రాష్ట్రమంతా తమ పార్టీ నాయకులు కడప ఎన్నికలను ఖండన ముండనలు చేసినట్లుగా కనిపించాలని యావ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా ఎక్కువగా ఉంది. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పిటిసి స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా రెండింటినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కోల్పోయింది. ఓటమి ఖరారు కావడానికి ముందు నుంచి కూడా ఎన్నికలలో అక్రమాలు జరిగాయని ప్రత్యర్థి మీద నిందలు వేయడమే జీవితంగా ఆ పార్టీ నాయకులు బతుకుతున్నారు. ఇప్పుడు తమ బురద చల్లుడు ప్రహసనాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉండే అందరికీ అప్పగించినట్లుగా కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర నుంచి కుప్పం వరకు ప్రతి చోటా వైసిపి యాక్టివ్ నాయకులు మీడియా ముందుకు వచ్చి పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు.
తమాషా ఏమిటంటే వీరెవరికీ అక్కడ ఎన్నిక గురించి కానీ, ఎలా జరిగిందని విషయం గాని, ప్రత్యక్షంగా తెలియదు. కేవలం తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్టుల ఆధారంగా మాత్రమే విమర్శలు చేస్తూ నిందలు వేస్తూ వారు చెలరేగుతుండడం విశేషం. ఇలా రాష్ట్రంలోని అందరితోనూ మాట్లాడించడం ద్వారా కడప జిల్లాలో ఎన్నికల నిర్వహణలో ఏదో అరాచకం జరిగిపోయినట్లుగా రాష్ట్రమంతటి ప్రజల సానుభూతి పొందవచ్చునని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కుటిల వ్యూహంతో ఉంటే గనుక వారి అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిందే. ఎందుకంటే ప్రజలు ఇలాంటి గోబెల్స్ ప్రచారాలు నమ్మి నిర్ణయాలు తీసుకునే స్థితిలో లేరు.
కడప జిల్లాలో ఎన్నికల పర్వం పూర్తయింది ఆ జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత పారదర్శకంగా, నిజాయితీగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేసుకునే అవకాశం కల్పించామని.. అందుకే గణనీయంగా పోలింగ్ జరిగిందని.. ప్రజాభిప్రాయం స్పష్టంగా ప్రతిబింబించడం వలన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందారని అధికార కూటమి పార్టీలు చెప్పుకుంటున్నాయి. అదే సమయంలో బయటి ప్రాంతాల నుంచి వేల మంది తెలుగుదేశం కార్యకర్తలను తరలించి తీసుకువచ్చి వారితో దొంగ ఓట్లు వేయి వేయించారని వైయస్సార్ కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. ఎవరు ఏ ఆరోపణలు చేసినా క్షేత్రస్థాయిలో పరిస్థితులను గమనించిన వారు ఏం చెప్పినా నడుస్తుంది. అంటే వైసీపీ తరఫున అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా లాంటివారు ఎన్నికల సమయంలో అక్కడ ఉన్నారు గనుక వారు ఏం చెప్పినా కనీసం ఆ వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోవచ్చు. కానీ తమాషా ఏంటంటే రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రాంతాలకు చెందిన ఆ పార్టీ నాయకులందరూ కూడా గోల గోల గా మాట్లాడు తున్నారు. బురద చల్లేపనిలో తమ చేతులకు మకిలి అంటించుకుంటున్నారు.
మీడియా ముందు మాట్లాడే చాతుర్యమున్న నాయకులకే ఆ పార్టీ ఈ విషయంలో పెద్దపీట వేస్తున్నది. తడుముకోకుండా అబద్ధాలు చెప్పగల ప్రముఖులు అందరిని పురమాయించి ఆరోపణలు చేయి చేయిస్తున్నది. వారికి పులివెందులలో ఏం జరిగిందో వాస్తవాలు తెలియదు. ఎలా జరిగిందో తెలియదు. వారు స్వయంగా చూడలేదు, తెలుసుకోలేదు, కానీ కేవలం పార్టీ ఆఫీసు నుంచి వచ్చిన స్క్రిప్టులను ఎదుట పెట్టుకొని ఒకటో రెండో పార్టీ ఆఫీసు నుంచి వచ్చిన వీడియోలను చూసి ఎడాపెడా బురద చల్లడం చేస్తున్నారు. ఇలాంటి కుటిల ప్రయత్నాలు పార్టీ పరువు తీస్తాయే తప్ప వారి గౌరవాన్ని ఎలా పెంచుతాయి? అనేది అధినేతలు ఆలోచించడం లేదు. ఇలా మాట్లాడితే రాష్ట్రమంతా సానుభూతి వస్తుంది అని అనుకోవడం ఒక భ్రమ. వాస్తవాలను గమనించిన కడప జిల్లా ప్రజలలోనే జగన్ పట్ల సానుభూతి వ్యక్తం కావడం లేదనేది గుర్తించాలి. ఇలాంటి పాచిపోయిన వ్యూహాలతో జగన్ దళాలు ఇంకా ఎన్నాళ్లు రాజకీయం చేయదలచుకున్నాయో అర్థం కాని సంగతి.
తెలిసీ తెలియకుండా మాట్లాడుతున్న వైసీపీ నేతలు!
Tuesday, December 16, 2025
