వైఎస్సార్క కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సరికొత్త స్ట్రాటజీని అవలంబిస్తున్నదా? తమ పార్టీ నాయకులందరి మీద లేదా, వీలైనంత ఎక్కువ మంది పోలీసు కేసులు నమోదు అయ్యేలాగా రెచ్చిపోయి ప్రవర్తించడం.. ఆ తరువాత.. తమ పార్టీ నాయకులందరి మీద కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ గగ్గోలు పెట్టడం ఒక వ్యూహంగా అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది. ఎక్కువ మంది వైసీపీ నాయకుల మీద పోలీసు కేసులు నమోదు అయితే గనుక.. అది వేధింపులకు ఉదాహరణగా చూపిస్తూ.. గవర్నరుకు, కేంద్రప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని ఒక కుత్సితమైన ఆలోచనతో అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ప్రధానంగా మూడు ఉదాహరణలను పరిశీలిస్తే..ఈవిషయం మనకు మరింత స్పష్టంగా బోధపడుతుంది
ఉదాహరణ 1 :
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పసివాడు కాదు. ఏం మాట్లాడితే దాని అర్థం ఎలా వస్తుందో.. దాని పర్యవసానాలు ఎలా ఉంటయో తెలియనంత అమాయకుడు కాదు. ఒకదఫా జగన్ కేబినెట్ లో మంత్రిగా కూడా చేసిన నాయకుడు. అలాంటి వ్యక్తి.. మూడు రోజుల కిందట ఏలూరులో వైసీపీ ఆత్మీయ సమావేశం నిర్వహించి.. కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడారు. ‘మన పార్టీ అధికారంలోకి వచ్చాక గుంటూరుకు ఇవతల ఉన్న తెలుగుదేశం వాళ్లని ఇళ్లనుంచి బయటకు ఈడ్చి కొడతాం.. గుంటూరుకు అవతల ఉన్న తెదేపా నాయకులు, కార్యకర్తల్ని నరికిపారేస్తాం’ అంటూ మాట్లాడారు. ఆ మాటలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఆయనకు తెలియదా? పర్యవసానంగా.. గుంటూరు జిల్లా నగరపాలెంలోను, ఏలూరు మూడో పట్టణ పోలీసు స్టేషన్ లోనూ ఆయన మీద కేసులు నమోదు అయ్యయాయి.
ఉదాహరణ 2 :
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, మొన్నటి జగన్ పాపిరెడ్డిపల్లె పర్యటనకు ప్రధాన కారకుడు అయిన తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆదినుంచి వివాదాస్పదమైన వ్యక్తే. ఆయన ప్రతి మాట, ప్రతి పని కూడా ఏదో ఒక వివాదానికి కేంద్రం అవుతుంటాయి. పాపిరెడ్డి పల్లెకు కేవంల రెండు కిలోమీటర్ల దూరంలోనే హెలిప్యాడ్ కు అనుమతి ఇచ్చిన పోలీసులు అక్కడకు కార్యకర్తలు ఎవరూ రావొద్దని ముందే హెచ్చరించారు. వైసీపీ నాయకులందరికీ ఈమేరకు సమాచారం కూడా ఇచ్చారు. అయితే తోపుదుర్ది అందరినీ అక్కడకే తోలించారు. హెలిప్యాడ్ వద్ద తోపులాట జరిగింది. వైసీపీ కార్యకర్తలు పోలీసుల మీదికి రాళ్లు రువ్వడంతో పలువురు గాయపడ్డారు కూడా. గాయపడిన ఒక కానిస్టేబుల్ ఇప్పుడు తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై కేసు పెట్టారు. జగన్ భద్రత గురించి పోలీసు సూచనలను పాటించకపోగా, హెలిప్యాడ్ వద్ద కార్యకర్తలను తోపుదుర్తి రెచ్చగొట్టినట్టుగా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఉదాహరణ 3 :
బూతులతో కూడిన నిందలు, అసభ్య ప్రవర్తనలకు పేరుమోసిన హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గురువారం నాడు చాలా చిత్రంగా వ్యవహరించారు. ఐటీడీపీ కార్యకర్త కిరణ్, వైఎస్ భారతి గురించి అసభ్య పోస్టులు పెట్టారు. అది ఖచ్చితంగా తప్పే. అతడిని పార్టీనుంచి సస్నెండ్ చేయడంతో పాటు కఠినచర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. మంగళగిరి పోలీసులు అతడిని ఇబ్రహీం పట్నం వద్ద అరెస్టు చేసి గుంటూరుకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో గోరంట్ల మాధవ్ రెచ్చిపోయి.. తన అనచరులతో కలిసి పోలీసు వాహనాన్ని వెంబడించారు. పోలీసుల అదుపులో ఉన్న కిరణ్ పై దాడికి ప్రయత్నించారు. అడ్డుకున్న పోలీసుల మీద కూడా రెచ్చిపోయారు. పోలీసు వాహనం ఎస్పీ కార్యాలయంలోకి వెళ్లిన తర్వాత కూడా మాధవ్ వెంబడించి.. కార్యాలయ ఆవరణలోనూ కిరణ్ పై దాడికి ప్రయత్నించారు. అయితే పోలీసులు అప్రమత్తమై అతడిని వారించి అనుచరులతో కలిపి అరెస్టు చేశారు.
ఈ మూడు ఉదాహరణల్లోనూ వైసీపీ నాయకుల చర్యలు ఏమాత్రం సమర్థించదగినవి కాదు. అవన్నీ చట్టవ్యతిరేకమైన పనులు అని రాజకీయాల్లో ఉన్న వారికి తెలియదా? అలా చేస్తే పోలీసు కేసులు నమోదు అవుతాయని వారికి తెలియదా? గోరంట్ల మాధవ్ ఒకప్పుడు పోలీసే కదా? మరి ఆయనకు కనీస నిబంధనలు తెలియవా? అయినా సరే ఇలా చేశారంటే… ఖచ్చితంగా దీని వెనుక ఒక దురాలోచన ఉన్నదనేది ప్రజల సందేహం. అందుకే తమ మీద కేసులు నమోదయ్యేలా చేసుకోవాలి.. ఆ తర్వాత వేఝధిస్తున్నారంటూ రాద్ధాంతం చేయాలి.. ఈ వ్యూహం కోసమే వారిలా చేస్తున్నట్టు ప్రజలు భావిస్తున్నారు.
