వైసీపీ నైచ్యం : పుకార్లు పుట్టించి.. వాటినే మోస్తూ..

Sunday, December 22, 2024

రాజకీయాల్లో అధికార పార్టీ వారు తప్పు చేస్తే.. లేదా వారి పరిపాలన, ఇతర వ్యవహార సరళిలో లోపాలు కనిపిస్తే విపక్షం విమర్శలతో చెలరేగిపోవడం చాలా సహజం. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే అలాంటి బలమైన విపక్షాలు అవసరం కూడా. ఈ వ్యవహారం కొంత దారి తప్పి.. అధికారంలో ఉన్న పార్టీకి లేని లోపాలను పులిమి, ఆపాదించి.. విమర్శలు చేయడం కూడా మనం తరచుగా చూస్తూ ఉంటాం. కానీ కొన్ని రకాల పుకార్లను ఫ్యాబ్రికేట్ చేసి, తామే పుట్టించి.. పెయిడ్ మీడియా సంస్థల ద్వారా.. వాటిని ప్రచారంలో పెట్టి.. ఆ తర్వాత.. అవే అబద్ధపు పుకార్లమీద ప్రభుత్వాన్ని నిందించడానికి చేసే ప్రయత్నాన్ని ఎలా అభివర్ణించాలి?

పది శాతం ఎమ్మెల్యేలు కూడా లేని బలహీనమైన ప్రతిపక్షం ఉన్నప్పుడు వారికి బహుశా ఇలాంటి నీచమైన ఆలోచనలే వస్తుంటాయేమో! ఇప్పుడు వైసీపీ వారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం గురించి చేస్తున్న ఆరోపణలు, వేస్తున్న నిందలను గమనిస్తే అలాగే అనిపిస్తోంది.

ఏపీని విభజించి ఇప్పటికి పది సంవత్సరాలు గడచిపోయాయి. ఇప్పటిదాకా విభజన చట్టంలోని సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. అయిదేళ్లు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి.. సెక్రటేరియేట్ మీద ఉన్న పదేళ్ల హక్కులను, హైదరాబాదులోని అనేక భవనాలమీద హక్కులను కేసీఆర్ కు ధారాదత్తం చేశారు తప్ప.. విభజన చట్టం సమస్యలను ఒక కొలిక్కి తీసుకురావడం గురించి పట్టించుకోలేదు.

చంద్రబాబు సీఎం కాగానే.. ఆ ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రుల స్థాయిలో ఇరు రాష్ట్రాల మధ్య భేటీ జరిగింది. అధికారులు, మంత్రులు, సీఎంలు అనే మూడంచెల్లో ఈ విభజన సమస్యలను పరిష్కరించుకోవాలని.. నిర్ణయించారు. అయితే ఈ భేటీకి ముందునుంచే, భేటీకి రేవంత్ రెడ్డి ఎజెండా ఇదీ.. అంటూ కొన్ని అవాస్తవాలు పుకార్లుగా పుట్టాయి. వైసీపీ అనుకూల మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. టీటీడీ ఆస్తులు, ఆదాయం, హోదాలు అన్నింటిలోనూ తెలంగాణ 42.58 శాతం వాటా కోరుతున్నదని, అలాగే సముద్రతీరంలోను, మచిలీపట్నం, గంగవరం, కృష్ణపట్నం పోర్ట్లుల్లోను కూడా వాట కోరుతున్నదని రకరకాల పుకార్లు వ్యాప్తిచేశారు.
కానీ భేటీలో అలాంటి చర్చ ఏం రాలేదు. కేవలం విభజన సమస్యలకు మాత్రం పరిమితం అయ్యారు. అయినా సరే వైసీపీ నాయకులు ప్రజలు నవ్వుతారనే భయం లేకుండా.. ఆ పుకార్లను పట్టుకుని.. అక్కడికేదో టీటీడీలో తెలంగాణ వాటా అడిగినట్టుగా చంద్రబాబు ఆల్రెడీ ఇచ్చేసినట్టుగా రంగు పులుముతూ.. టీటీడీకి ద్రోహం చేశారని ఆరోపణలు చేస్తున్నారు. మాజీ మంత్రులు కాకాణి గోవర్దన్ రెడ్డి, అంబటి రాంబాబు తదితరులు ఇదే పని మీద ఉన్నారు. అయినా తిరుమల వేంకటేశ్వరుడిని అడ్డుపెట్టుకుని చేసే ఇలాంటి కుటిల రాజకీయం తగదని ప్రజలు అంటున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles