హవ్వ! దీనిని పరామర్శ యాత్ర అంటారా?

Friday, December 5, 2025

వందల వాహనాలతో కాన్వాయ్.. కార్లవెంట పరుగులు తీస్తూ వందల మంది జనం.. సీఎం సీఎం అంటూ నినాదాలు.. జగన్ ప్రయాణిస్తున్న వాహనం మీద దారిపొడవునా వెదజల్లుతున్న గులాబీపూలు.. డీజేలు పాటలు, రోడ్లమీద పెద్దపెద్ద ఫ్లెక్సీలు, ప్లకార్డుల్లాగా జగన్ ఫోటోలతో పెద్ద ఫ్లెక్సిలు పట్టుకున్న జనాలు.. పెద్దపెద్ద వాల్యూమ్ తో జగన్ ను కీర్తించే పాటలు.. వాటికి రోడ్డు మీద నృత్యాలు చేస్తూ జనం.. సీఎం సీఎం అంటూ నినాదాలు.. జగన్ కారు మీదికి ఎగబడి.. ఆ కారు బాయ్‌నెట్ మీదికి ఎక్కి గందరగోళంగా కేకలు పెడుతున్న అభిమానులు.. కారులోంచి కాస్త బయటకు నిల్చుని.. రెండు చేతులు ఎత్తి.. వారి కోలాహలాన్ని చిద్విలాసంగా స్వీకరిస్తూ.. అందుకు వారికి అభివాదం చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి!
ఈ ఆర్భాటం చూస్తే ఎవరైనా దీనిని ఒక వ్యక్తిని కోల్పోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్న యాత్ర అంటే నమ్ముతారా? ఆర్భాటాన్ని ప్రదర్శించడానికి, ప్రభుత్వ ఆంక్షలను ధిక్కరించడానికి, ఆ రకంగా తన అహంకారాన్ని ప్రదర్శించడానికి చేసిన ప్రయత్నం తప్ప  మరొకటి కాదు. ఇలాంటి ప్రయత్నాన్ని ఎవరైనా సరే.. అసహ్యించుకుంటారు. జగన్ కావలిస్తే జిల్లా యాత్రల పేరుతో ఇలాంటి ఆర్భాటాన్ని ప్రదర్శించుకోవచ్చు. కానీ.. దానికి పరామర్శ యాత్ర అని ముసుగు వేసి నాటకాలడడం మాత్రం చూసిన వారికి కంపరం పుట్టిస్తోంది. పైకి చెప్పడానికి వారు కూడా ఇష్టపడకపోవచ్చు గానీ.. రెంటపాళ్లలోని నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులు కూడా తమను ఒక పావుగా వాడుకుంటూ జగన్ చేస్తున్న ఆర్భాటం చూసి చీదరించుకుంటారని ప్రజలు భావిస్తున్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. బుధవారం ఉదయం 9 గంటలకు తాడేపల్లి లోని తన నివాసం నుంచి బయలుదేరి.. రెంటపాళ్లకు వెళ్లడం.. 11-12 గంటల మధ్యలో విగ్రహావిష్కరణ, నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేసి నేరుగా తాడేపల్లికి తిరిగి వస్తారనేది పార్టీ ప్రకటించిన షెడ్యూలు దీనికి సంబంధించి మాత్రమే వారు పోలీసులను అనుమతి అడిగారు. కానీ టైం పన్నెండున్నర అయ్యేవరకు కూడా జగన్ గుంటూరు దాటలేదు. పల్నాడు ఎస్పీని మంగళవారం వైసీపీ నాయకులు కలిసినప్పుడు.. తాము ప్రత్యేకంగా జనాన్ని తరలించబోయేది లేదని అన్నారు. చివరికి రెంటపాళ్లకు కాదు కదా.. జగన్ ప్రయాణిస్తున్న రోడ్ల పొడవునా గుంటూరులో కూడా జనాన్ని తరలించి ఆర్భాటం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గుంటూరు సెంటర్ల వద్ద నాయకులు తిష్టవేసి.. జగన్ కాన్వాయ్ కు స్వాగతం వంటి ఆర్భాటాలు చేస్తున్నారు. చూసిన ప్రజలు మాత్రం హవ్వ దీనిని పరామర్శ యాత్ర అంటారా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
ముఖ్యమంత్రిగా ఒక్క చాన్స్ ఇచ్చినందుకే విరక్తి పుట్టి.. జగన్ ను జనం ఛీకొట్టి జస్ట్ ఒక్క సంవత్సరం మాత్రమే పూర్తయింది. ఇలాంటి పెయిడ్ కూలీలను తోలించుకుని.. వారితో ‘సీఎం సీఎం’ అని దారిపొడవునా నినాదాలు చేయించుకుంటూ జగన్ చేస్తున్న ప్రచారయావ గమనిస్తే ప్రజలకు చీదర పుడుతోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles