అప్పుడే మేల్కొని ఉంటే పవన్ కు బెదిరింపు వచ్చేదేనా?

Tuesday, January 21, 2025

పవన్ కల్యాణ్ ను చంపేస్తా అంటూ.. ఒక వ్యక్తి.. ఆయన పేషీలోని ఓఎస్డీ వెంకటకృష్ణ అనే వ్యక్తికి ఫోను చేసి బెదిరించడం తాజాగా రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా ఉంది. చంపేస్తాననే బెదిరింపు వచ్చినది సాక్షాత్తూ ఉపముఖ్యమంత్రికి కావడంతో పోలీసులు చురుగ్గానే స్పందించారు. కాల్ వచ్చిన నెంబరును బట్టి.. ఆ వ్యక్తి ఎన్టీఆర్ కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన నక్కా మల్లికార్జునరావుగా గుర్తించారు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే.. పోలీసులు కొన్ని రోజులు ముందుగానే మేల్కొని ఉంటే.. అసలు ఇవాళ పవన్ కల్యాణ్ కు ఇలాంటి బెదిరింపు ఫోను కాల్ వచ్చేదే కాదు గదా అని! ఎందుకంటే.. కొన్ని రోజుల కిందట అదే వ్యక్తి అదే నెంబరు నుంచి హోం మంత్రి అనిత కు కూడా బెదిరింపు ఫోన్ కాల్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.

పవన్ కల్యాణ్ కు వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్స్ గురించి డీజీపీ కార్యాలయానికి ఫిర్యాదులు రావడంతో.. విజయవాడ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎంజీరోడ్డును జల్లెడ పట్టారు. స్థానికులను విచారించగా.. నక్కా మల్లికార్జున రావు గా పేరుగల వ్యక్తి ఎవరూ అక్కడ లేరని కూడా తెలుసుకున్నారు. పోలీసులు వెతకడం ప్రారంభించే సమయానికే ఆగంతకుడు ఫోను స్విచాఫ్ చేయడంతో.. వేట కష్టం అయిపోయింది. బస్సుస్టాండు, రైల్వేస్టేషన్ కూడా గాలించారు గానీ ఫలితం దక్కలేదు. పోలీసులు లొకేషన్ ట్రాక్ చేసిన కాసేపటికే ఫోను స్విచాఫ్ అయింది.

ఇదంతా ఒక ఎత్తు. పవన్ కల్యాణ్ కు బెదిరింపు కాల్ వచ్చిందని చెప్పిన తర్వాత.. కొన్ని రోజుల కిందట హోంమంత్రి అనితకు కూడా బెదిరింపు కాల్ ఇదే నెంబరు నుంచి వచ్చిందని అంటున్నారు. మరి హోంమంత్రికి బెదిరింపు వచ్చినప్పుడే పోలీసులు ఇంతే చురుగ్గా స్పందించి ఉంటే.. కనీసం పవన్ కల్యాణ్ కు కాల్ వచ్చేదే కాదు కదా.. అనేది అందరి అనుమానం. నాయకుల్లో కూడా ఒక్కొక్కరి పట్ల పోలీసులు ఒక్కో రకమైన విధేయత ప్రదర్శిస్తున్నారా అనే అభిప్రాయం కూడా కలుగుతుంది.
ఏది ఏమైనప్పటికీ.. ఇలాంటి ఆకతాయి ఫోను కాల్స్ ను కట్టడి చేయడం పోలీసుల బాధ్యత. స్విచాఫ్ చేయడం అనేది శాశ్వతంగా తప్పించుకోగల మార్గం అని తప్పుడు పనులు చేసేవాళ్లు చెలరేగకుండా ఉండాలంటే.. పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles