శాసనసభకు ఆబ్సెంట్ అయ్యే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే చట్టాన్ని ఏపీ స్పీకరు ప్రయోగించదలచుకుంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి? ఆ చట్టాన్ని స్పీకరు అయ్యన్నపాత్రుడు ప్రయోగించదలచుకుంటే గనుక.. నష్టం జరిగేది.. రఘురామ చెప్పినట్టుగా జగన్ ఒక్కడికే కాదు. మొత్తం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దబిడి దిబిడే అయిపోతుంది. శాసనసభలో వైసీపీ ప్రాతినిధ్యమే సున్న అవుతుంది. ఉన్నదే 11 మంది. అందరూ కూడా మళ్లీ ఉపఎన్నికలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి ఉత్పన్నం అయితే.. ఇప్పుడున్న వారిలో ఒకరిద్దరు తప్ప.. మిగిలిన వాళ్లు మళ్లీ గెలవడం అసాధ్యం అనే భయం ఆ పార్టీలోనే కనిపిస్తోంది.
శాసనసభకు హాజరు కాకపోవడం అనేది కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క అహంకారానికి నిదర్శనం మాత్రమే. నిబంధనలు, సాంప్రదాయాలు అనుమతించవని తెలిసి కూడా కేవలం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా.. అయ్యన్నపాత్రుడు స్పీకరు స్థానంలో, రఘురామ క్రిష్ణ రాజు డిప్యూటీ స్పీకరు స్థానంలో ఉండగా తాను సభలో వారిని సార్ అని పిలవాల్సిన పరిస్థితిని జగన్ ఊహించుకోలేకపోతున్నారు. వారి పట్ల ఆయనలో ఎంతటి ద్వేషభావం ఉన్నదో పార్టీ నాయకులకు తెలుసు. అలాగని.. తమ అందరి రాజకీయ జీవితాలను పణంగా పెట్టడం తగదని వారు అనుకుంటున్నారు. ఉన్న 11 మందిలో కొందరు మొన్నటి ఎన్నికల్లోనే చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా గెలిచారు. మరోసారి ఎన్నిక ఎదుర్కోవడం అంటే ఆర్థికంగా తట్టుకోగలిగే శక్తికూడా వారికి లేదు. ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి శాసనసభకు హాజరయ్యే విషయంలో కొన్ని సడలింపులు ఇవ్వాలని, ఆయన గైర్హాజరైనా ఒకే గానీ.. తాము హాజరు కావడానికి అనుమతించాలని వారు కోరుతున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ప్రభుత్వం మీద నమ్మకం లేదని అంటున్నట్టుగా, ఆ సాకుతో ఎన్నికలు ఎగ్గొడుతున్నట్టుగా.. అనర్హత వేటు పడి ఉప ఎన్నికలు వస్తే.. వాటిని కూడా జగన్ దూరం పెడతారేమో అనే భయం కూడా వారిలో ఉంది. అలాంటి పరిస్థితి వస్తే.. అసలు అసెంబ్లీలో వైసీపీ ప్రాతినిధ్యమే లేకుండా.. విచిత్రమైన పరిస్థితి ఏర్పడుతుందని కూడా పలువురు భావిస్తున్నారు.
జగన్ అహంకారం కోసం పార్టీని పణంగా పెట్టడం మంచి పద్ధతి కాదని వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైనా జగన్ ఒక మెట్టు దిగి ప్రజా సమస్యలను సభలోంచే నిలదీస్తాం అని ఒక ప్రకటన చేసి.. సభకు హాజరయ్యేలా విధానం మార్చుకోవాలని అభిలషిస్తున్నారు. తమ పార్టీ నాయకుల్లో ఉండే ఆందోళనను అర్థం చేసుకునే నడుచుకునేంత పరిణతి జగన్ మోహన్ రెడ్డిలో ఉన్నదా లేదా అనేది మాత్రం అనుమానమే!
శాసనసభలో వైసీపీ ప్రాతినిధ్యం ఉండదా?
Friday, March 14, 2025
