దేవుడి సేవకు సంబంధించిన పదవి దక్కితే ఎవరైనా సరే.. తమ జీవితాలను అలాంటి అవకాశంతో తరింపజేసుకోవాలని అనుకుంటారు. కానీ భూమన కరుణాకరరెడ్డి రూటే సెపరేటు. ఆయన దేవుడిని కూడా తన సొంత, రాజకీయ ప్రయోజనాలకు ఒక పావులాగా వాడుకోవాలని అనుకుంటారు! తన కొడుకు రాజకీయ జీవితాన్ని పట్టాలెక్కించడానికి దేవుడి సొత్తును దోచి, పంచిపెట్టేయాలని కూడా అనుకుంటారు. దేవుడి సేవ రూపంలో పదవిలో ఉండడమే.. తన కొడుకును శాసనసభకు పంపడానికి సోపానం కావాలని ఆరాటపడుతుంటారు. అయితే.. ఇప్పుడు భూమన పదవికే గండం వచ్చే అవకాశం కనిపిస్తోంది. ధార్మిక పదవిలో ఉంటూ ఆయన రాజకీయ వేషాల మీద కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందుతున్నాయి. ఈసీ కన్నెర్ర జేస్తే.. భూమన పదవి ఊడే అవకాశం ఉంది.
జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన నాయకుల్లో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఒకరు. ప్రత్యక్ష రాజకీయాలనుంచి విరమించుకుని కొడుకు అభినయ రెడ్డిని ఎమ్మెల్యే చేయాలని ప్రణాళిక వేసుకున్న కరుణాకర్ రెడ్డి, జగన్ మీద ఒత్తిడి చేసి తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు.
వేంకటేశ్వరుని సేవలో తరించే మహదవకాశం అయిన ఆ పదవి దక్కిన నాటినుంచి ఆయన తన కొడుకును ఎమ్మెల్యేగా గెలిపించడానికి అవసరమైన వ్యూహాలు వేయడం ప్రారంభిపంచారు. టీటీడీ నిధులతో తిరుపతి మునిసిపాలిటీ అభివృద్ధికి ప్రతి ఏటా టీటీడీ బడ్జెట్ నుంచి భారీ మొత్తం కేటాయించేలా.. ఒక ప్రతిపాదనను సిద్ధం చేశారు. ప్రస్తుతం తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా కూడా ఉన్న కొడుకు అభినయ్ రెడ్డికి అనుకూలంగా ఈ నిర్ణయాన్ని ప్రచారం చేసుకోవచ్చునని తలపోశారు. అయితే దేవుడి సొమ్మును అడ్డగోలుగా వాడుతున్నారని ఆరోపణలు రావడంతో.. ప్రభుత్వమే ఆ ప్రతిపాదనను తిరస్కరించింది.
ఇప్పుడు టీటీడీ ఛైర్మన్ గా ఉంటూ.. ఆయన చురుగ్గా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ పోకడపై బిజెపి నాయకుడు భానుప్రకాష్ రెడ్డి తదితరులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తిరుపతి నియోజకవర్గం పరిధిలో 28వేల టీటీడీ ఉద్యోగుల కుటుంబాలు ఉన్నాయని, టీటీడీ ఛైర్మన్ హోదాలో కరుణాకర్ రెడ్డి వారందరి ఓట్లను ప్రభావితంచేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఆ హోదాలో ఉండి ఎన్నికల ప్రచారం చేయడం తగదని, ఆయనను పదవినుంచి తప్పించాలని వారు కోరారు. ఈసీ ఈ ఫిర్యాదును సీరియస్ గా పరిగణిస్తే.. కరుణాకర్ రెడ్డి పదవి ఊడుతుందని పలువురు అంచనా వేస్తున్నారు.