తెనాలిలో గంజాయి బ్యాచ్ రౌడీషీటర్ల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లి.. జగన్మోహన్ రెడ్డి తన పరువు తానే తీసుకున్న వైనం ప్రజలకు గుర్తుండే ఉంటుంది. ప్రభుత్వ చర్యలు అకృత్యాలుగా కనిపించినప్పుడు.. ప్రతిపక్షం నిరసనలతో హోరెత్తించడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ.. ఇక్కడ వైసీపీ తీరు మాత్రం.. అరాచకాలు తామే చేసి, నిరసనలు కూడా తామే వ్యక్తం చేస్తున్నట్టుగా ఉంది. ఆ రకంగా అప్పుడు తప్పుడు వ్యక్తుల కోసం సానుభూతి చూపిస్తూ తెనాలిలో వైఎస్ జగన్ పర్యటించడం, వారి కుటుంబాలను పరామర్శించడం వల్ల.. స్థానికులు కూడా ముక్కున వేలేసుకున్నారు. ఆ పర్యటనతో జగన్ పరువే పోయిందని అంతా అనుకున్నారు. ఇప్పుడు సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించే విషయంలో జగన్ ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం కూడా అందుకు భిన్నంగా ఎంతమాత్రమూ లేదు. పైగా ఇంకో కోణంలో కూడా జగన్ పరువు తీయడానికి ఈ పర్యటన కారణం కానున్నది.
రెంటపాళ్లలో నాగమల్లేశ్వరరావు అనే పార్టీ కార్యకర్త విగ్రహాన్ని ఆవిష్కరించడమూ, అలాగే ఆయన కుటుంబాన్ని పరామర్శించడమూ అనేది జగన్ షెడ్యూలు. అయితే ఈ నాగమల్లేశ్వరరావు చనిపోయింది ఎప్పుడు? ఎందుకు? అనే వివరాలు తెలుసుకుంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది.
2024 జూన్ 9వ తేదీన నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయినందుకు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక పార్టీ ఎన్నికల్లో ఓడిపోతే.. ఒక సాధారణ కార్యకర్త ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితి ఉంటుందా? ఓడిన పార్టీ మళ్లీ గెలిచే అవకాశం ఉంటుంది కదా అనే అనుమానం ఎవ్వరికైనా కలుగుతుంది. కానీ.. నాగమల్లేశ్వరరావు కథ వేరు. వైసీపీ గెలుస్తుందని చెప్పి ఆయన అప్పులు తెచ్చి మరీ.. పది కోట్ల రూపాయలు బెట్టింగులు కాశారు. ఈ ఎన్నికల బెట్టింగుల్లో మొత్తం సొమ్ములు పోయాయి. పార్టీ ఓడిపోయిన వెంటనే.. అప్పుల వాళ్ల నుంచి ఆయన మీద ఒత్తిళ్లు పెరిగాయి. వాటిని భరించలేక చనిపోయారు. ఇంతకూ ఆయన బెట్టింగులు కాయడానికి కారణం ఎవ్వరు? సాక్షాత్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డే! వైనాట్ 175 అనే నినాదాన్ని నాటకీయంగా వినిపిస్తూ.. భారీ మెజారిటీతో గెలవబోతున్నాం అని జగన్ ఊదరగొడుతూ రెచ్చిపోవడం వల్ల.. తాను అభిమానించే నాయకుడి మాటలు నిజం అనుకుని నాగమల్లేశ్వరరావు బెట్టింగులు కాశారు.అంటే.. ఆయన మరణానికి కారకుడు వైఎస్ జగనే! తగుదునమ్మా అంటూ ఆయనే ఇప్పుడు కుటుంబపరామర్శకు రావడం అవమానకరం కాక మరేమిటి?
ఇంతకంటె దారుణమైన ట్విస్టు ఏంటంటే.. పార్టీ కార్యకర్త ఇంత దారుణంగా తన తప్పుడు అంచనాల ఫలితంగా కడతేరిపోతే.. ఆ కుటుంబాన్ని గత ఏడాది కాలంలో జగన్ పరామర్శించనేలేదు. పలకరించనేలేదు. ఇప్పుడంటే.. కూటమి ప్రభుత్వం మీద బురద చల్లడానికి ఆ మరణాన్ని కూడా ఒక సాకుగా వాడుకోదలచి.. జగన్ పర్యటన పెట్టుకున్నారని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ అరాచకత్వాల్ని అసహ్యించుకుంటూ ఒకవైపు సత్తెనపల్లి మునిసిపాలిటీలోని నలుగురు కౌన్సిలరు తాజాగా తెలుగుదేశంలో చేరిపోయిన నేపథ్యంలో.. ఇలాంటి తప్పుడు ప్రచారాల పర్యటన జగన్ పరువును సత్తెనపల్లి ప్రాంతంలో మరింతగా దిగజారుస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు.
ఈ పరామర్శ కూడా జగన్ పరువు తీయనుందా?
Friday, December 5, 2025
