వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఈ ఎన్నికల్లో తిరస్కరించిన తీరుతెన్నులు గమనించిన తర్వాత.. ఆ పార్టీకి ఇక ఎప్పటికీ భవిష్యత్తు ఉండదనే భయం పలువురిలో కలుగుతోంది. అందుకే నాయకులు పెద్దాచిన్నా స్థాయుల తేడా లేకుండా ఎవరికి వారు తమ దారి తాము చూసుకుంటున్నారు. వైసీపీని వదలివెళితే చాలు.. ఇక రాజకీయం కూడా అక్కర్లేదు. కానీ, ఈ పార్టీలో ఉంటే మాత్రం మరింతగా పతనం అయిపోతాం అనే భయంలో కూడా కొందరు ఎక్కడా చేరకపోయినా, ఇక్కడ రాజీనామా చేసేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే పలు మునిసిపాలిటీలు వైసీపీ ఖాతాలోంచి జారిపోతుండగా.. తాజాగా జగ్గయ్యపేట కూడా అదే వరుసలో నిలుస్తోంది.
జగ్గయ్యపేట మునిసిపాలిటీలో మొత్తం 27 వార్డులున్నాయి. తాజాగా 12 మంది కౌన్సిలర్లు వైఎస్సార్ కాంగ్రెస్ కు రాజీనామా చేసేశారు. ఇక అక్కడ కూటమి ప్రభుత్వ జెండా ఎగరడం కేవలం లాంఛనమే.
అయితే ఇక్కడ ఒక విషయాన్ని కీలకంగా గమనించాల్సి ఉంది. సాధారణంగా మునిసిపాలిటీలలో పవర్ చేతులు మారుతున్నప్పుడు అవన్నీ కూడా తెలుగుదేశం ఖాతాలోకి వెళుతున్నాయి. ఈ జగయ్యపేట మునిసిపాలిటీ మాత్రం జనసేన ఖాతాలోకి వెళ్లవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు.
నిజానికి జగ్గయ్యపేట వ్యవహారం చాలా రోజులుగా వార్తల్లో వినిపిస్తోంది. కౌన్సిలర్లు పార్టీ మారుతారనే చర్చ ఉంది. కానీ తాజాగా అక్కడి వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఆ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత.. కౌన్సిలర్ల వ్యవహారం కూడా సెటిలైంది. సామినేని ఉదయభాను వారికి స్ఫూర్తి అని కూడా తెలుస్తోంది. సామినేని తాను జనసేనలో చేరడానికి నిర్ణయించుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆయనతో పాటు ఈ 12 మంది కౌన్సిలర్లు కూడా జనసేనలో చేరే అవకాశం ఉంది. అంటే.. ఒక మునిసిపాలిటీ జనసేన ఖాతాలోకి వస్తుందన్నమాట.
అందరూ గంపగుత్తగా తెలుగుదేశం మీద ఆశలు పెంచుకోకుండా.. జనసేన వైపు వెళ్లడం మంచి పరిణామమే అని.. అయితే ఇలాంటి చేరికల వలన కూటమి ఐక్యతలో ఇబ్బంది రాకుండా చూసుకోవాలని పలువురు అంటున్నారు.