విరాళాల మీద కూడా విషం కక్కుతున్న ప్రబుద్ధులు! 

Friday, September 13, 2024

ప్రజల కోసం ప్రభుత్వం చేపట్టే కొన్ని మంచి పథకాలను అమలు చేయడంలో భాగస్వామ్యం వహించడానికి వదాన్యులు ముందుకు రావడం సహజం. సంపన్నులు, ఔత్సహికులు ఇచ్చే విరాళాలతో కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా నడుస్తుంటాయి. ప్రభుత్వ సొమ్మును అన్ని పనులకు  ఖర్చు పెట్టకుండా.. కొన్నింటిని విరాళాలతో నడిపించే ప్రయత్నం పట్ల ఎవరైనా సరే హర్షామోదాలు వ్యక్తం చేయాలి. కానీ ఊరందరిదీ ఒక తీరు అయితే.. ఉలిపికట్టేది ఇంకొకదారి.. అన్న సామెత చందంగా వ్యవహరిస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. పేదవాడికి చవకగా అన్నం పెట్టే అద్భుతమైన సేవా కార్యక్రమం అన్న క్యాంటీన్ వ్యవస్థకు మద్దతుగా విరాళాలు వెల్లువెత్తుతు ఉంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సహించలేకపోతున్నారు. విరాళాలతో ఈ కార్యక్రమాన్ని నడపడం సిగ్గుచేటు అని అసహ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి. 

జగన్మోహన్ రెడ్డి దళాలు అధికారంలో ఉన్నంతకాలం రాష్ట్రాన్ని దోచుకోవడం ఒక్కటే లక్ష్యంగా పరిపాలన సాగించారు. విరాళాలతో ఒక అద్భుతమైన పథకాన్ని నిర్వహిస్తే వారు ఓర్చుకోలేకపోతున్నారు. ఎంతగా దోచుకోగల సొమ్ము మిస్ అవుతుందో కదా అని వారు కుమిలిపోతున్నట్లుగా కనిపిస్తోంది. 

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేవలం అన్న క్యాంటీన్ ల కోసం మాత్రమే కాదు.. అమరావతి రాజధాని నిర్మాణానికి కూడా విరివిగా విరాళాలు ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటికే బోలెడన్ని నిధులు వచ్చి పడుతున్నాయి కూడా. అమరావతి రాజధానిని పూర్తిచేసే క్రమంలో ఆ రకంగా ప్రజలను కూడా భాగస్వాములు చేస్తున్నారు ఆయన! అయితే అమరావతి ప్రాంతాన్ని స్మశానం లాగా మార్చేయాలని కంకణం కట్టుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ పరిణామాలు మింగుడు పడడం లేదు. అక్కడ ఒక అద్భుతం నగరం ఏర్పడితే కనుక తమ పార్టీకి అది శాశ్వత సమాధి అవుతుందనే భయం వారిని వెన్నాడుతోంది. అమరావతిని అంటే తమ దుర్బుద్ధిని ప్రజలు గుర్తిస్తారనే భయంతో.. అన్న క్యాంటీన్లకు విరాళాలు తీసుకునే వైఖరిని నిందిస్తున్నారు. 

ఆ మాటకొస్తే అయోధ్యలో రామాలయం నిర్మించినా సరే అది ప్రజల విరాళాలతోనే జరిగింది. ప్రభుత్వం సొమ్ముతో కట్టలేదని నింద వేయగల దమ్ము ఈ పార్టీ నాయకులకు ఉన్నదా అనేది సామాన్యుల ప్రశ్న. కొన్ని మంచి పనులు చేసేటప్పుడు స్వచ్ఛందంగానే ప్రజలు విరాళాలు అందిస్తారు. ఐదేళ్ల పదవీ కాలాన్ని అనుభవించిన ప్రజల కోసం ఒక్క మంచి పని కూడా తలపెట్టలేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దుర్బుద్ధికి ఈ విరాళాల కాన్సెప్ట్ అంత సులువుగా అర్థం కాదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. 

ఇది మాత్రమే కాదు.. రేపు జన్మభూమి పనులు ప్రారంభమైనా కూడా అంతో ఇంతో స్థానిక ప్రజల భాగస్వామ్యంతో స్థానికంగా వారి అవసరాలు తీర్చే నిర్మాణాత్మక అభివృద్ధి పనులు కొంత విరాళాలతోనే జరుగుతాయి. ఐదేళ్ల పాలనలో రోడ్లమీద ఏర్పడిన గోతులు కూడా పూడ్చలేని అసమర్ధ జగన్ ప్రభుత్వ నాయకులకు ఇలాంటి పనులు జరగడం అనేది కచ్చితంగా భయపెట్టే అంశం. అందుకే చంద్రబాబు సర్కారులో ఒక్క మంచి పని జరుగుతున్నా సరే దానికి వంద రకాలుగా వైసిపి నాయకులు భయపడుతున్నారని ప్రజలు అంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles