హవ్వ.. శాంతియుత ధర్నాను దాడి అంటున్నారే!

Wednesday, April 9, 2025

వైసీపీ నాయకులకు మాత్రమే కాదు.. పెయిడ్ కూలీలుగా వారు విదిలించే డబ్బులకు ఆశపడి.. వారి అనుకూల ప్రచారాలు నిర్వహించేవారికి కూడా మతి చలించినట్టుగా కనిపిస్తోంది. ఎవరైనా తమకు వ్యతిరేకంగా పెదవి కదిపితే చాలు.. వారి మీద పడి దాడిచేసి కొట్టి, రక్కి, విధ్వంసం చేసేసి నానా హింసలు పెట్టడం మాత్రమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన సాగిన రోజుల్లో ఆ పార్టీ వారు అలవాటు చేసుకున్న పద్ధతి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ఆ పార్టీలకు చెందిన వారి మీద నిందలు వేస్తే.. వారు కూడా అచ్చం తమ లాగా విధ్వంసం చేయడం లేదని వారు బాధపడుతున్నట్టుగా ఉంది. శాంతియుత ధర్నాలు చేస్తే కూడా వాటిని దాడులుగా అభివర్ణిస్తూ గోలచేయడానికి ప్రయత్నించడం గమనిస్తే.. ఆశ్చర్యం కలుగుతోంది. కర్నూలులో భూమా అఖిలప్రియకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు ఇలాంటి అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి.

కర్నూలులో చికెన్ పంచాయతీ ఒకటి చోటు చేసుకుంది. చికెన్ సెంటర్ల నుంచి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కిలోకు రూ.10 వంతున కమిషన్లు తీసుకుంటున్నారంటూ.. సాక్షి పత్రిక ఒక కథనం ప్రచురించింది. తనమీద తప్పుడు కథనం ప్రచురించారని ఆరోపిస్తూ.. నిరూపించాలని కోరుతూ.. ఈ కథనానికి నిరసనగా భూమా అఖిలప్రియ సాక్షి స్థానిక కార్యాలయం ఎదుట తన అనుచరులతో కలిసి ధర్నా నిర్వహించారు. కోడిపుంజులను కూడా తీసుకువచ్చి.. ‘మాపై రాసిన తప్పుడు వార్తలకు ఆధారాలు ఎక్కడ’ అంటూ రాసిన ప్లకార్డులను కోళ్ల మెడలో వేలాడదీసి మరీ ఆమె ధర్నా నిర్వహించారు.
పైగా వైసీపీ కాలంలో కిలో చికెన్ రూ.250కు పైగా అమ్ముడుపోయేదని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత చికెన్ ధరలు బాగా తగ్గాయని పేర్కొన్న అఖిలప్రియ.. పేపర్లో వచ్చిన ధరకే చికెన్ దుకాణాల్లో లభించేలా ఒకవైపు తాను పోరాటం సాగిస్తుండగా..  తానే కమిషన్లు తీసుకుంటున్నట్టుగా తప్పుడు వార్తలు ప్రచురించడం సరికాదంటూ.. ఆందోళన చేశారు.

అదే వైసీపీ హయాంలో అయితే పత్రికల్లో వ్యతిరేక వార్తలు వస్తే.. మీడియా కార్యాలయాల మీద దాడిచేసి, ఆస్తులను ధ్వంసంచేసి నానా రచ్చ చేసేవారని ఆమె గుర్తు చేశారు. తాము అలాంటి పనిచేయబోం అంటూ.. ఆఫీసు ఎదుట రోడ్డుపై ధర్నా మాత్రమే చేశారు.

అయితే ఇప్పుడు వైసీపీ పెయిడ్ కూలీలు అఖిలప్రియ చేసిన ధర్నాను దాడిగా అభివర్ణిస్తూ వీధుల్లో యాగీ చేయడం జరుగుతోంది. జర్నలిస్టుల ముసుగులో ఒక ప్రదర్శన లాగా నిర్వహిస్తూ.. పదిమంది కలిసి అఖిలమ్మ మీద ఆరోపణలు చేస్తున్నారు. వార్తలు నచ్చకపోతే చట్టపరంగా తేల్చుకోవాలి తప్ప.. పత్రికాఫీసుల మీద దాడిచేయడం కరెక్టు కాదంటున్నారు. దాడి అంటే అసలు వారు ఏం అనుకుంటున్నారో అర్థం కావడం లేదు. శాంతియుత ధర్నాను కూడా దాడి జాబితాలో కలిపేస్తే.. వారి పార్టీ అప్పట్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి ఆఫీసుల మీద చేసిన విధ్వంసాన్ని ఏం అనాలో ప్రజలకు అర్థం కావడం లేదు. తాముచేసినట్టుగా అఖిలప్రియ దాడులు చేయలేదని వారు కుమిలిపోతున్నట్టుగా ఉంది. ధర్నాలను కూడా తప్పుపడితే.. ఇక ప్రజాస్వామ్యంలో ఆందోళనలకు మనుగడ ఉంటుందా? అనేది ప్రజల మాట. ఇలాంటి పెయిడ్ కూలీల ఆందోళనలవల్ల జగన్ పరువు మరింత పోతుందని ప్రజలు బ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles