేయాలనే కోరికతో ఉవ్విళ్లూరిన విజయసాయిరెడ్డి.. అప్పటికి అక్కడ సిటింగ్ ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యానారాయణ వెనుక గోతులు తవ్వారు. జగన్ రెడ్డి విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించినప్పటినుంచి.. తన అనుచరుదళాలను దించి భూకబ్జాలను ప్రోత్సహించి పార్టీ యావత్తు ఉత్తరాంధ్రల్లో భ్రష్టుపట్టిపోవడానికి కూడా విజయసాయి కారణమని అక్కడి నాయకులు జగన్ కు మొరపెట్టుకున్నారు. దీంతో విసిగిపోయిన జగన్ ఎన్నికలకు ఏడాది ముందు.. ఆయనను తప్పించి వైవీసుబ్బారెడ్డి ఇన్చార్జిగా నియమించినా ప్రయోజనం దక్కలేదు. పార్టీ దారుణంగా ఓడిపోయింది. నాలుగునెలల గ్యాప్ తీసుకున్న జగన్, తిరిగి వైవీసుబ్బారెడ్డి ని ఉత్తరాంద్ర నుంచి తప్పించి పగ్గాలు విజయసాయి చేతిలోనే పెట్టారు. దీనిపై బొత్స ఒక రేంజిలో ఫైర్ అయినట్టు తెలిసింది. బొత్స ఆగ్రహానికి జగన్ వద్ద విలువ దక్కలేదు. కానీ.. ఇదివరకటిలాగా కాకుండా.. విజయసాయి నియామకం పార్టీకి చేటు చేస్తుందంటూ బొత్స- జగన్ కే చెప్పినట్టు సమాచారం.
అలాగే చిత్తూరుజిల్లా రాజకీయాల్లో చెవిరెడ్డి భాస్కర రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య ఉన్న విభేదాలు కూడా రీజనల్ కోఆర్డినేటర్ల నియామకం సమయంలో బయటపడినట్టుగా తెలుస్తోంది. జగన్ ఎదుట తమ కోపాన్ని ప్రదర్శించడానికి నాయకులు ఎవ్వరూ ఇప్పుడు జంకడం లేదని ఈయన నిర్ణయాల్ని ధిక్కరించే వాతావరణం కూడా ఏర్పడుతున్నదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.
వైసీపీ ట్రబుల్స్ : జగన్ ఎదుటే ముఠాల కుమ్ములాటలు!
Wednesday, November 20, 2024